Telangana Elections 2023 : ఆన్ లైన్ లావాదేవీలపై బ్యాంకర్లు నిఘా పెట్టాలి - సంగారెడ్డి కలెక్టర్
12 October 2023, 21:10 IST
- Sangareddy District News: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో… ఆన్ లైన్ లో జరిగే లావాదేవీలపై గట్టి నిఘా పెట్టాలని అన్నారు సంగారెడ్డి కలెక్టర్ శరత్. ఈ మేరకు జిల్లాలోని బ్యాంకర్లను ఆదేశించారు.
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కీలక సూచనలు
Sangareddy District Latest News : ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో, జిల్లాలోని బ్యాంకర్లతో గురువారం సంగారెడ్డి కలెక్టర్ శరత్ కలెక్టరేట్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ఎవరైనా బ్యాంక్ ఖాతాలో ప్రతి రోజు లక్ష రూపాయల నగదు డిపాజిట్ చేసిన, విత్ డ్రా చేసినా,అదే విధంగా నెలలో 10 లక్షలు పైబడి నగదు డ్రా చేసిన గానీ లేదా ట్రాన్స్ఫర్ చేసిన అనుమానాస్పద బ్యాంకు లావాదేవీల వివరాలను ప్రతి రోజు ఆయా బ్యాంక్ అధికారులు ఎన్నికల అధికారులకు అందించాలని కోరారు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థి కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసినట్లయితే, జాప్యం చేయకుండా వెంటనే చెక్ బుక్ జారీ చేయాలని సూచించారు. అనుమానాస్పద లావాదేవీలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
వివిధ పార్టీలనుండి పోటీ చేసే అభ్యర్థులు డబ్బుల పంపిణి చేసి ఓటర్లను ఆకర్శించే అవకాశం ఉంది కాబట్టి… ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా, సంగారెడ్డి కలెక్టర్ బ్యాంకర్లతో సమావేశం అయ్యారు. డైరెక్ట్ గా డబ్బులు పంపిణి చేయటంపైన గట్టి నిఘా ఉండటం వలన, అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా బదిలీ చేసే అవకాశం ఉంది కాబట్టి, జిల్లా యంత్రాంగం ఆన్లైన్ లావాదేవీల పైన గట్టి నిఘా పెట్టనుంది.
అధికారులు ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు నడుచుకోవాలని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వరాదని జిల్లా కలెక్టర్ శరత్ సూచించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తో కలిసి కలెక్టర్ శరత్ ఇంజనీరింగ్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో కి వచ్చిందని, ఎన్నికల కమిషన్ నిబంధనలను విధిగా పాటించాలన్నారు. ఇంజనీరింగ్ శాఖలు చేపట్టిన వివిధ పనులలో గ్రౌండింగ్ అయి పనులు జరుగుతున్నట్లైతే, అట్టి పనులను కొనసాగించవచ్చునని, కొత్త పనులను మొదలు పెట్టకూడదని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల కోడ్ నిబంధనలను ఉల్లంఘించరాదని స్పష్టం చేశారు.
ఆయా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారీగా వివిధ పథకాలలో చేపట్టిన పనులు, పూర్తైనవి, ప్రారంభమై పురోగతిలో ఉన్నవి…. ఇంకా మొదలు కాని పనుల వివరాలను వెంటనే అందించాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో దివ్యాంగులకు ర్యాంప్ ఉండాలని, తాగునీటి సరఫరా సమస్యలు ఉన్నట్లయితే రెండు రోజుల లోగా ఆయా రిపేర్లు పూర్తి చేయాలని సూచించారు.