Beer Treatment: నత్తల నివారణకు బీర్లను పోయాలని సూచిస్తున్న కొండా లక్ష్మణ్ ఉద్యాన విద్యాలయ శాస్త్రవేత్తలు
30 October 2024, 6:37 IST
- Beer Treatment: రైతులు సాగుచేస్తున్న టమాట, చిక్కుడు, మిరప వంటి కూరగాయల పంటలను రాత్రి వేళల్లో నత్తలు ఆశించి విపరీతంగా నాశనం చేస్తున్నాయి.నత్తల నివారణకు గ్లాసులో బీరు పోసి పొలంలో అక్కడక్కడా ఏర్పాటు చేసుకున్నట్లయితే వీటికి నత్తలు బీరు గ్లాసులో పడి చనిపోతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
నత్తల నివారణకు బీర్లతో విరుగుడు లభిస్తుందంటున్న ఉద్యాన శాస్త్రవేత్తలు
Beer Treatment: టమాట, చిక్కుడు, మిరప వంటి కూరగాయల పంటలను రాత్రి వేళల్లో నత్తలు విపరీతంగా నాశనం చేస్తున్నాయి. నత్తల నివారణకు ఒక గ్లాసులో బీరు పోసి పొలంలో నేలకు సమాంతరంగా అక్కడక్కడా ఏర్పాటు చేసుకున్నట్లయితే నత్తలు బీరుకు ఆకర్షించబడి, అందులో పడి చనిపోతాయని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విద్యాలయం కూరగాయల పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్ అనితకుమారి, ప్రీతం, వీర సురేష్ సుచించారు.
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులో రైతులు సాగు చేస్తున్న కూరగాయల పంటలను ఉద్యానశాఖ అధికారి రమేష్ తో కలిసి వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం నత్తల నివారణ చర్యల గురించి రైతులకు వివరించారు.
నత్తల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు
తేమ ఎక్కువగా ఉండి చీకటిగా ఉన్న ప్రాంతాల్లో రాత్రిపూట నత్తలు పంటను ఆశించి నష్టపరుస్తాయని వారు తెలియజేశారు. ఈ నత్తల నివారణకు రైతులు సామూహికంగా సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలన్నారు.
1. నత్త గుల్లలను అన్నిటిని ప్రోగు చేసి ఉప్పు నీళ్లలో వేయాలి.
2. నత్తలు రాత్రిపూట తిరుగుతాయి. కాబట్టి ఉప్పు గాని, సున్నం గాని పంట చుట్టూ చల్లుకోవాలి.
3. క్యాబేజీ లేదా బొప్పాయి ఆకులను పొలంలో వేసినట్లయితే నత్తలు ఎక్కువగా ఆకర్షణకు గురవుతాయి. ఆ తర్వాత ఆకులను ఏరి కాల్చివేయాలి.
4. Metaldehyde@ 2.5% గుళికలు ఎకరానికి రెండు కిలోల చొప్పున వేసుకోవాలి.
5. ఉప్పు నీటిలో నానబెట్టిన గోనె సంచులను పొలంలో అక్కడక్కడ అమర్చుకున్నట్లైతే నత్తలు వాటికి ఆకర్షణకు గురవుతాయి.
6. ఒక కిలో తవుడు, 250 గ్రాముల బెల్లం, 100 గ్రాముల Methomyl కలుపుకొని ఉండలుగా చేసిన విషపు ఎరలను పొలంలో అక్కడక్కడ వేసుకున్నట్లయితే వీటిని తిని నత్తలు చనిపోవడం జరుగుతుంది.
7. బీరు ద్రావణాన్ని కూడా ఉపయోగించి నత్తలను ఆకర్షింప చేయవచ్చు. ఒక గ్లాసులో బీరు పోసి పొలంలో నేలకు సమాంతరంగా అక్కడక్కడా ఏర్పాటు చేసుకున్నట్లయితే వీటికి నత్తలు ఆకర్షించబడి చనిపోతాయని శాస్త్రవేత్తలు వివరించారు. ఈ విధంగా నత్తల నివారణకు చర్యలు తీసుకున్నట్లయితే రైతులు పంటలను కాపాడుకోవచ్చని వారు సూచించారు.
ఆయిల్ పామ్ సాగుకు రైతులను పోత్సహించాలి: కలెక్టర్
ఆయిల్ పామ్ సాగుకు రైతులను పోత్సహించాలని సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. వ్యవసాయ,ఉద్యానవన,ఆయిల్ ఫెడ్ మండల స్థాయి అధికారులకు శిక్షణ, సాగుపై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల మండలంలోని వ్యవసాయ, ఉద్యాన, ఆయిల్ ఫెడ్ సిబ్బంది రైతుల వద్దకు వెళ్ళి ఆయిల్ పామ్ సాగుకు వారిని పోత్సహించాలని ఆదేశించారు.
సాగులో రైతులు ఎదుర్కొనే ఇబ్బందులను తెలుసుకోని ఎప్పటికప్పుడు వాటిని మీ రికార్డులలో నమోదు చేసుకొని పై అధికారులకు పంపించాలని ఆదేశించారు. జిల్లాలో ఆయిల్ పామ్ సాగు పై రాష్ట్ర మంత్రి ప్రత్యేక దృష్టి సారించారని, వారి ఆలోచనలకు తగ్గట్టుగా అధికారులు కృషి చేయాలనీ తెలిపారు.
అంతే కాకుండా బయట జిల్లాల నుండి ఆయిల్ పామ్ సాగు గురించి తెలుసుకోవడానికి మన జిల్లాకు వచ్చేలా సాగు అభివృద్దిని ఆచరణలో సాధించి చూపించాలని ఆకాక్షించారు. ప్రగతిని సాదించడంలో అధికారులు ఖచ్చితంగా ఉండాలని, ఎవరైన నిర్లక్ష్యంగా వ్యవహరిచినట్లు గుర్తించినట్లయితె వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు.