Revanth Vs Talasani : కేసీఆర్ కాళ్లు పిసికినా, చెప్పులు మోసినా నా స్థాయికి రాలేవు, తలసానిపై రేవంత్ రెడ్డి ఫైర్
10 May 2023, 18:46 IST
- Revanth Vs Talasani : కాంగ్రెస్ పై తలసాని వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. పొట్టోడు అంటూ రేవంత్ పై తలసాని కామెంట్స్ చేస్తే, కేసీఆర్ కాళ్లు పిసుకుడు అలవాటైనట్లుందని రేవంత్ ఫైర్ అయ్యారు.
తలసాని శ్రీనివాస్ యాదవ్, రేవంత్ రెడ్డి
Revanth Vs Talasani : తెలంగాణ రాజకీయాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతోంది. రేవంత్ రెడ్డి, ప్రియాంక గాంధీపై తలసాని వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు వరుసగా కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా మంత్రి తలసానిపై రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో ఓ మీటింగ్ కు హాజరైన రేవంత్ రెడ్డి... తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి ఇష్టమొచ్చినట్టు మాట్లాడడం సరికాదన్నారు. పాన్ పరాగ్ లు నమిలే వ్యక్తి తనపై మాట్లాడడం సరికాదన్నారు. పశువుల కాపరిగా ఉన్నాడు కాబట్టి తలసానికి పేడ పిసకడం అలవాటు అయినట్లుందని విమర్శలు చేశారు. అందుకే తనను పిసుకుతాను అంటున్నారని రేవంత్ సెటైర్లు వేశారు. చిన్ననాటి నుంచి పేడ పిసకడం అలవాటు అయినట్టుందన్నారు. మంత్రిగా ఉన్న తలసాని బాధ్యతాయుతంగా మాట్లాడాలన్నారు. రాజకీయాలలో ఉన్నప్పుడు ఆదర్శంగా ఉండడం నేర్చుకోవాలన్నారు.
పిసుకుడు కోరిక ఉంటే ఎక్కడికి రావాలే చెబుతా?
మంత్రి తలసానిని దున్నపోతుతో పోల్చి రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. దున్నపోతులతో తిరిగిన తలసాని అంటూ మండిపడ్డారు. మొదట్నుంచి పశువుల పేడ పిసుక్కున్న అలవాటు తలసానికి ఉందని, అందుకే పిసుకుడు గురించి మాట్లాడుతున్నారన్నారు. అరటిపళ్ల బండి దగ్గర మేక నమిలినట్టు గుట్కాలు నమిలే వ్యక్తులు కూడా తన గురించి మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కు అంత పిసుకుడు కోరిక ఉంటే, ఎక్కడికి ఎప్పుడు రావాలో చెబితే తాను వస్తానన్నారు. అప్పుడు ఎవరు ఏం పిసుకుతారో అర్థమవుతుందని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. సీఎం కేసీఆర్ కాళ్లు పిసికినట్టు అనుకుంటున్నారేమో రేవంత్ రెడ్డిని పిసకటం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నానన్న రేవంత్ రెడ్డి...తలసాని శ్రీనివాస్‌యాదవ్ జీవితకాలం కేసీఆర్ చెప్పులు మోసిన, కేటీఆర్ సంక నాకినా ఓ పార్టీకి అధ్యక్షుడు రాలేరన్నారు.
తలసాని శ్రీనివాస్ ఏమన్నారంటే?
ఇటీవల హైదరాబాద్ లో కాంగ్రెస్ యువ సంఘర్షణ సభ నిర్వహించింది. ఈ సభకు ఏఐసీసీ అగ్రనేత ప్రియాంకగాంధీ హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరుతో ఓ ప్రకటన విడుదల చేసింది. దీనిపై స్పందించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రేవంత్ రెడ్డి, ప్రియాంక గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. ఓ పొట్టోడు ఎమ్మెల్యేలను, మంత్రులను అందరినీ వాడు, వీడు అని మాట్లాడుతున్నాడన్నారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు.. పిసికితే ప్రాణం పోతది అంటూ రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి తలసాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక గాంధీపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. మా తాత, నాన్నమ్మ, నా నాన్న అంటూ కబుర్లు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. 40 ఏళ్లు కాంగ్రెస్ దేశాన్ని రూల్ చేసింది కదా పేదవాళ్లు పింఛన్ ఇవ్వాలని కేసీఆర్ కు వచ్చిన ఆలోచన మీకు ఎందుకు రాలేదని తలసాని ప్రశ్నించారు.