Hyderabad Metro Parking : నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ఫ్రీ పార్కింగ్ ఎత్తివేత - ఇకపై ఛార్జీలు, అయోమయంలో వాహనదారులు..!
14 August 2024, 15:40 IST
- Hyderabad Nagole Metro Station : నాగోల్ మెట్రో స్టేషన్‌లో ఫ్రీ పార్కింగ్ ఎత్తివేశారు. తాజాగా ధరలను నిర్ణయిస్తూ నిర్వాహకులు బోర్డును ఏర్పాటు చేశారు. నిన్నటి వరకు ఉచితంగా ఉన్న ప్రాంతంలో పెయిడ్ పార్కింగ్ అని చెప్పడంతో వివాదానికి దారి తీసింది. చాలా సేపు వాహనదారులకు, నిర్వాహకులకు మధ్య ఘర్షణ చెలరేగింది.
నాగోల్ మెట్రో వద్ద ఏర్పాటు చేసిన బోర్జు
హైదరాబాద్ లోని నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ఉన్న ఉచిత పార్కింగ్‌ను ఎత్తివేశారు. ఈ మేరకు ధరలను నిర్ణయిస్తూ బోర్డును ఏర్పాటు చేశారు. మంగళవారం వరకు ఉచితంగా ఉన్న పార్కింగ్ ప్లేస్ లో… పెయిడ్ పార్కింగ్ అని చెప్పటంతో వాహనదారులు షాక్ తిన్నారు. చాలాసేపు వాహనదారులకు, నిర్వాహకులకు మధ్య ఘర్షణ చెలరేగింది.
నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ఫ్రీ పార్కింగ్ ఎత్తివేసిన నిర్వాహకులు ధరలను నిర్ణయించారు. బైకును మినిమం 2 గంటల వరకు పార్క్ చేస్తే రూ.10 చెల్లించాల్సి ఉంటుంది. 8 గంటల వరకు పార్కింగ్ చేస్తే రూ.25, 12 గంటల వరకు రూ.40 కట్టాలి. అలాగే కార్లకు మినిమం 2 గంటల వరకు పార్క్ చేస్తే రూ.30 చెల్లించాలి. అదే 8 గంటల వరకు రూ.75, 12 గంటల వరకు అయితే రూ.120 చొప్పున ధరలను నిర్ణయించారు.
ప్రతిరోజూ మాదిరిగానే చాలా మంది వాహనదారులు నాగోల్ మెట్రో స్టేషన్ వద్దకు వచ్చారు. ఈ క్రమంలో నిర్వాహకులు ఫీజు గురించి ప్రస్తావించగా…. చాలా మంది వాహనాదారులకు విషయం అర్థం కాలేదు. ఉచిత పార్కింగ్ సౌకర్యం ఉంది కదా అంటూ ప్రశ్నలు సంధించారు. చాలా సేపు వాహనదారులకు, నిర్వాహకులకు మధ్య ఘర్షణ చెలరేగింది.
పెయిడ్ పార్కింగ్ పేమెంట్ కోసం ఓ యాప్ ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిసింది. ఈ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోవటంలో ఇబ్బందులు తలెత్తటంతో వాహనదారులు మరింత అసహనానికి లోనయ్యారు. కొన్ని ఏళ్లుగా ఉచితంగా పార్కింగ్ చేసుకుంటున్నామని… కనీసం సమాచారం లేకుండా పెయిడ్ పార్కింగ్ ను ఏర్పాటు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఆఫీసులకు వెళ్లే తొందరలో చాలా మంది వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఎపిసోడ్ పై మెట్రో యాజమాన్యం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.