Revanth In Bhupalapalli: తెలంగాణను పందికొక్కుల్లా దోచుకున్నారన్న రేవంత్ రెడ్డి
19 October 2023, 8:44 IST
- Revanth In Bhupalapalli: పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం పందికొక్కుల్లా గుల్ల చేశారని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. భూపాలపల్లిలోని 1 ఇంక్లైన్ గేట్ వద్దకు నిర్వహించిన గేట్ మీటింగ్‌లో సింగరేణి కార్మికులతో సమావేశమయ్యారు.
భూపాలపల్లిలో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి
Revanth In Bhupalapalli: తెలంగాణ ప్రజలంతా ఒక్కటై పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం పందికొక్కుల్లా దోచుకు తిన్నారని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో 15 అసెంబ్లీ నియోజక వర్గాల్లో సింగరేణి కార్మికులు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే సమస్యల్ని పరిష్కరిస్తామన్నారు.
భూపాలపల్లిలోని 1 ఇంక్లైన్ గేట్ వద్ద గురువారం ఉదయం నిర్వహించిన సమావేశంలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మధుయాష్కీ, పొంగులేటి, గండ్ర సత్యనారాయణరావులతో కలిసి ఈ సభలో పాల్గొన్నారు.
తెలంగాణ గాంధీనని చెప్పుకుంటున్న మనిషి, పార్లమెంటులో వీరోచితంగా పోరాడతానంటూ మహబూబ్‌నగర్ ప్రజల్ని మోసం చేసి నిద్రపోతున్నపుడు నడుం బిగించింది సింగరేణి కార్మికులని రేవంత్ గుర్తు చేవారు. ఆనాడు రాజకీయ పార్టీలు తెలంగాణ సాధనలో విఫలమైనపుడు జానారెడ్డి ఇంట్లో తెలంగాణ సాధనకు అవసరమైన కార్యాచరణ కోసం కేసీఆర్ శరణు కోరితే కోదండరాం అధ్యక్షతన జేఏసీ ఏర్పడిందని గుర్తు చేశారు.
జేఏసీ ఏర్పాటుతో ఆర్‌ఎస్‌ఎస్ నుంచి ఆర్‌ఎస్‌యూ వరకు, సిపిఐ నుంచి బీజేపీ వరకు అన్ని వర్గాల ప్రజలు ఏకమై తెలంగాణ నినాదాన్ని కేంద్రానికి వినిపించారన్నారు. సకల జనుల సమ్మెలో బొగ్గు ఉత్పత్తి ఆపేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు నిలిచిన సింగరేణి త్యాగాలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మర్చిపోయిందన్నారు. సకల జనుల సమ్మెలో పాల్గొనకుండా, బొగ్గు ఉత్పత్తి ఆపకుండా ఉంటే తెలంగాణ రాష్ట్రాన్ని కళ్లారా చూడలేకపోయే వారిమన్నారు.
కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తోందని రేవంత్ ప్రశ్నించారు. కార్మికులు గొంతెమ్మ కోర్కెలు ఏమి కోరడం లేదని, హక్కులు మాత్రమే అడుగుతున్నారని, అసాధ్యమైనవి ఏమి అడగడం లేదని, సింగరేణి నష్టాలకు జెన్‌కో చెల్లింపులు చేయకపోవడమే కారణమన్నారు.
సింగరేణి సిఎండిగా ఒకే ఒక్క అధికారిని ఎనిమిదేళ్లుగా కొనసాగిస్తూ నష్టాలకు కారణం అయ్యారన్నారు. మోదీ గనులను ప్రైవేటీకరించినపుడు కవిత ఎంపీగా ఆ బిల్లును మద్దతిచ్చారన్నారు. అరబిందో ఫార్మా కంపెనీలకు బొగ్గు కేటాయింపులు ఇచ్చారని, తాడిచర్లలో కేసీఆర్ కుటుంబానికి వాటాలు ఉన్నాయని రేవంత్ ఆరోపించారు.
ఒడిశాలో నైనీ కోల్‌మైన్‌ను ప్రతిమా శ్రీనివాస్‌కు ఇచ్చేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేయడం వాస్తవం కాదా అని నిలదీశారు. ఒడిశాలోని తెలంగాణ ప్రభుత్వ కోల్ మైన్స్‌ను తాము పోరాటాలతో కాపాడుకున్నామన్నారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఇన్నేళ్లకు భవిష్యత్తును మార్చుకునే అవకాశం కార్మికులకు వచ్చిందని చెప్పారు. మాయమాటలు నమ్మితే పదేళ్ల కష్టాలు అలాగే ఉండిపోతారని హెచ్చరించారు.
తెలంగాణలో 16అసెంబ్లీలలో సింగరేణి కార్మికులు గెలుపు ఓటముల్ని నిర్దేశిస్తారని, కార్మికులు ఒక్కతాటిపైకి వచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే సింగరేణి కష్టాలను తొలగిస్తామన్నారు. శ్రీధర్ బాబు, గండ్ర సత్యనారాయణ రావులను గెలిపించాలన్నారు. 2009, 2014, 2018లో సత్యనారాయణకు అన్యాయం జరిగిందని, 20ఏళ్లలో ఎప్పుడూ సింగరేణిని వదులుకోలేదని, ఓడినా తెల్లార్లు సింగరేణి కోసమే పనిచేశారన్నారు. గండ్ర నాయకత్వంలో భూపాలపల్లిలో గెలిపించాలన్నారు.
జెన్‌కో నుంచి సకాలంలో డబ్బులు వచ్చి ఉంటే సింగరేణి ఎన్నికలు వాయిదా ఎందుకు వేసే వారని నిలదీశారు. కేసీఆర్ కార్మికుల ముందుకు ఎందుకు రాలేక పోయారని ప్రశ్నించారు. డిసెంబర్ 25న సింగరేణి ఎన్నికలు జరగాలంటే డిసెంబర్ 3న కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. నవంబర్ 30న ప్రతి ఒక్క కార్మికుడు, 50వేల కుటుంబాలు చర్చించుకోవాలన్నారు.
సింగరేణి కార్మికుల బలాన్ని ప్రదర్శించాలన్నారు. బలప్రదర్శన చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణను గుల్ల చేసిన పందికొక్కుల్ని బోనులో బంధించాల్సిన సమయం వచ్చిందన్నారు.డిసెంబర్9న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవుతుందని, శ్రీధర్‌బాబు సారథ్యంలో కార్మికుల ప్రతి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు.