Renuka Chowdary: ఖమ్మం రైట్స్ నాకే… విలీన మండలాలు వెనక్కి అడుగుతా…
19 January 2024, 7:55 IST
- Renuka Chowdary: ఖమ్మం ఎంపీ సీటు అడిగే హక్కు తనకు మాత్రమే ఉందని కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి చెబుతున్నారు. విలీన మండలాల కోసం ముఖ్యమంత్రిని కలుస్తానని రేణుకా ప్రకటించారు.
కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి
Renuka Chowdary: కాంగ్రెస్ పార్టీలో తాను ఖమ్మం టిక్కెట్ కోరితే కాదని చెప్పేవారు ఎవరూ లేరని రేణుకా చౌదరి ధీమా వ్యక్తం చేశారు. ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీని ఖమ్మం నుంచి పోటీ చేయాలని మనస్ఫూర్తిగా అడిగామని చెప్పారు. సోనియా తెలంగాణ నుంచి పోటీ చేస్తే ఎంతో శుభసూచకమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఖమ్మం లోక్‌సభ స్థానం సోనియాగాంధీకి రిజర్వు చేశామని, మిగతాది ఆమె నిర్ణయంపై ఆధారపడి ఉందన్నారు.
ఖమ్మం నుంచి పోటీ విషయంలో ఎవరు ఎన్ని ప్రచారాలు చేసుకున్నా వట్టిదేనని కొట్టిపారేశారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా మరో 20 ఏళ్లు ఉంటారని పేర్కొన్నారు. తాను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ఎస్సీ, ఎస్టీ వర్గాలను సైతం దిల్లీ దాకా తీసుకువెళ్లానని చెప్పుకొచ్చారు.
మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అక్రమాలపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వీరోచితంగా పోరాడారని కొనియాడారు. పువ్వాడ అజయ్‌కుమార్ తన సహకారంతోనే ఎదిగారని రేణుకా చెప్పారు.
భద్రాచలం రామాలయ సమస్యలు సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. రామాయణంలో ఖమ్మం జిల్లా పాత్ర తెలియకుండా భాజపా మూర్ఖంగా వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు.
అయోధ్య రామాలయం పూర్తికాకుండానే రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తుండటం బాధాకరమని చెప్పారు. జనవరి 22 తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందన్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఖమ్మం జిల్లా నుంచి ఏపీలో విలీనం చేసిన ముంపు మండలాల కోసం ముఖ్యమంత్రిని కలుస్తానని రేణుకా చెప్పారు.
కాంగ్రెస్ పార్టీలో ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసే హక్కు తనకు మాత్రమే ఉందని కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి పేర్కొన్నారు. సోనియాగాంధీ ఖమ్మం నుంచి పోటీ చేయాలని కోరామని, దానిపై స్పష్టత వచ్చేంత వరకు ఇక్కడ ఎవరి అభ్యర్థిత్వాలపై చర్చలు జరగబోవని స్పష్టం చేశారు.
ఎవరికి ఏ పదవి ఇవ్వాలో అధిష్ఠానం నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. అవసరమైతే భవిష్యత్‌లో టీడీపీతో కలిసి పనిచేస్తామని చెప్పారు. హిందూత్వ పునాదులపై రాజకీయాలు నడపాలనుకుంటున్న వారి ఆటలు భవిష్యత్‌లో సాగబోవని బీsar హెచ్చరించారు.