రూ.10 లక్షల కట్నం, 35 తులాల బంగారం.. పెళ్లై ఏడాది కాకముందే…
29 April 2022, 22:32 IST
- వరకట్నం వేధింపులు తట్టుకోలేక ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సూసైడ్ చేసుకుంది.కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మరోవైపు సిరిసిల్లలోని భర్త ఇంటి ముందు ఆందోళన చేశారు మృతురాలి బంధువులు.
వరకట్న వేధింపులకు బలి
ఆమె సాఫ్ట్ వేర్ ఉద్యోగిని... 11 నెలల క్రితం వివాహమైంది. అతను కూడా సాఫ్ట్ వేర్ ఉద్యోగే.! కొంతకాలం బాగానే నడిచింది. సీన్ కట్ చేస్తే... అమ్మాయిపై వరకట్న వేధింపులు మొదలయ్యాయి. చేసుకున్న భర్తతో పాటు కుటుంబసభ్యులు కూడా అదే బాటలో నడిచారు. వేధింపులు తట్టుకోలేక పుట్టింటికి వెళ్లినా.. వేధింపులపర్వం ఆగలేదు. దీంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.
వివరాలు ఇలా ఉన్నాయి..
సిరిసిల్ల పట్టణానికి చెందిన జూపల్లి శ్రీనివాసరావుకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురైన నిఖిత(26)కు సిరిసిల్ల పట్టణానికే చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఉదయ్ తో గతేడాది జూన్ 6న వివాహం జరిపించారు. ప్రస్తుతం శ్రీనివాసరావు కుటుంబం కూకట్ పల్లిలోని నివాసం ఉంటుంది. అయితే వివాహ సమయంలో రూ.10 లక్షల నగదు, 35 తులాల బంగారు ఆభరణాలను ఇచ్చారు. పెళ్లి ఘనంగా జరిపించారు. ఇంతవరకు ఓకే. అయితే శ్రీనివాసర్ రావు కు ఉన్న 4 ఎకరాల భూమిపై అల్లుడి కన్నుపడింది. ఇందులో సగ భాగం రాసివాలని భార్యపై ఒత్తిడి తీసుకువచ్చాడు. అయితే ఇందుకు శ్రీనివాస్ రావు ఒప్పుకోలేదు. తాను ఉన్నంతవరకు ఎవరికి ఇచ్చేది లేదని తేల్చి చెప్పాడు. ఇదే సమయంలో నిఖితపై ఉదయ్ వేధింపులు ఎక్కువయ్యాయి. అయితే ఇటీవల అల్లుడు ఉదయ్ కు మరో రూ. 10 లక్షలు ఇచ్చారు. అయినప్పటికీ అత్తింటి వేధింపులు ఆగలేదు. లాభంలేదని ఏప్రిల్ 2వ తేదీన పుట్టింటికి వచ్చింది నిఖిత. అయినా కూడా భార్యకు ఫోన్లు చేస్తూ వేధించటం మొదలుపెట్టాడు భర్త ఉదయ్. వీటిని తట్టుకోలేని నిఖిత.. కూకట్ పల్లిలో నివాసం ఉంటన్న ఇంట్లోనే గురువారం తెల్లవారుజామున ఉరేసుకుంది.
ఉదయ్ ఇంటి ముందు ఆందోళన...
నిఖిత మృతదేహాన్ని స్వగ్రామమైన సిరిసిల్లకు తరలించారు. అయితే మృతదేహాంతో సిరిసిల్లలోని అత్తగారి ఇంటిముందు ధర్నా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు పోలీసులకు సమాచారం అందటంతో.. వారి అంబులెన్స్ ను కస్బెకట్కూర్‌కు పంపించారు. అయితే అప్పటికే మృతురాలి పెద్దనాన్నతో పాటు పలువురు బంధువులు ఉదయ్ ఇంటికి వెళ్లారు. అయితే అక్కడ ఎవరు లేకపోవడంతో ధర్నాకు దిగారు. ఈ ఘటనపై హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
టాపిక్