తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Shabbir Ali: ఎన్నికల్లో దొరలు కాదు, ప్రజలు గెలవాలన్న షబ్బిర్ అలీ

Shabbir Ali: ఎన్నికల్లో దొరలు కాదు, ప్రజలు గెలవాలన్న షబ్బిర్ అలీ

HT Telugu Desk HT Telugu

08 November 2023, 6:34 IST

google News
    • Shabbir Ali: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దొరలు కాదు, ప్రజలు గెలవాలని కాంగ్రెస్ నిజామాబాద్ అర్బన్ అభ్యర్ధి షబ్బిర్ అలీ అన్నారు. నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బుధవారం మొదటిసారిగా నిజామాబాద్ పట్టణనికి వచ్చారు. 
నిజామాబాద్‌ ఎన్నికల ప్రచారంలో షబ్బీర్ అలీ
నిజామాబాద్‌ ఎన్నికల ప్రచారంలో షబ్బీర్ అలీ

నిజామాబాద్‌ ఎన్నికల ప్రచారంలో షబ్బీర్ అలీ

Shabbir Ali: కామారెడ్డిలో పోటీ చేయాలని భావించినా చివరి నిమిషంలో నిజామాబాద్‌కు మారిన కాంగ్రెస్ సీనియర్‌ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీకి నియోజక వర్గంలో ఘన స్వాగతం లభించింది. ఎన్నికల ప్రచారంలో తొలిసారి వచ్చిన షబ్బీర్‌ అలీకి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులు భారీ స్వాగతం పలికారు.

నిజామాబాద్ పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి నెహ్రూ పార్కు వద్ద సభను ఉద్దేశించి షబ్బీర్ అలీ ప్రసంగించారు. "నిజామాబాద్ తనకు కొత్తేమీ కాదని నిజామాబాద్‌తో విడదీయలేని సంబంధం ఉందన్నారు.

ఉమ్మడి నిజామాబాద్ డిసిసి అధ్యక్షునిగా, రెండు పర్యాయాలు మంత్రిగా ఇక్కడ ప్రతి ఇంటితో నాకు అనుబంధం ఉందన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్తతో కుటుంబ సభ్యుల తరహా అనుబంధం ఉంది. తాను డి.శ్రీనివాస్ రామలక్ష్మణ మాదిరి అనుబంధం అన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ 10 సంవత్సరాలలో ఎంతో వెనక పడిపోయిందని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అణచివేయబడ్డారన్నారు. కేసులతో బిఆర్ఎస్ నాయకుల దాడులతోఎంతో కుంగి పోయారని చెప్పారు.అంతా ఐకమత్యంతో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు.

కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మనం చేసే అభివృద్ధి గురించి ఆరు గ్యారెంటీ పథకాల గురించి ప్రజలందరికీ చేరవేయాలన్నారు. నిజామాబాద్ నాయకులు, కార్యకర్తల అభిమానానికి కృతజ్ఞుడినని మీ అభిమానంతో నా మనసు తడిసి ముద్దయిందన్నారు.

ప్రజల సంపదను, ప్రజలకు పంచకుండా పదేళ్ల బిఆర్ఎస్ పరిపాలనలో దొరలు పంచుకు తిన్నారన్నారు.కాళేశ్వరం నిర్మాణం పేరిట బి ఆర్ ఎస్ లక్ష కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడిందన్నారు. కాళేశ్వరం నిర్మాణంలో అవినీతి, అక్రమాలు జరిగాయని, నాణ్యతకు తిలోదకాలు ఇచ్చినందునే పట్టుమని పది రోజులు కాకముందే కుంగిందన్నారు. దళితుడిని సీఎం చేస్తానని కే సీ ఆర్ మోసం చేశారన్నారు.

దళితులకు మూడు ఎకరాల భూమి పంపిణీ చేస్తామని ఎగనామం పెట్టారని ఆరోపించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని నిరుద్యోగుల కలలను కల్లలు చేశారని, బిఆర్ఎస్ లాగా ప్రజలు మోసం చేయడం కాంగ్రెస్ కు తెలియదని చెప్పారు.

ఉచిత కరెంటు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రమాణ స్వీకారం రోజున దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత కరెంటు ఫైలు పై సంతకం పెట్టి ఇచ్చిన మాటను అమలు చేశారన్నారు. కాంగ్రెస్ ఇప్పుడు ప్రకటించిన ఆరు గ్యారెంటీలను కూడా అధికారులకు వచ్చిన తొలి వంద రోజుల్లోనే అమలు చేస్తామన్నారు.

ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికి కావలసిన బడ్జెట్ ప్రణాళిక, రాబడిపై స్పష్టమైన అవగాహన పరిపాలన అనుభవం కలిగిన కాంగ్రెస్‌ పార్టీకి ఉందన్నారు. రాష్ట్ర సంపద ప్రజలందరికీ పంచాలని తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ 6 గ్యారంటీ హామీలను ప్రకటించారని చెప్పారు.

ఏ పార్టీలో ఉన్నా, అన్ని పార్టీల వారికి కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ అధికారులకు వస్తేనే పేదలకు ఇంటి స్థలాలు ఇండ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయల సాయం అందుతుందని చెప్పారు. వడ్డీలేని రుణాలు, పావలా వడ్డీ రుణాలు, మద్దతు ధర, కల్లాల వద్ద ధాన్యం కొనుగోలు అమలు చేస్తామన్నారు.

తెలంగాణ రాష్ట్రం కావాలని కోరితే ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనే అని గుర్తుంచుకోవాలన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర సంపదను ప్రజలకు పంచకుండా టిఆర్ఎస్ పాలకులు దోచుకు తింటున్నారని అందుకే ప్రజల తెలంగాణ తెచ్చుకోవాలనన్నారు. ఈ ఎన్నికల్లో గెలువాల్సింది దొరలు కాదు. ప్రజలు గెలవాలని చెప్పారు.

రిపోర్టింగ్ భాస్కర్, నిజామాబాద్

తదుపరి వ్యాసం