Sangareddy District Court : ఐదేళ్ల బాలికపై హత్యాచారం కేసులో సంగారెడ్డి కోర్టు సంచలన తీర్పు - నిందితుడికి మరణ శిక్ష
12 September 2024, 21:41 IST
- సంగారెడ్డి జిల్లాలోని ఫొక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఐదేళ్ల బాలికపై హత్యాచారం కేసులో నిందితుడికి మరణశిక్ష విధించింది. బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.
సంగారెడ్డి కోర్టు సంచలన తీర్పు
ఐదేళ్ల బాలికపై హత్యాచారం కేసులో సంగారెడ్డి జిల్లాలోని పోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో ముద్దాయిగా ఉన్న 56 సంవత్సరాల బీహార్ వలస కార్మికుడికి ఉరిశిక్ష విధించింది. ఈ మేరకు గురువారం తీర్పుని వెలువరించింది. చిన్నారి తల్లితండ్రులకు ప్రభుత్వం 10 లక్షల రూపాయలను పరిహారంగా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటన జరిగిన 11 నెలలలోపే తీర్పు వచ్చింది. సంగారెడ్డి కోర్టు పరిధిలో ఉరిశిక్ష విధించడం 27 సంవత్సరాల తర్వాత… ఇదే మొదటిసారి.
కేసు వివరాలు:
కేసు వివరాల్లోకి వెళ్తే… బీడీఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. చైతన్య కంపెనీ లో పనిచేసే దంపతుల ఐదేళ్ల కుమార్తెను సెక్యూరిటీ గార్డ్ వద్ద ఉంచి వారు పనికి వెళ్లారు. వీరి రూమ్ ప్రక్క రూంలో ఉండే నేరస్తుడు గఫాఫర్ అలీ అక్టోబర్ 16, 2023 నాడు పనికి వెళ్ళకుండా మద్యం సేవించి ఉన్నాడు. సుమారు ఉదయం 11 గంటల సమయంలో సెక్యూరిటీ గార్డ్ వద్ద పాప కనిపించగా పాప తెలుసని చెప్పి తీసుకెళ్లాడు.
చిన్నారికి మద్యం కలిపిన కూల్ డ్రింక్ తాగించి పత్తి చేనులోకి తీసుకెళ్లాడు. అత్యాచారం చేసి ఆపై హత్య చేశాడు. బాలిక కోసం సాయంత్రం అంతటా వెతికిన తల్లితండ్రులు… చివరికి చిన్నారి శవాన్ని పత్తి చేనులో గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసు పూర్వపరాలను విన్న స్పెషల్ పోక్సో జడ్జి జయంతి… నిందితునికి మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.
11 నెలలలోనే తీర్పు.......
ఈ ఘటన జరిగిన 11 నెలల కాలంలోనే తుది తీర్పు వెలువడింది. సరైన ఆధారాలు సమర్పించిన పోలీసులు… నిందితునికి ఉరి శిక్ష పడేలా చేశారు. నిందితుడు గఫాఫర్ అలీ బీహార్ రాష్ట్రం జమోయి జిల్లాలోని సికిందర్ తాలుకకు చెందినవాడు. నిందితునికి శిక్షపడేలా కృషి చేసిన దర్యాప్తు అధికారులు, పీపీలను జిల్లా ఎస్పీ అభినందించారు.
రిపోర్టింగ్ - మెదక్ జిల్లా ప్రతినిధి, HT తెలుగు.