తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal Robbery: ఖాకీలకు చుక్కలు చూపిస్తున్న ఎస్‌బిఐ దోపిడీ కేసు, మూడు రోజులు దాటినా పురోగతి శూన్యం

Warangal Robbery: ఖాకీలకు చుక్కలు చూపిస్తున్న ఎస్‌బిఐ దోపిడీ కేసు, మూడు రోజులు దాటినా పురోగతి శూన్యం

HT Telugu Desk HT Telugu

22 November 2024, 12:37 IST

google News
    • Warangal Robbery: వరంగల్ కమిషనరేట్ పరిధి రాయపర్తి ఎస్ బీఐలో గోల్డ్ రాబరీ కేసు పోలీసులకు చుక్కలు చూపిస్తోంది. మాస్టర్ స్కెచ్ తో చోరీకి పాల్పడిన దుండగులు.. పోలీసులకు గట్టి క్లూ ఏదీ దొరకకుండా జాగ్రత్త పడగా.. ఘటనా స్థలంలో దొరికిన ఓ అగ్గిపెట్టేను ఇప్పటికే ఖాకీలు స్వాధీనం చేసుకున్నారు.
వరంగల్‌లో ఎస్‌బిఐలో భారీ చోరీ, 15కోట్ల బంగారం దోపిడీ
వరంగల్‌లో ఎస్‌బిఐలో భారీ చోరీ, 15కోట్ల బంగారం దోపిడీ

వరంగల్‌లో ఎస్‌బిఐలో భారీ చోరీ, 15కోట్ల బంగారం దోపిడీ

Warangal Robbery: వరంగల్‌ బ్యాంకు దోపిడీ కేసు పోలీసులకు చుక్కలు చూపిస్తోంది. లాకర్ సమీపంలో పోలీసులు రక్తపు మరకలు గుర్తించినట్లు తెలిసింది. దీంతో ఈ రెండు ఆధారాలతోనే విచారణ జరపడం పోలీసులకు సవాల్ గా మారింది. ఇప్పటికే ఈ తరహా చోరీలు జరిగిన తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లోని వివిధ స్టేషన్ల పోలీస్ ఆఫీసర్లతో సంప్రదింపులు జరుపుతున్నారు. అయినా ఎలాంటి బలమైన ఆధారాలు లభ్యం కానట్లు తెలిసింది. దీంతో ఈ కేసును ఛేదించడానికి పోలీసులు తలలు పట్టుకోవాలసి వస్తోంది.

జులాయి తరహా సీన్..

వరంగల్ జిల్లా రాయపర్తిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లో ఈ నెల 18న అర్ధ రాత్రి భారీ చోరీ జరిగిన విషయం తెలిసిందే. జులాయి సినిమా తరహాలో జరిగిన ఈ చోరీని పక్కా ప్రొఫెషనల్స్ చేసినట్లు తెలుస్తుండగా.. బ్యాంకులో 635 మంది ఖాతాదారుల్లో 497 మందికి సంబంధించిన దాదాపు 19.05 కిలోల బంగారాన్ని దోచుకెళ్లడం తీవ్ర కలకలం రేపింది. ఆ బంగారం విలువ దాదాపు 13.9 కోట్లు ఉంటుందని అంచనా వేస్తుండగా.. ఘటన వెలుగులోకి వచ్చిన తరువాత పోలీసులు రంగ ప్రవేశం చేసి వివరాలు సేకరించారు. 

ఘటనా స్థలంలో ఎలాంటి ఆధారాలు పోలీసులకు చిక్కకుండా దొంగలు జాగ్రత్త పడ్డారు. కానీ గ్యాస్ కట్టర్ ను వెలిగించేందుకు ఉపయోగించిన అగ్గిపెట్టెను మాత్రం అక్కడే వదిలేశారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ఆ అగ్గిపెట్టెను స్వాధీనం చేసుకోగా.. దానిపై ఉన్న అక్షరాలను బట్టి అది తమిళనాడు రాష్ట్రంలో కొనుగోలు చేసిన అగ్గిపెట్టేగా ఖాకీలు గుర్తించారు. దీంతో ప్రొఫెషనల్ గా చోరీకి పాల్పడిన ముఠా తమిళనాడుకు చెందినదేనా లేదా ఆ మార్గం గుండా వస్తూ తమిళనాడులో కొనుగోలు చేసి ఉంటారా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. కానీ అగ్గిపెట్టే ఆధారంగా కేసును ఛేదించడం పోలీసులకు కఠిన సాధ్యంగా మారింది.

దొంగ చేతికి గాయమైందా..?

గ్యాస్ కట్టర్ తో లాకర్ ను ఓపెన్ చేస్తున్న క్రమంలో ముఠాలో ఒకరికి గాయమైనట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. ఘటనా స్థలంలో రక్తపు మరకలను పోలీసులు గుర్తించినట్లు తెలుస్తుండగా.. లాకర్ తెరుస్తున్న క్రమంలోనే గాయపడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు ఆ రోజు రాత్రి చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఆసుపత్రులు, మెడికల్ షాపుల్లో ఆరా తీస్తున్నారు. ఏ ఆసుపత్రిలోనైనా వైద్యం చేయించుకుని ఉంటాడా.. లేదా మెడికల్ షాప్ లో మందులేమైనా కొనుగోలు చేసి ఉంటాడా అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు.

నిందితుల వేటలో నాలుగు టీమ్లు

బ్యాంక్ చోరీ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తుండగా.. పోలీసులు నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దీంతో ఆ నాలుగు టీమ్ల సభ్యులు దొంగల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. 

ఇప్పటికే కర్నాటకలోని దేవనగరి ప్రాంతంలో కూడా ఇదే తరహా చోరీ జరగగా.. అక్కడి పోలీస్ ఆఫీసర్లతో మాట్లాడి వివరాలు సేకరించారు. అయినా కూడా పోలీసులకు నిందితులకు సంబంధించిన బలమైన ఆధారాలు ఏమీ దొరకలేదని తెలిసింది. దీంతో పోలీస్ ఉన్నతాధికారులు వరంగల్ కమిషనరేట్ అధికారులపై ఒత్తిడి పెంచినట్లు సమాచారం. 

ఈ మేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆఫీసర్లను ఎప్పటికప్పుడు ఆరా తీస్తుండగా.. బ్యాంక్ రాబరీ మూలాల డొంక ఎక్కడ దొరుకుతుందో అనే చర్చ జరుగుతోంది. కాగా రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ కు సంబంధించిన ప్రొఫెషనల్ దొంగలు కూడా ఇదే తరహా చోరీలకు పాల్పడతుంటారని, అలాంటి గ్యాంగుల గురించి కూడా వివరాలు సేకరిస్తున్నట్లు పోలీస్ అధికారులు చెబుతున్నారు. కాగా ఇప్పటికే పోలీసులకు చుక్కలు చూపిస్తున్న ఈ కేసు గుట్టు ఎప్పుడు వీడుతుందో చూడాలి.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)

తదుపరి వ్యాసం