TSRTC : భక్తులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్, ఈ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు
18 December 2023, 21:17 IST
- TSRTC : అరుణాచలం పుణ్య క్షేత్రానికి టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. పౌర్ణమిని పురస్కరించుకుని అరుణాచలానికి సూపర్ లగ్జరీ బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు రంగారెడ్డి రీజనల్ మేనేజర్ తెలిపారు.
టీఎస్ఆర్టీసీ బస్సులు
TSRTC : పంచభూత లింగ క్షేత్రాలలో అరుణాచల పుణ్యక్షేత్రం ఒకటి. పౌర్ణమి సందర్భంగా భక్తులు భారీగా ఆ పుణ్యక్షేత్రానికి వెళుతూ ఉంటారు. తమిళనాడులో ఉండే భక్తులే కాకుండా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాన్ని సందర్శించుకుంటారు. ఈ నేపథ్యంలోనే భక్తులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) శుభవార్త చెప్పింది. పౌర్ణమిని పురస్కరించుకుని భక్తుల కోసం ప్రత్యేకంగా సూపర్ లగ్జరీ బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు రంగారెడ్డి రీజనల్ మేనేజర్ తెలిపారు. ఈనెల 24 రాత్రి 8 గంటలకు ఎంజీబీఎస్ నుంచి బస్సు బయల్దేరి కాణిపాకంలో విఘ్నేశ్వరుడి దర్శనం, వేలూరులోని స్వర్ణ దేవాలయ సందర్శన అనంతరం... 25 రాత్రి 10 గంటలకు అరుణాచలం చేరుకుంటుందని వెల్లడించారు.
అరుణాచలం పుణ్య క్షేత్రానికి ప్రత్యేక బస్సులు
డిసెంబర్ 26న గిరి ప్రదక్షిణ అనంతరం 27న ఎంజీబీఎస్ కు చేరుకుంటుందని తెలిపారు. ఇక ఛార్జీల విషయానికి వస్తే ఒక్క ప్రయాణికుడికి రూ.3,690 లు ఉంటుంది. ఈ టూర్ వివరాలు అధికార ఆర్టీసీ వెబ్ సైట్ లో ఉంచినట్లు రంగారెడ్డి రీజనల్ మేనేజర్ తెలిపారు. భక్తులు ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్ సుఖ్ నగర్, జంట నగరాలలోని సమీప ఆర్టీసీ కేంద్రాల వద్ద టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 9959226257, 9969224911, 9959226426 నంబర్లకు కాల్ చేయాలని కోరారు.
మేడారం జాతరకు హనుమకొండ నుంచి ప్రత్యేక బస్సులు
దేశంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర మేడారం జాతర....2024 ఫిబ్రవరి 21వ తేది నుంచి ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు సమక్క సారలమ్మ జాతర జరుగనుంది. జాతర నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.75 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ జాతరకు దేశ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉండడం వల్ల భక్తుల కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపేందుకు సిద్ధం అయ్యింది. డిసెంబర్ 17 నుంచి మేడారం జాతరకు హనుమకొండ నుంచి స్పెషల్ బస్సులు నడుస్తాయని ఆర్ఎమ్ సునీత ఇటీవలే ప్రకటించారు. ప్రతీ బుధవారం, ఆదివారం నాడు హనుమకొండ బస్ స్టేషన్ లో ప్రతీ 45 నిమిషాలకు మేడారం జాతరకు ఒక ప్రత్యేక బస్సు నడవనున్నట్లు ఆమె వెల్లడించారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్