తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Rohit Reddy On Ed Enquiry : బీజేపీ కుట్రలకు లొంగేదిలేదు - అరెస్టు చేసినా తగ్గేది లే.. !!

Rohit Reddy on ED Enquiry : బీజేపీ కుట్రలకు లొంగేదిలేదు - అరెస్టు చేసినా తగ్గేది లే.. !!

HT Telugu Desk HT Telugu

25 December 2022, 19:00 IST

google News
    • Rohit Reddy on ED Enquiry : రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చాలనే కుట్రను బయటపెట్టినందునే.. బీజేపీ తనపై ఈడీతో దాడులు చేయిస్తోందని.. ఎంత ప్రయత్నించినా తాను లొంగేది లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈడీ విచారణపై హైకోర్టుకి వెళతానని చెప్పారు. 
బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి

బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి

Rohit Reddy on ED Enquiry : ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకి సంబంధించి.. బీజేపీ కుట్రలను బయటపెట్టినందుకే.. కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా తనని, తన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారని తాండూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యేల కొనుగోలు ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలను భగ్నం చేసినందునే.. తనపై కక్ష కట్టారని విమర్శించారు. భయపెట్టి లొంగదీసుకునేందుకే, ఈడీ ద్వారా తనపై దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెంతగా ప్రయత్నించినా తాను లొంగేది లేదని, అరెస్టు చేసినా తగ్గేది లేదని తేల్చి చెప్పారు. ఈ వ్యవహారంలో.. బీజేపీ తీరు.. దొంగే దొంగ అని అరిచినట్లుగా ఉందని రోహిత్ రెడ్డి దుయ్యబట్టారు. న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని... అందుకే ఈడీ నోటీసులపై సోమవారం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తానని స్పష్టం చేశారు. డిసెంబర్ 27న ఈడీ విచారణకు మరోసారి హాజరవుతానని చెప్పారు.

"ఈడీ నోటీసులపై స్పందించి విచారణకు హాజరయ్యాను. మొదటి రోజు 6 గంటలు ప్రశ్నించిన అధికారులు.. ఏ కేసులో విచారిస్తున్నామన్నది చెప్పలేదు. వ్యక్తిగత సమాచారం సేకరించారు. ఎన్నికల అఫిడవిట్ పై ఆరా తీశారు. కేసు వివరాలు చెప్పనప్పుడు డీటెయిల్స్ ఎందుకు ఇవ్వాలని రెండో విచారణలో నేను ప్రశ్నించడంతో.. ఒక గంట తర్వాత ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసుకి సంబంధించి విచారణ చేస్తున్నామని చెప్పారు. కేసుకి సంబంధించిన వివరాలు అడిగారు. వారి ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాను. నా విచారణ పూర్తయిన తర్వాత... కేసుకి ఎటువంటి సంబంధం లేని అభిషేక్ ఆవలను 8 గంటల పాటు విచారించారు. అతడిని కూడా పొంతనలేని వివరాలు అడిగారు. మనీ లాండరింగ్ వ్యవహారాల్లోనే ఈడీ అధికారులు విచారణ చేపడతారు. ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసులో ఎక్కడ కూడా మనీ లాండరింగ్ జరగలేదు. ఈ కేసుతో ఈడీకి సంబంధమే లేదు. కేవలం బీజేపీ నేతల భండారాన్ని బయటపెట్టినందుకే.. ఈడీతో దాడులు చేయిస్తున్నారు. నన్ను లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు" అని రోహిత్ రెడ్డి ఆరోపించారు.

ఏ కేసులో అయినా దర్యాప్తు అధికారులు నిందితులని విచారిస్తారని.. కానీ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఫిర్యాదుదారు అయిన తనని పిలిచి ఈడీ విచారించడం విడ్డూరంగా ఉందన్నారు రోహిత్ రెడ్డి. తనను, అభిషేక్ ను విచారించినా వారికి ఏ సమాచారం దొరకలేదని.. దీంతో ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన నంద కుమార్ ని విచారిస్తామని కోర్టులో అప్పీల్ దాఖలు చేశారని పేర్కొన్నారు. నందకుమార్ ద్వారా వారికి నచ్చినట్లు వాంగూల్మం తీసుకొని... తనని ఈ కేసులో ఇరికించే కుట్ర జరుగుతోందనే సమాచారం తమ వద్ద ఉందని చెప్పారు. ‘ఉల్టా చోర్‌ కొత్వాల్‌ కో డాంటే' అన్నట్లుగా... ఈ కేసులో దొంగే దొంగ అన్నట్లుగా బీజేపీ వ్యవహరిస్తోందని రోహిత్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఈ పోరాటంలో తగ్గేది లేదు అని తేల్చి చెప్పారు. ఇది కేవలం బీఆర్ఎస్ సమస్య కాదని.. తెలంగాణ ప్రజల సమస్య అని.. ప్రజలు ఈ విషయాలను గమనించాలని విజ్ఞప్తి చేశారు.

ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగిందన్న అనుమానంతో.. ఈ కేసుపై దృష్టి సారించిన ఈడీ.. రోహిత్ రెడ్డిని రెండు రోజుల పాటు విచారించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రోహిత్ తో వ్యాపార సంబంధాలున్నట్లుగా భావిస్తోన్న అభిషేక్ ను ఈడీ అధికారులు విచారించారు. ఈ కేసులో చంచల్ గూడ జైల్లో ఉన్న నంద కుమార్ ని సైతం విచారించాలని నిర్ణయించారు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో అభ్యర్థించగా.. న్యాయస్థానం అనుమతించింది. రోహిత్ రెడ్డి, అభిషేక్ ఇచ్చిన సమాచారం ఆధారంగా నందును ప్రశ్నించి.. సమాధానాలు రాబట్టేందుకు ఈడీ అధికారులు సన్నద్ధమయ్యారు. సోమ, మంగళవారాల్లో చంచల్ గూడ జైల్లోనే అతడిని విచారించనున్నారు. ఈడీ విచారణలో నందు చెప్పే వివరాలు కేసుకి సంబంధించిన తదుపరి దర్యాప్తుకి కీలకం కానున్నాయి.

తదుపరి వ్యాసం