Revanth Reddy padayatra: కాసేపట్లో మేడారం నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర షురూ
06 February 2023, 10:50 IST
- Revanth reddy padayatra: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర కాసేపట్లో మేడారం నుంచి ప్రారంభం కానుంది. హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో భాగంగా రేవంత్ రెడ్డి ఈ పాదయాత్ర చేపడుతున్నారు.
మేడారం నుంచి పాదయాత్ర ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి
ఏఐసీసీ హాత్ సే హాత్ జోడో పిలుపులో భాగంగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర నేడు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభం కానుంది.
ఈ ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్రకు బయలు దేరారు. వరంగల్ హైవే మీదుగా ములుగుకు బయలుదేరారు. మార్గమధ్యలో పార్టీ శ్రేణులు రేవంత్‌కు ఘన స్వాగతం పలికారు.
కొద్దిసేపటి క్రితం ఘట్కేసర్ చేరుకున్న రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఘన స్వాగతం పలికారు. భారీ పూల మాలలతో రేవంత్ రెడ్డికి స్వాగతం పలికారు.
ములుగులో గట్టమ్మ, సాయిబాబా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు మేడారం సమ్మక్క సారలమ్మ వద్ద ప్రత్యేక పూజలు చేస్తారు. షెడ్యూలు ప్రకారం 12 గంటలకు పాదయాత్ర ప్రారంభించాల్సి ఉంది. మేడారం నుంచి కొత్తూరు, నార్లాపుర్, ప్రాజెక్ట్ నగర్ వరకు పాదయాత్ర సాగుతుంది.
మధ్యాహ్నం 2 నుంచి 2 30 వరకు ప్రాజెక్ట్‌నగర్‌లో భోజన విరామం ఉంటుంది. ప్రాజెక్ట్ నగర్ నుంచి మధ్యాహ్నం 2:30 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభం కానుంది.
సాయంత్రం 4:30 నుంచి 5 గంటలకు పస్రా గ్రామంలో టీ విరామం ఉంటుంది. పస్రా జంక్షన్ లో సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు కార్నర్ మీటింగ్ నిర్వహిస్తారు. తిరిగి సాయంత్రం 6 గంటలకు పస్రా నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుందని టీపీసీసీ వర్గాలు తెలిపాయి. పాదయాత్ర రాత్రి 8 గంటలకు రామప్ప గ్రామానికి చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారు.