RPF Bachpan Bachao: రైళ్లలో బీహార్ బాల కార్మికుల అక్రమ రవాణాను గుర్తించిన ఆర్పీఎఫ్ సిబ్బంది
20 April 2023, 11:39 IST
- RPF Bachpan Bachao: బీహార్ నుంచి ఉపాధి పేరుతో బాలకార్మికుల్ని అక్రమంగా రవాణా చేయడాన్ని ఆర్పీఎఫ్ సిబ్బంది భగ్నం చేశారు. వరంగల్, కాజీపేట స్టేషన్లలో డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించి 34మంది పిల్లల్ని పట్టుకున్నారు.
హైదరాబాద్ తరలిస్తున్న బాల కార్మికుల్ని పట్టుకున్న ఆర్పీఎఫ్ సిబ్బంది
RPF Bachpan Bachao: పేదరికంలో మగ్గిపోతున్న కుటుంబాల్లో చిన్నారుల్ని ఉపాధి పేరుతో అక్రమంగా హైదరాబాద్ తరలిస్తున్న ముఠాను కాజీపేట పోలీసులు పట్టుకున్నారు. రెండు రైళ్లలో ఆకస్మిక తనిఖీలు చేసి 34మంది మైనర్ బాలల్ని గుర్తించారు. వారిని బాలల సంరక్షణ గృహాలకు తరలించారు.
కాజీపేటలో బుధవారం రాత్రి 11గంటలకు రైళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో 19మంది చిన్నారులు, తల్లిదండ్రులు లేకుండా ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. వారిని ప్రశ్నించడంతో బీహార్ నుంచి తరలిస్తున్న వారి ఆచూకీ బయటపడింది. నిందితులతో పాటు చిన్నారుల్ని కాజీపేట రైల్వే స్టేషన్లో దింపేసి విచారించారు. ఆ తర్వాత దర్బంగా ఎక్స్‌ప్రెస్‌లో మరో బ్యాచ్ చిన్నారులు హైదరాబాద్ వస్తున్నట్లు గుర్తించారు. రెండో రైల్లో కూడా ఆర్పీఎఫ్, జిఆర్పీ, ఛైల్డ్ లైన్ సిబ్బంది సోదాలు నిర్వహించారు. అందులో 15మంది చిన్నారుల్ని గుర్తించారు.
కాజీపేట రైల్వే భద్రతా దళం , జిఆర్పీ పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. వెట్టి చాకిరి కోసం సికింద్రాబాద్ తీసుకువెళ్తుండగా బాలల్ని గుర్తించారు. రైళ్లలో చిన్నారుల్ని యథేచ్ఛగా రవాణా చేస్తుండటంపై ఇటీవలి కాలంలో నిఘా పెంచారు.
నలుగురు దళారులు అక్రమంగా చిన్నారులు తరలిస్తున్నట్లు చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు సమాచారం రావడంతో భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో భారీ ఆపరేషన్ కోసం సంయుక్త ఆపరేషన్ చేపట్టినట్లు రైల్వే భద్రతా దళం ప్రకటించింది.
దర్బంగా ఎక్స్‌ప్రెస్‌లో పిల్లల్ని కూలీలుగా హైదరాబాద్‌లో ఉన్న బ్యాంగిల్ పరిశ్రమల్లో పనిచేయడానికి తీసుకువెళుతున్నట్లు గుర్తించారు. రైళ్లలో ఇటీవలి కాలంలో అక్రమ రవాణా జరుగుతుండటంతో బచ్‌పన్ బచావో, చైల్డ్ వెల్ఫేర్, ఆర్పీఎఫ్ సంయుక్తంగా దాడులు చేసినట్లు వివరించారు.
పోలీసులు పట్టుకున్న పిల్లల్ని బీహార్ తిప్పి పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పిల్లల పేదరికాన్ని ఆసరా చేసుకుని పనుల పేరుతో తెలంగాణ తీసుకువస్తున్నట్లు గుర్తించారు. ఆర్పీఎఫ్ అధికారులు పట్టుకున్న పిల్లలకు తాత్కాలిక వసతి కల్పించారు. వారిని బాలల సంరక్షణ గృహాల్లో ఉంచారు. తల్లిదండ్రుల వివరాలు సేకరించి, వారు వచ్చిన తర్వాత అప్పగిస్తామని పోలీసులు చెబుతున్నారు. పిల్లల్ని అక్రమంగా తరలిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.