తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Siddipet : సిద్ధిపేట జిల్లాలో 6 వేల ఏళ్ల నాటి రాతి గొడ్డలి, గ్రానైట్ పూస లభ్యం

Siddipet : సిద్ధిపేట జిల్లాలో 6 వేల ఏళ్ల నాటి రాతి గొడ్డలి, గ్రానైట్ పూస లభ్యం

HT Telugu Desk HT Telugu

12 September 2023, 17:27 IST

google News
    • Siddipet : సిద్దిపేట జిల్లాలో దాదాపు 6 వేల ఏళ్ల కిందటి రాతి పనుముట్లు లభ్యమయ్యాయి. నర్మెట గ్రామంలో కొత్త రాతి యుగం నాటి రాతి గొడ్డలిని పరిశోధకులు గుర్తించారు.
రాతి యుగం నాటి పనిముట్లు
రాతి యుగం నాటి పనిముట్లు

రాతి యుగం నాటి పనిముట్లు

Siddipet : సిద్దిపేట జిల్లాలో కొత్త రాతి యుగం నాటి పనిముట్లను గుర్తించారు పరిశోధకులు. సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలంలోని దేవుని నర్మెట గ్రామ శివారులో కొత్త రాతి యుగం నాటి ఒక రాతి గొడ్డలిని పరిశోధకుడు కొలిపాక శ్రీనివాస్ గుర్తించారు. శ్రీనివాస్ కు లభించిన రాతిగొడ్డలి ద్వికుంభాకార, త్రిభుజాకృతిలో ఉన్న గ్రానైట్ రాతి పనిముట్టు. తక్కువగా వాడిన కొత్త పరికరం. ఆ గొడ్డలిని ఎక్కువ నూరలేదు, ఎక్కువగా వాడలేదని తెలుస్తోంది. దీని బరువు 116 గ్రాములుగా ఉంది. చక్కని పనితనంతో చెక్కిన రాతిగొడ్డలి. ఇది కొత్తరాతియుగం చివరిదశలో తయారు చేయబడిందని పరిశోధకులు అంటున్నారు. దాదాపు 6 వేల సంవత్సరాల కిందట తయారుచేసిన పనిముట్టు అని గుర్తించారు.

ఇనుము తయారీ బట్టీ

నర్మెట్ట గ్రామంలోనే ఇనుము తయారీ బట్టీని ఇటీవల పరిశోధకులు గుర్తించారు. అక్కడ బట్టీ ఇటుకలతో కాల్చిన, మట్టిగొట్టాలతో నిర్మించినట్టు తెలుస్తుంది. ఇక్కడ లభించిన ఇటుకలు చాలా దృఢంగా ఉన్నాయి. 7,8 అంగుళాల పొడవు, 4 అంగుళాల వెడల్పు, 3 అంగుళాల మందంతో ఉన్నాయి. మట్టిగొట్టాలు అమర్చడానికి తగినట్టు ఇటుకలలో అర్థవృత్తాకారపు గాడులు చేశారు. గొట్టాలలో కరిగించిన ఇనుము ప్రవహించేదని ఒక గొట్టంలో ఇరుక్కుని ఉన్న ఇనుముతో తెలుస్తోంది. ఈ ఇటుకలు, మట్టిగొట్టాల తయారీ ఆధారంగా అక్కడ 17వ శతాబ్దపునాటి ఇనుము తయారీ బట్టీ ఉండేదని నిర్థారించారు చరిత్రకారులు. పూర్వ నిజామాబాద్ జిల్లా కోనసముద్రంలో ఇటువంటి కాల్చిన మట్టిగొట్టాలు, ఇనుముం చిట్టేలు లభించాయి. కొత్తరాతియుగం మానవులు పాతరాతియుగంనాటి పెద్ద, పెద్ద బరువైన రాతి పనిముట్ల స్థానంలో రాతిబ్లేడ్లను, సూక్ష్మ రాతిపనిముట్లనే కాక తమదైన శైలిలో గట్టిరాళ్లతో చేసిన చేతి గొడ్డళ్లను, వడిసెల రాళ్లను జంతువుల వేటలో వాడేవారని తెలుస్తోంది. పనిముట్ల తయారీలో Reduction of Tools గొప్ప పరిణామాన్ని తెచ్చింది. వేట, ఆహార సేకరణల దశ నుంచి వ్యవసాయాన్ని చేపట్టిన తరుణంలో తరుచుగా పనిముట్ల పొదిని దూర, భారాలు మోయాల్సిన పనిని తగ్గించడానికి బరువు తక్కువగా ఉండి, మన్నికగా వుండే రాళ్లతో పరికరాలను తయారు చేసుకున్నారు. అవే రాతిగొడ్డళ్లు, ఇతర పనిముట్లని కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ అభిప్రాయపడ్డారు.

తొలి చారిత్రక యుగానికి చెందిన రాతిపూస

తెలంగాణ చరిత్ర బృందం పరిశోధకుడు కొలిపాక శ్రీనివాస్ సిద్ధిపేట జిల్లా మండల కేంద్రం నంగునూరులో ఒక గ్రానైట్ ‘రాతి పూస’ను గుర్తించాడు. పూసలు పురావస్తు ప్రదేశాలలో టెర్రకోట(మట్టి)వి, రంగురాళ్లతో చేసినవి, ఎముకలతో చేసినవి లభిస్తుంటాయి. కానీ గ్రానైట్ రాతితో చేసిన రాతిపూస లభించడం తెలంగాణలో ఇదే మొదటిసారి. లభించిన పూసలు బంకమట్టితో చేసి కాల్చినవి, పగడం, లాపిస్ లాజులే, అగేట్, పచ్చవంటి విలువైన మణులతో చేసినవే ఇప్పటి వరకు తెలుసు. ఈ రాతిపూస నంగునూరులో దొరకడం విశేషం. గతంలో నంగునూరు పాటిగడ్డ మీద బంకమట్టితో చేసిన ఎద్దు తల, టెర్రకోట పూసలు వంటి పురాతన వస్తువులెన్నో లభించాయి. ఇప్పుడీ రాతిపూస లభించింది. ఇది తొలి చారిత్రక యుగానికి అంటే క్రీ.శ. ప్రారంభానికి ముందటిదని పురావస్తు అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.

తదుపరి వ్యాసం