Osmania University : జర్నలిస్టులను లాక్కెళ్లి... స్టేషన్ కు తరలించి..! ఓయూలో పోలీసుల ఓవర్ యాక్షన్
10 July 2024, 15:38 IST
- ఉస్మానియా వర్శిటీలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. నిరుద్యోగ అభ్యర్థులు చేస్తున్న ఆందోళనను కవరేజ్ చేయడానికి వెళ్లిన పలువురు జర్నలిస్టుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. వీరిలో కొందరిని అదుపులోకి తీసుకోవటం చర్చనీయాంశంగా మారింది.
ఓయూ క్యాంపస్ లో జర్నలిస్టును లాక్కెళ్తున్న పోలీసులు
ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. డీఎస్సీ అభ్యర్థులు చేస్తున్న ఆందోళను కవరేజ్ చేయడానికి వెళ్లిన ఓ మీడియా గ్రూప్ కు చెందిన జర్నలిస్టులను లాక్కెళ్లారు. పోలీసుల వాహనంలోకి ఎక్కించి… స్టేషన్ కు తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పోలీసులు వైఖరిపై బీఆర్ఎస్ నేతలతో పాటు పలు జర్నలిస్ట్ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
జర్నలిస్టులపై పోలీసులది హేయమైన చర్య - TUWJ
పోలీసులపై తీరుపై TUWJ(Telangana state union of working journalist) సంఘ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. “నిరుద్యోగుల ఆందోళనలను కవర్ చెయ్యడానికి వెళ్లిన జీ న్యూస్ జర్నలిస్టు శ్రీచరణ్ ను పోలీసులు అరెస్టు చేయడం హేయనీయం. జర్నలిస్టులమని చెబుతున్నా పోలీసులు దురుసుగా వ్యవహరిస్తూ వారిని బలవంతంగా లాక్కొని పోలీస్ వాహనంలో ఎక్కించుకున్నారు. పోలీసు స్టేషన్ లో నిర్బంధించడం మీడియా భావప్రకటన స్వేచ్ఛను హరించడమే. తెలంగాణలో మరోసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో లాగా పోలీస్ రాజ్యం వచ్చిందా..? అనే విధంగా పోలీసుల వ్యవహార శైలి ఉంది. పోలీసులు అదుపులోకి తీసుకున్న జర్నలిస్టులను వెంటనే విడిచిపెట్టాలి. పోలీసులపై ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి. భవిష్యత్తులో జర్నలిస్టుల పై పోలీసులు ఇలాంటి చర్యలకు పాల్పడితే తప్పనిసరిగా ఆందోళన చేస్తాం” అని హెచ్చరించారు.
ఓయూలో రిపోర్టర్ శ్రీ చరణ్ పట్ల పోలీసుల ప్రవర్తన అమానుషంగా ఉందని హెచ్ యూజే సంఘ నేతలు అభిప్రాయపడ్డారు. “విధుల్లో ఉన్న ఒక రిపోర్టర్ పై ఇలా దురుసుగా వ్యవహరిస్తూ చొక్కా పట్టుకుని పోలీసులు తీసుకెళ్ళడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రిపోర్టర్ శ్రీ చరణ్ పై చేయి వేసి దాష్టీకంగా ప్రవర్తించిన ఓయూ పోలీసులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి” అని డిమాండ్ చేశారు.
జర్నలిస్టులను విడుదల చేయాలి - మాజీ మంత్రి హరీశ్ రావు
ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా జర్నలిస్టుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నిరసనలు తెలియజేస్తుంటే, విధి నిర్వహణలో భాగంగా ఆ వార్తలు కవర్ చేయడమే వారు చేసిన తప్పా..? అని ప్రశ్నించారు.
జర్నలిస్టులను అరెస్టు చేయడం, బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలించడం మీడియా హక్కును, స్వేచ్ఛను కాలరాయడమే అవుతుందన్నారు హరీశ్ రావు. జర్నలిస్టుల పట్ల అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని మార్చుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అదుపులోకి తీసుకున్న జర్నలిస్టులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పోలీసుల తీరు దారుణం - తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్
“ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనలను కవరేజ్ చేయడానికి వెళ్లిన జర్నలిస్టుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును టీజేఎఫ్ తీవ్రంగా ఖండిస్తుంది. విధి నిర్వహణలో భాగంగా జర్నలిస్టులు వార్తలు కవర్ చేయడానికి వెళ్తే పోలీసులు అరెస్ట్ చేయటమేంటి..? కనీసం మీడియా ప్రతినిధులు అనే సోయి లేకుండా పోలీసులు వ్యవహరించిన తీరు చూస్తుంటే... మీడియా స్వేచ్ఛను కాలరాయడమే అవుతుంది. అదుపులోకి తీసుకున్న జర్నలిస్టులను తక్షణమే విడుదల చేయాలి"అని టీజేఎఫ్ అధ్యక్షుడు పల్లె రవి కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నిరుద్యోగులపై ప్రభుత్వానిది దమనకాండ - బీఆర్ఎస్ నేతలు
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ,బీఆర్ఎస్ నేతలు పల్లె రవికుమార్ ,రామచంద్ర నాయక్ ,తుంగ బాలు తెలంగాణ భవన్ లో బుధవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజా పాలన కాదు అన్ని వర్గాల దగా పాలన నడుస్తోందని విమర్శించారు. సంక్షేమ హాస్టళ్లు ,యూనివర్సిటీ క్యాంపస్ హాస్టళ్ల నిర్వహణ అస్తవ్యస్తం అయిందన్నారు. హాస్టళ్ల లో ఫుడ్ పాయిజన్ సాధారణ విషయంగా మారిందని… చట్నీల్లో ఎలుకలు ,అన్నంలో బల్లులు వస్తున్నాయని దుయ్యబట్టారు.
యూనివర్సిటీల్లో 2014కు ముందు నాటి పరిస్థితులు నెలకొన్నాయని… పూర్తిస్థాయి వైస్ ఛాన్సలర్ల ను నియమించలేదన్నారు. నిరుద్యోగులపై దమన కాండ నడుస్తోందన్నారు. రేవంత్ పాలనలో సామాజిక న్యాయం కొరవడిందని విమర్శించారు. ఎస్సీ ,బీసీ మంత్రులకు అధికారులకు అడుగడుగునా అవమానం జరుగుతోందని దుయ్యబట్టారు. యాదాద్రి గుడిలో భట్టికి అవమానం జరిగిందన్న నేతలు… నిన్న బల్కంపేట ఎల్లమ్మగుడిలో పొన్నం ప్రభాకర్ కు అవమానం జరిగిందన్నారు. దళిత ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. రేవంత్ పాలనలో మాటల్లో తప్ప చేతల్లో సామాజిక న్యాయం లేదు
జర్నలిస్టులకు ప్రతి రోజూ పోలీసుల చేతిలో అవమానాలు జరుగుతున్నాయని నేతలు గుర్తు చేశారు. హోం మంత్రిగా రేవంత్ ఉన్నారని… పోలీసులను అడ్డం పెట్టుకుని నిరసనలు అణచివేద్దామనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ లో ఓ ఛానల్ ప్రతినిధి పై పోలీసులు వ్యవహరించిన తీరును ఖండిస్తున్నట్లు తెలిపారు.