Sangareddy News : మరణంలోనూ వీడని స్నేహం, ట్రాక్టర్ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి
21 October 2023, 16:48 IST
- Sangareddy News : సంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు స్నేహితులు ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందారు.
ట్రాక్టర్ ప్రమాదంలో ముగ్గురు మృతి
Sangareddy News : ఒకే గ్రామానికి చెందిన వారు ముగ్గురు స్నేహితులు మూడు ట్రాక్టర్లు కొనుక్కున్నారు, కలిసి ట్రాక్టర్లు నడుపుకొని జీవనం సాగిస్తున్నారు. కానీ అనుకోని ప్రమాదంలో ఆ ముగ్గురు స్నేహితులు ఒకేరోజు మరణించారు. ఈ విషాదకర సంఘటన సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలంలోని కొలుకురు గ్రామంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం కొలుకురు గ్రామానికి చెందిన ఈటల రమణ (45), ఎంపల్లి మల్లేష్ (30), మంగలి గోపాల్ (30) ముగ్గురు తలా ఒక ట్రాక్టర్ కొనుక్కొని జీవనం సాగిస్తున్నారు. అయితే, ఈటల రమణకి చెందిన ట్రాక్టర్ ట్రాలీ టైర్ శనివారం రోజు పంక్చర్ అయింది. ఆ టైర్ ను గోపాల్ కు చెందినా ట్రాక్టర్ లో వేసుకొని సదాశివపేటలో పంక్చర్ వేయించడానికి ముగ్గురు కలిసి బయలుదేరారు. ఊరి చివర ఉన్న సింగూరు కాలువ మీదుగా సదాశివపేట పట్టణం వైపు వెళ్తుండగా, ట్రాక్టర్ అదుపుతప్పి సింగూరు కాలువలో పడిపోయింది. అది పూర్తిగా బోల్తా పడటంతో ట్రాక్టర్ మీద ఉన్న ముగ్గురు కూడా ఇంజిన్ కింద పడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు.
గ్రామంలో విషాద ఛాయలు
జేసీబీనితో ట్రాక్టర్ ను బయటకి లాగారు. ట్రాక్టర్ కింద ఇరుక్కొన్న మృతదేహాలను బయటికి తీశారు. కుటుంబాలను పోషించే ముగ్గురు కూడా ఒకే రోజు మృతి చెందటంతో కటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అయింది. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. వారి కుటుంబాలు దిక్కులేని వారయ్యారని గ్రామస్థులు అంటున్నారు. కష్టాల్లో ఉన్న ఈ కుటుంబాలను తప్పనిసరిగా ఆదుకోవాలని అని గ్రామస్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
మరో ప్రమాదంలో ఒకరు మృతి, మరొకరికి గాయాలు
ఇదేవిధంగా మెదక్ జిల్లాలో జరిగిన మరొక ట్రాక్టర్ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. అల్లాదుర్గం మండలం బైరాన్ దిబ్బగ్రామా సమీపంలో NH-161 మీదుగా ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది. గాయాల పాలైన వ్యక్తిని జోగిపేట పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.