Sangareddy Crime Report 2023 : సంగారెడ్డి జిల్లాలో పెరిగిన క్రైమ్ రేట్, 2023లో 10.9 శాతం ఎక్కువ కేసులు
31 December 2023, 15:52 IST
- Sangareddy Crime Report 2023 : సంగారెడ్డి జిల్లాలో ఈ ఏడాది క్రైమ్స్ పెరిగాయని పోలీసులు తెలిపారు. ఈ ఏడాది 90 రేప్ కేసులు నమోదయ్యాయన్నారు.
సంగారెడ్డి క్రైమ్ రిపోర్ట్
Sangareddy Crime Report 2023 : సంగారెడ్డి జిల్లాలో గత సంవత్సరంతో పోలిస్తే, అత్యాచారాలు, హత్యలు, కిడ్నాప్ కేసులు 2023లో చాలా ఎక్కువగా పెరిగాయని సంగారెడ్డి వార్షిక క్రైమ్ రిపోర్ట్ విడుదల సందర్భంగా జిల్లా పోలీస్ అధికారులు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లాలో 2023లో 90 రేప్ కేసులు నమోదయ్యాయని పోలీసు అధికారులు పేర్కొన్నారు. 2022లో 77 రేప్ కేసులు నమోదు కాగా, 2021లో కేవలం 59 రేప్ కేసులు నమోదు అయ్యాయి. అయితే, ఇందులో చాలా వరకు తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా ఇంటి నుంచి వెళ్లి పెళ్లి చేసుకున్న వారిపైన నమోదు చేసిన కేసులు కూడా ఉన్నాయని అధికారులు అంటున్నారు. అదేవిధంగా 2023లో 47 మర్డర్ కేసులు నమోదయ్యాయని, 2022తో పోలిస్తే ఆరు హత్య కేసులు ఈ ఏడాది ఎక్కువ నమోదయ్యాయన్నారు. జిల్లాలో 2023లో 58 కిడ్నాప్ కేసులు నమోదయ్యాయని అధికారులు పేర్కొన్నారు, గత 2022, 2021 సంవత్సరాలలో ఈ సంఖ్య కేవలం 30, 23 గా నమోదయ్యాని అధికారులు తెలిపారు.
సంగారెడ్డి వార్షిక క్రైమ్ రిపోర్ట్
సంగారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలమయంలో 2023 సంవత్సర వార్షిక నివేదిక జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2022 సంవత్సరంతో పోల్చుకుంటే 2023లో మొత్తం కేసులు 10.9 శాతం పెరిగాయన్నారు. దీనిలో హత్యలు గతేడాది కంటే 14. 6 శాతం పెరగగా, దొంగతనాలు గతేడాది కంటే 14 శాతం తగ్గాయని తెలిపారు. అత్యాచారాలు 2022లో 77 నమోదు కాగా 2023లో 90 కేసులు నమోదు అయ్యాయని, అంటే 17 శాతం పెరగాయన్నారు. జీవితఖైదు కేసులు గతేడాదితో పోలిస్తే 200 శాతం పెరిగాయని ఎస్పీ తెలిపారు.
అవగాహనా కార్యక్రమాలు చేపట్టాం- సంగారెడ్డి ఎస్పీ
ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం ద్వారా ప్రజలకు మరింత చేరువ అవ్వాలని సమాజంలో జరుగుతున్న వివిధ రకాల సైబర్ నేరాలు, పోక్సో చట్టాలపై అవగాహన, రోడ్డు ప్రమాదాల నివారణ గురించి జిల్లా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతో కమ్యూనిటీ పోలీసింగ్, సోషల్ మీడియా, కళాబృందాల ద్వారా లఘు చిత్రాల రూపంలో అవగాహన కల్పిస్తూ జిల్లా ప్రజలను చైతన్యం చేస్తున్నామన్నారు.
మహిళల రక్షణకు పెద్దపీట
మహిళల రక్షణకు పెద్దపీట వేస్తూ జిల్లా వ్యాప్తంగా సబ్ డివిజన్ లలో షీ-టీం బృందాలను ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు. మహిళా భద్రతకు భరోసా ఇస్తూ బాధిత మహిళలకు కొండంత ధైర్యానిస్తూ, భరోసా సెంటర్ ద్వారా మహిళల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపిస్తున్నామన్నారు. వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 360 పోక్సో, అత్యాచార కేసులలో కౌన్సిలింగ్ నిర్వహించడంతో పాటు, మెడికల్, సీడబ్ల్యూసీ ద్వారా బాధిత మహిళలకు షెల్టర్ కల్పించడంతో పాటు మహిళలకు రూ.90,50,000 పరిహారం ఇప్పించామని ఎస్పీ తెలిపారు.