Mrigasira Karthi: మృగశిర కార్తె ప్రారంభం.. తొలి రోజు చేపలు ఎందుకు తింటారంటే?
08 June 2022, 7:25 IST
- Mrigasira Karthi 2022: ఇవాళ్టి నుంచి మృగశిర కార్తె ప్రారంభం కానుంది. కృత్తిక, రోహిణి కార్తెల్లో ఎండలతో అల్లాడిపోయే జీవకోటికి మృగశిర కార్తె ప్రవేశం ద్వారా కాస్త ఉపశమనం కలుగుతుంది. వర్షారంభానికి సూచనగా భావించే ఈ కార్తెలోనే రుతుపవనాలు ప్రవేశిస్తాయి. మరోవైపు ఇవాళ హైదరాబాద్ లోని చేపల మార్కెట్లన్నీ పుల్ రద్దీతో దర్శనమిస్తున్నాయి.
మృగశిర కార్తె ప్రారంభం
Importance and Significance of Mrigasira karthi: మృగశిర.... ఈ కార్తె వస్తే చాలు రైతులు ఏరువాకకు సిద్ధమవుతుంటారు. అందుకే ఈ కార్తెను ఏరువాక సాగే కాలం అంటుంటారు. ఏరువాక అంటే నాగటి చాలు. ఈ కాలంలో నైరుతి ప్రవేశంతో తొలకరి జల్లులు కురుస్తుంటాయి. దీంతో పొలాలు దున్ని పంటలు వేయటం ప్రారంభిస్తుంటారు. మృగశిర కార్తె ఆరంభమైన రోజును వివిధ ప్రాంతాల్లో పలు పేర్లతో పండగ జరుపుకుంటారు. ఇక మృగశిర కార్తె అనగానే చేపలు గుర్తొస్తాయి. తొలిరోజు రోజు చేపలకు యమ గిరాకీ ఉంటుంది. ఏ మార్కెట్ చూసినా... రద్దీగా కనిపిస్తుంటాయి. ప్రతి పల్లెలోని చెరువుల వద్ద సందడి కనిపించే దృశ్యాలు దర్శనమిస్తుంటాయి.
చేపలు ఎందుకు తింటారంటే..?
ఇవాళ్టి నుంచి ప్రారంభమైన మృగశిర కార్తె 15 రోజుల పాటు ఉంటుంది. తొలిరోజు ప్రజలు చేపలు తినేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఈ పద్ధతి ఆనాదిగా వస్తోంది. చేపలు తింటే.. వ్యాధులు దూరమవుతాయనేది ప్రజల బలమైన నమ్మకం. దీనికి ఓ కారణం ఉందడోయ్..! ఎండకాలం తర్వాత వాతావరణం చల్లబడటంతో మన శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీంతో వేడి ఉండేందుకు చేపలను తింటారు. దీని వల్ల గుండె జబ్బులు, ఆస్తమా రోగులకు ఉపశమనం కలుగుతుందని చెబుతుంటారు.
మరోవైపు కార్తె రాకతో వర్షాలు పడుతుంటాయి. ఫలితంగా కొన్ని సీజనల్ వ్యాధలు ప్రబలే అవకాశం ఉంటుంది. తద్వారా కాస్త ఇమ్యూనిటీ పవర్ తగ్గే అవకాశం ఉంటుంది. ఈ సమస్యల నుంచి బయటపడేందుకు చేపలు తింటుటారానే వాదన ఉంది. మొత్తంగా కార్తె తొలిరోజు రోజున ఏ ఇంట చూసినా వంట గదిలో చేపల పులుసు, వేపుడు వాసన గుమగుమలు కమ్మగా వస్తుంటాయి.
ప్రజలు ఎక్కువగా ఇష్టపడే కొర్రమీను, రోహు, కట్ల, తిలాపియా, సీర్, సోల్మన్, రవ్వ, కింగ్‌ఫిష్, చందమామ, బండగ, తున, రెడ్ స్నాప్పర్, బెంగాల్ క్రాప్, పింక్ పెర్చ్, బ్లూ కర్బ్స్ వంటివన్నీ మార్కెట్లలో దొరుకుతుంటాయి. వీటన్నింటిలో కొర్రమీనును మరింత ఇష్టపడుతుంటారు చేపల ప్రియులు..!