Yadadri New EO : గీతారెడ్డి రాజీనామా... యాదాద్రి ఆలయ కొత్త ఈఓగా రామకృష్ణ రావు
21 December 2023, 19:05 IST
- Yadadri Lakshmi Narasimha Swamy Temple: తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి దేవస్థాన ఆలయ ఈవోగా రామకృష్ణ రావు బాధ్యతలు చేపట్టారు. గత ప్రభుత్వంలో నియమితులైన గీతారెడ్డి గురువారం తన పదవికి రాజీనామా చేశారు.
యాదాద్రి ఆలయం
Yadadri Temple News: తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో… అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లా ఎస్పీలు, కలెక్టర్లు, కమిషనర్లు కూడా మారారు. అయితే ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఈవోగా ఉన్న గీతారెడ్డి గురువారం రాజీనామా చేశారు. దీంతో ఆలయ నూతన ఈవోగా రామకృష్ణ రావు నియమితులయ్యారు. ఆ వెంటనే ఈవోగా బాధ్యతలు కూడా చేపట్టారు.గతంలో రామకృష్ణ రావు యాదాద్రి ఆలయానికి ఇన్‌చార్జ్ ఈవోగా పనిచేసిన అనుభవం ఉంది.
మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత… పునర్నిరాణ పనులను చేపట్టింది కేసీఆర్ ప్రభుత్వం. దాదాపు రూ. 1200 కోట్లతో నాటి ప్రభుత్వం ఆలయ పునర్నిర్మాణం పనులు చేపట్టింది. ఈ పనుల కోసం యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వైటీడీఏ) ఏర్పాటు చేసింది. దీనికి సీఎం ఛైర్మన్ గా ఉండగా… వైఎస్ ఛైర్మన్ గా కిషన్ రావును నియమించింది. అయితే ఆలయానికి సంబంధించి ధర్మకర్తల మండలిని మాత్రం ఏర్పాటు చేయలేదు. ఇక ఆలయ ఈవోగా గీతారెడ్డిని నియమించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. దాదాపు తొమ్మిదేండ్లుగా ఆమె బాధ్యతలు చూస్తున్నారు. నిజానికి గీతారెడ్డి రిటైర్మెంట్ గడువు ముగిసినప్పటికీ… మూడేళ్లుగా ఇక్కడే పని చేస్తున్నారు. ఆ దిశగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇక ఆమె పదవిలో ఉండగా… పలు సమస్యలు కూడా తెరపైకి వచ్చాయి. ప్రధానంగా యాదాద్రి విస్తరణ పనులతో స్థానికులు చాలా ఇబ్బందిపడ్డారు.రింగ్‌రోడ్డుతో స్థానికులు ఇండ్లు, షాపులు కోల్పోయారు. కొండపైకి ఆటోలను నిషేధించడంతో వందలాది ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఉపాధి కోల్పోయారు. జర్నలిస్టులపై కూడా ఆంక్షలు విధించారు. ఆమె పనితీరుకు సంబంధించి అనేక విమర్శలు, ఆరోపణలు కూడా వచ్చాయి. అయినప్పటికీ… ప్రభుత్వం ఆమెను మార్చకుండా కొనసాగిస్తూ వచ్చింది.
ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో దేవాదాయశాఖ ఆదేశాలతో ఈవో పదవికి గీతారెడ్డి గురువారం రాజీనామా చేశారు. ఓవైపు రాజీనామా చేసిన కొద్దిసేపట్లోనే రామకృష్ణారావు కొత్త ఈవోగా బాధ్యతలు చేపట్టారు.