తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Sangareddy Crime : మంజీరా నదిలో మహిళ మృతదేహం కేసు- మతిస్థిమితం లేదని హత్య చేసిన భర్త, కొడుకులు!

Sangareddy Crime : మంజీరా నదిలో మహిళ మృతదేహం కేసు- మతిస్థిమితం లేదని హత్య చేసిన భర్త, కొడుకులు!

HT Telugu Desk HT Telugu

07 February 2024, 16:10 IST

google News
    • Sangareddy Crime : రెండ్రోజు క్రితం మంజీరా నదిలో లభ్యమైన మహిళ మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. మతిస్థిమితం కోల్పోయిన భార్యను భర్త, కొడుకులు హత్య చేసి మంజీరా నదిలో పడేసినట్లు గుర్తించారు.
మతిస్థిమితం లేదని భార్యను హత్య చేసిన భర్త, కొడుకులు
మతిస్థిమితం లేదని భార్యను హత్య చేసిన భర్త, కొడుకులు

మతిస్థిమితం లేదని భార్యను హత్య చేసిన భర్త, కొడుకులు

Sangareddy Crime : మంజీరా నదిలో రెండు రోజుల క్రితం లభ్యమైన గుర్తు తెలియని మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. భర్త, కొడుకే మహిళ గొంతుకు తాడు బిగించి హత్య చేసి నదిలో మృతదేహాన్ని పడేశారని పోలీసులు తెలిపారు. జహీరాబాద్ రూరల్ సీఐ వెంకటేశం తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా పసల్ వాది గ్రామానికి చెందిన దర్జీ మల్లీశ్వరి (42) ఐదు సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైoది. ఈ ప్రమాదంలో ఆమె తలకు బలమైన గాయం కావడంతో మతిస్థిమితం కోల్పోయింది. మూర్ఛ వ్యాధి కూడా ఉంది. ఆమెను ఎన్నో హాస్పిటల్స్ కి తీసుకెళ్లి, సుమారు రూ.20 లక్షలు ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో మల్లీశ్వరి కొడుకులు, భర్త, చిన్న పిల్లలను కొరకడం,కొట్టడం చేస్తుండేది. ఇవన్నీ భరించలేక విసిగిపోయిన భర్త సత్యనారాయణ, పెద్ద కుమారుడు ప్రవీణ్ కలిసి ఆమెను చంపేస్తే మిగిలిన కుటుంబసభ్యులైనా ప్రశాంతంగా బతకొచ్చని భావించారు. వారు అనుకున్న పథకం ప్రకారం జనవరి 28న అర్ధరాత్రి ఆమె పడుకున్నాక గొంతుకు తాడు బిగించి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని రగ్గులో చుట్టి బండరాయి కట్టారు. ఆ తర్వాత మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి రాయికోడ్ మండలం సిరూర్ శివారులోని మంజీరా నదిలో పడేసి స్వగ్రామానికి వెళ్లారు.

సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానంతో కేసును ఛేదించిన పోలీసులు

స్థానికులకు, బంధువులకు అనుమానం రాకుండా రెండు రోజుల తర్వాత ఆమె భర్త గత నెల 31న భార్య తప్పిపోయిందని సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ఈ నెల 4న మత్స్యకారులు మంజీరా నదిలో శవం ఉన్నట్టు గుర్తించి ఒడ్డుకు చేర్చారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతురాలిని కాళ్ళు,చేతులు కట్టేసి దుండగులు ఎక్కడో దారుణంగా హత్యచేసి రగ్గులో లో చుట్టి మృతదేహం నీటిలో పైకి తేలకుండా దానికి పెద్ద బండరాయిని కట్టేసి మంజీరా నదిలో నీటిలో పడేసినట్లు ప్రాధమికంగా నిర్ధారించారు. ఈ క్రమంలో సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానంతో కేసును ఛేదించి ఆమెను హత్య చేసింది భర్త, కొడుకులేనని దర్యాప్తులో తేల్చారు. నిందితులిద్దరిని మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం నాద్లాపూర్ గ్రామంలో మంగళవారం రాత్రి ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందాడు. నాద్లాపూర్ గ్రామానికి చెందిన నల్లోల్ల మొగులయ్య (63) పొలం పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. దీంతో మంగళవారం ఉదయం పొలం పనులకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. ఈ క్రమంలో గ్రామా శివారులోని ఎల్లమ్మ ఆలయం వద్ద పడి ఉన్న మొగులయ్యను చూసిన గ్రామస్థులు వెంటనే కుటుంబసభ్యులను సమాచారం అందించారు. తాగి పడిపోయాడేమో అనుకోని వారు లేపడానికి ప్రయత్నించారు. దీంతో అతని తలకు, మెడకు రక్త గాయాలై చనిపోయాడని గుర్తించారు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కుటుంబసభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.

(హెచ్.టి.తెలుగు రిపోర్టర్, సంగారెడ్డి)

తదుపరి వ్యాసం