HYD BJP Candidates: కొలిక్కి రాని హైదరాబాద్ బీజేపీ అభ్యర్ధుల ఎంపిక
01 November 2023, 11:18 IST
- HYD BJP Candidates: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మరో నెల రోజుల్లో జరుగనున్నాయి. రెండు రోజుల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్లు సైతం దాఖలు చేయనున్నారు.అయితే గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రం కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను మాత్రం బిజెపి ఇంకా ఖరారు చేయలేదు.
హైదరాబాద్‌లో ఖరారు కాని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులు
HYD BJP Candidates: బిజెపికి పట్టు ఉన్న అంబర్‌పేట , జూబ్లీహిల్స్, సనత్ నగర్, ఎల్‌బి నగర్, సికింద్రాబాద్ , ముషీరాబాద్ స్థానాల్లో అభ్యర్థులు ఎవరు అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఎన్నికల బరిలో ఉన్నారంటూ రోజుకో కొత్త పేరు తెరపైకి వస్తుండటంతో అదిష్టానానికి తలనొప్పిగా మారింది.
ముఖ్యంగా జూబ్లీ హిల్స్, అంబర్‌పేట నియోజకవర్గాల్లో ఈ తాకిడి అధికంగా ఉంది. ఆయా సెగ్మెంట్లలో బీజేపీకి పట్టు ఉండడంతో టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఆయా నియోజకవర్గాల్లో కార్పొరేటర్ సైతం టికెట్ రేసులో ఉంటున్నారు. ఇతర స్థానాల్లో టికెట్ ఆశించి దక్కని వారు కూడ ఈ స్థానాల్లో బరిలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.
దీంతో స్థానికుల నాయకుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది కాస్త నాయకుల మధ్య విభేదాలకు కారణం అవుతోంది. ఆయా స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక రాష్ట్ర అధిష్టానానికి తలనొప్పి తెచ్చి పెడుతుంది.
ఆందోళనలో బీజేపీ నాయకత్వం..?
నవంబర్ 3 నుంచి అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. గ్రేటర్ పరిధిలో అధికార బిఆర్ఎస్ పార్టీ గోషామహల్ ,నాంపల్లి మినహా అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
కాంగ్రెస్ సైతం చార్మినార్ మినహా అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది. బిఆర్ఎస్ ఒక అడుగు ముందుకేసి అభ్యర్థులకు బీ ఫామ్స్ కూడా అందచేసి ప్రచారాన్ని చేపట్టింది.అయితే బీజేపీ మాత్రం పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించక పోవడంతో అభ్యర్ధులు ఆందోళనకు గురవుతున్నారు. టికెట్ ఆశిస్తున్న ఆశావహులంతా నాంపల్లి రాష్ట్ర కార్యాలయానికి చక్కర్లు కొడుతున్నారు.
ఆ మూడు స్థానాల్లో అభ్యర్థులు ఎవరు..?
పెండింగ్‌లో ఉన్న అంబర్‌పేట , జూబ్లీహిల్స్ స్థానాల్లో తీవ్రమైన పోటీ ఉంది. వీటిలో ఒక్కో సెగ్మెంట్ నుంచి ముగ్గురు నలుగురు ఆశావహులు ఉన్నారు. వీరే కాకుండా ఇతర స్థానాల్లో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలంతా ఈ నియోజకవర్గాలపై కన్నేశారు.
2018 అసెంబ్లీ అంబర్ పేట నియోజకవర్గం నుండి కిషన్ రెడ్డి పోటీ చేశారు. బిఆర్ఎస్ అభ్యర్థిపై ఆయన స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అనంతరం ఆయన సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. తర్వాత ఆయన కేంద్ర మంత్రి పదవి సైతం దక్కించుకున్నారు.
అంబర్ పేట లో బీజేపీకి గట్టి పట్టు ఉన్నా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సుముఖత చూపడం లేదు. దీంతో ఇతర నేతలు ఆ స్థానంలో పోటీ చేసేందుకు ముందుకు వస్తుండడంతో పార్టీ ఎవరి వైపు మొగ్గు చూపుతుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఎల్ బి నగర్ లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది అక్కడ 11 డివిజన్ లు ఉండగా అందులో 11 డివిజన్ లు బిజేపి కైవసం చేసుకుంది. దీంతో ఎల్ బి నగర్ లో కూడా పోటీ చేసేందుకు స్థానికంగా ఎక్కువ మంది ఆశవాహులు ఉన్నట్లు తెలుస్తుంది. ఇటు జూబ్లీహిల్స్ లో కూడా అదే స్థాయిలో నేతలు టికెట్ రేసులో ఉన్నారు. అయితే ఈ స్థానం నుంచి ఎక్కువగా మహిళా నాయకురాలు ఉన్నారు.సినీ రంగానికి చెందిన ఆర్టిస్టులు సైతం జూబ్లీహిల్స్ నుంచి పోటీలో ఉన్నారు.
(రిపోర్టింగ్ కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్)