TS Judicial Enquiry: విద్యుత్ అక్రమాలపై జ్యూడిషియల్ విచారణ జరిపిస్తామన్న రేవంత్ రెడ్డి
21 December 2023, 13:19 IST
- TS Judicial Enquiry: తెలంగాణ విద్యుత్ రంగంలో జరిగిన అక్రమాలపై న్యాయ విచారణ జరిపిస్తామని సిఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. విద్యుత్ రంగంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన శ్వేత పత్రంపై అసెంబ్లీలో వాడీవేడిగా చర్చ జరిగింది.
విద్యుత్ ఒప్పందాలపై న్యాయవిచారణకు రేవంత్ రెడ్డి ఆదేశం
TS Judicial Enquiry: తెలంగాణలో పదేళ్ళ బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో విద్యుత్ రంగంలో జరిగిన అక్రమాలపై న్యాయవిచారణకు సిఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ విద్యుత్ రంగంపై శ్వేత పత్రాన్ని ప్రవేశపెట్టిన డిప్యూటీ సిఎం భట్టి చర్చను ప్రారంభించారు.
తొమ్మిదిన్నరేళ్లలో విద్యుత్ రంగానికి సంబంధించిన ఏ అంశాన్ని సభలో బిఆర్‌ఎస్ పెట్టలేదన్నారు. విద్యుత్ శాఖను స్కానింగ్ చేసి తాము శ్వేత పత్రాన్ని సభలో ప్రవేశపెట్టామన్నారు. తప్పులు అంగీకరించకుండా, వాస్తవాలను ఒప్పుకోకుండా మభ్య పెడుతున్నారన్నారు. విద్యుత్ సరఫరా, ఉత్పత్తిలో అనుభవాన్ని వినియోగించకుండా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. వీటన్నింటిపై విచారణ చేస్తామన్నారు.
ప్రభుత్వానికి జగదీశ్ రెడ్డి సవాలు…
విద్యుత్ రంగంలో భారీగా అప్పులు పేరుకుపోయాయని ప్రభుత్వం ప్రకటించడంపై బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అభ్యంతరం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు లేకుండా ప్రభుత్వాన్ని నడపాలని నిర్ణయించుకుందంటూ జగదీశ్ రెడ్డి అన్నారు. దీనిపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం తెలిపారు.
2014 నాటికి నాలుగు విద్యుత్ సంస్థల్లో 44,438 కోట్లు ఆస్తులు ఉంటే 22,422కోట్లు అప్పులు ఉన్నాయన్నారు. ప్రభుత్వం మారే సమయానికి అప్పు రూ.81,516 కోట్లు ఉంటే , విద్యుత్ సంస్థలకు రూ. 1,37,570కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయన్నారు. తమ ప్రభుత్వంలో ఆస్తుల విలువ పెంచామన్నారు.
కంపెనీల వారీగా జెన్‌కోలో రూ. 7,652 కోట్ల అప్పులు ఉంటే,ఆస్తులు రూ.31వేల కోట్లు ఉన్నాయన్నారు. ట్రాన్స్ అప్పులు రూ.2411కోట్లు, ఆస్తులు రూ.10,136కోట్లు ఉన్నాయని, ఎస్పీడిసిఎల్ రూ.8213కోట్ల అప్పులు, ఆస్తులు 24వేల కోట్లు, ఎన్పీడిసిఎల్‌కు రూ.4132 కోట్ల అప్పులు, 15వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని జగదీష్ రెడ్డి చెప్పారు.
భారతదేశంలో అన్ని రంగాల్లో 24గంటల విద్యుత్‌ను అందిస్తున్నఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని జగదీష్ రెడ్డి చెప్పారు. ఈ విషయం 2022లో నీతి ఆయోగ్ ప్రకటించిందన్నారు. నూటికి నూరు పాయింట్లు తెలంగాణకు నీతి ఆయోగ్ ఇచ్చిందన్నారు. చత్తీస్‌ఘడ్‌లో ఇండస్ట్రీకి 100పాయింట్లు, అగ్రికల్చర్‌కు 66 పాయింట్లు, రాజస్తాన్, గుజరాత్ రాష్ట్రాలకు కూడా ఈ ర్యాంకులు రాలేదన్నారు.
కేరళా, హిమాచల్ ప్రదేశ్, ఒడిషా, తెలంగాణలకు మాత్రమే నీతి అయోగ్ 100పాయింట్లు ఇచ్చిందని గుర్తు చేశారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో విద్యుతుత్పత్తిలో 2014లో 17వేల మెగావాట్ల విద్యుతుత్పత్తి సామర్ధ్యం ఇప్పుడు ఒక్క తెలంగాణలోనే 18వేల ఉత్పత్తి సామర్థ్యం చేరుకుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పరీక్షలు వస్తే తల్లిదండ్రులకు పెద్ద సమస్యగా ఉండేదని, కిరసనాయిల్, క్యాండిల్స్ కోసం వెదుక్కునే పరిస్థితి ఉండేదని ఎద్దేవా చేశారు.
బిఆర్‌ఎస్‌పై కాంగ్రెస్ మంత్రుల ఆగ్రహం…
బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాటల్ని కాంగ్రెస్ మంత్రులు మూకుమ్మడిగా ఖండించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో విద్యుత్, సాగునీరు అందిస్తున్నట్లు బిఆర్‌ఎస్ నేతలు మాట్లాడటాన్ని తప్పు పట్టారు. తెలంగాణలో నాగరికత లేకపోతే బిఆర్‌ఎస్ వచ్చిన తర్వాతే సంస్కరణలు మొదలైనట్టు చెబుతున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో విద్యుత్ కూడా కీలక పాత్ర పోషించిందని, బిఆర్‌ఎస్ చేసిన అభివృద్ధిని మాత్రమే చెప్పాలని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు.
ఈ క్రమంలో తెలంగాణలో పూర్తి పారదర్శకంగా విద్యుత్ రంగాన్ని బిఆర్‌ఎస్ అభివృద్ధి చేసిందని అక్రమాలు నిరూపించాలని జగదీష్ రెడ్డి సవాలు చేశారు. విద్యుత్ శాఖను పూర్తిస్థాయిలో స్కానింగ్ చేసిన వాస్తవాలు ప్రజల ముందు పెట్టామని, జగదీష్ రెడ్డి చేసిన సవాల్ ను స్వీకరిస్తున్నట్లు చెప్పారు. విద్యుత్ రంగంలో జరిగిన అక్రమాలపై ై జ్యుడీషియల్ విచారణకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. మూడు అంశాలపై విచారణకు ఆదేశిస్తామని ప్రకటించారు.
కరెంట్ అనే సెంటిమెంట్ ను గత ప్రభుత్వం ఆర్థిక అవసరాలకు వాడుకుందని, ఛత్తీస్ గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లసౌ ప్రశ్నిస్తే సభ నుంచి మార్షల్స్ తో గెంటించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దీనిపై న్యాయవిచారణ జరిపిస్తామన్నారు. ఛత్తీస్ గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం, భద్రాద్రి కొత్తగూడెంలో 1080 మెగావాట్ల ప్రాజెక్టుపై ఒప్పందంతో పాటు యాదాద్రి ధర్మల్ ప్రాజెక్టుకు సంబంధించి బీహెచ్‌ఈఎల్‌తో జరిగిన ఒప్పందంపై న్యాయ విచారణ జరిపిస్తామని ప్రకటించారు.
జైలుకు వెళ్లడం ఖాయం…
సబ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్ ప్లాంట్ల రూపంలో బిఆర్‌ఎస్ దోపిడీకి పాల్పడిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. విద్యుత్ శాఖలో దోచుకున్న ప్రభాకర్‌రావు జైలుకెళ్లడం ఖాయం, జగదీష్ రెడ్డి సబ్ కాంట్రాక్టర్ మాత్రమేనని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు. జగదీష్ కూడా జైలుకు వెళ్తాడని చెప్పారు. విద్యుత్ రంగం నష్టాల్లో కూరుకుపోవడానికి బిఆర్‌ఎస్ ప్రభుత్వ చేతకాని తనమేనని ఆరోపించారు.
తెలంగాణలో బిఆర్‌ఎస్ పార్టీ కనుమరుగు కావడం ఖాయమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. . ముఖ‌్యమంత్రి ఆదేవించిన జ్యూడిషయల్ విచారణలో అన్ని విషయాలు వెలుగు చూస్తాయన్నారు. జగదీష్ రెడ్డి పేరుకే విద్యుత్ శాఖ మంత్రి అని మొత్తం సిఎండి ప్రభాకర్ రావు చేశారని, జగదీశ్ రెడ్డికి అసలు ఏమి తెలియదని కాంగ్రెస్ మంత్రులు ఎద్దేవా చేశారు.