Sangareddy Crime :చెరకు తోటలో అంతర పంటగా గంజాయి, రైతు తెలివికి పోలీసులు షాక్!
15 November 2023, 20:48 IST
- Sangareddy Crime : చెరకు తోటలో అంతర పంటగా గంజాయిని సాగు చేస్తున్న రైతును సంగారెడ్డి పోలీసులు అరెస్టు చేశారు. 12 కిలోల బరువున్న 3 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు.
చెరకు తోటలో గంజాయి
Sangareddy Crime : సంగారెడ్డి జిల్లాలో చెరకు తోటలో సాగు చేస్తున్న 12 కేజీల గంజాయి మొక్కలను స్వాధీనపరుచుకున్నట్లు జిల్లా ఎస్పీ రూపేష్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న వివిధ రకాల చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు, జిల్లా ఎస్పీ రూపేష్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్ లను ఏర్పాటు చేసి, విస్తృత స్థాయిలో దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడులలో భాగంగా సంగారెడ్డి జిల్లా హద్నూర పోలీసు స్టేషన్ పరిధిలో గల డప్పూరు గ్రామంలో ఫక్రుద్దీన్ అనే వ్యక్తి తన వ్యవసాయ పొలంలోని చెరకు తోట మధ్యలో మిశ్రమ పంటగా గంజాయిని సాగు చేస్తున్నాడని సమాచారంతో టాస్క్ ఫోర్స్ టీమ్ దాడులు చేసింది. వ్యవసాయ పొలంపై 12 కిలోల బరువు గల 3 గంజాయి మొక్కలను స్వాధీనపరుచుకున్నారు. గంజాయి సాగుచేస్తున్న యాజమానిని అరెస్టు చేసి హద్నూర పోలీసు స్టేషన్ కు తరలించారు.
పీడీ యాక్ట్ కింద కేసు నమోదు
ఈ సందర్భంగా ఎస్పీ రూపేష్ మాట్లాడుతూ... నిషేధిత గంజాయిని రైతులు ఎవరైనా సాగు చేసినా, నిల్వ చేసినా, రవాణా చేసినా చట్టరీత్యా కఠిన చర్యలుంటాయని తెలిపారు. ఆ వ్యవసాయ భూమిని సీజ్ చేసి తహశీల్దార్ కు అప్పగిస్తామన్నారు. రిపీటెడ్ గా ఈ చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామన్నారు.
డీజే సౌండ్ వినియోగంపై నిషేధo
సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో డీజే సౌండ్ వినియోగంపై నిషేధ ఆజ్ఞలు ఈ నెల 16 నుంచి 23వ తేదీ ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటాయి. చిన్నపిల్లలు, వృద్ధులు, రోగులు, విద్యార్థుల విద్యాభ్యాసానికి భంగం కలగకుండా శబ్ద కాలుష్యం నుంచి కాపాడేందుకు డీజే సౌండ్ వినియోగంపై నిషేధాజ్ఞలు విధించామని సిద్దిపేట సీపీ శ్వేతా తెలిపారు. మైక్ సెట్ వినియోగం తప్పనిసరి అనిపిస్తే సంబంధిత డివిజన్ ఏసీపీ అధికారుల అనుమతి పొందాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి డీజే వినియోగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కమిషనరేట్ పరిధిలో ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదన్నారు. ఒకవేల సభలు, ర్యాలీ, ఇతర కార్యక్రమాల నిర్వహణకు ముందుగా పోలీస్ అధికారుల అనుమతి తీసుకోవాలని తెలిపారు. బంద్ ల పేరిట వివిధ కారణాలను చూపుతూ బలవంతంగా వివిధ సంస్థలు, కార్యాలయాలను మూసి వేయాలని ఒత్తిడి, బెదిరింపులకు గురిచేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు ప్రజలు సహకారం అందించాలని పోలీస్ కమిషనర్ సూచించారు.