Hyderabad : ఘోర ప్రమాదం - రోడ్డు దాటుతున్న యువతిపై నుంచి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు - సీసీ కెమెరాలో రికార్డు
15 September 2024, 6:42 IST
- హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ యువతిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో యువతి ప్రాణాలు కోల్పోయింది. ఇందుకు సంబంధించిన సీసీ పుటేజీ దృశ్యాలు రికార్డయ్యాయి. కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు - యువతి మృతి
ఇటీవలే హైదరాబాద్ నగరం పరిధిలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. తాజాగా శుక్రవారం రాత్రి మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ ప్రమాదం జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ యువతిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో సదరు యువతి ప్రాణాలు కోల్పోయింది.
పోలీసుల వివరాల ప్రకారం…. మాధవి (25) అనే యువతి శుక్రవారం రాత్రి కొత్తగూడా చౌరస్తా నుంచి నడుచుకుంటూ వెళ్తోంది. రోడ్డు దాటే క్రమంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ ఆర్టీసీ నేరుగా ఢీకొట్టింది. దీంతో మాధవికి తీవ్ర గాయాలయ్యాయి.
గమనించిన స్థానికులు యువతిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె పరిస్థితి విషమించి మాధవి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
సెప్టెంబర్ 1వ తేదీన హైదరాబాద్ నగరంలో హిట్ అండ్ రన్ కేసు వెలుగు చూసింది. వనస్థలిపురంలో అతివేగంగా వచ్చిన కారు మహిళను ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. వనస్థలిపురంలోని ఎన్‌జీవోస్ కాలనీలోని వివేకానంద పార్క్ ముందు ఈ ఘటన జరిగింది. వేగంగా వెళ్తున్న కారు మహిళను ఢీకొట్టిన ఘటన సీసీటీవీలో రికార్డైంది. మహిళ తలకు బలమైన గాయం కావడంతో.. స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.
హైదరాబాద్‌లోని హబ్సిగూడలో ఆగస్టు 18న కూడా ప్రమాదం జరిగింది. ఓ టిప్పర్ లారీ వేగంగా వచ్చింది. బస్సు వెనకాల ఆగి ఉన్న ఆటోను బలంగా ఢీకోట్టింది. దీంతో ఆటో బస్సు కిందకు వెళ్లి ఇరుక్కుంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ తోపాటు అందులో ఉన్న విద్యార్థిని తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి క్రేన్ సహాయంతో ఆటోను తొలగించారు. గాయాలపాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడిన విద్యార్థిని చికిత్స పొందుతూ మృతి చెందింది.ఇందుకు సంబంధించిన దృశ్యాలు కూడా రికార్డయ్యాయి.