Ramadan 2022 | హైదరాబాద్‌లో ఘనంగా రంజాన్ వేడుకలు
03 May 2022, 14:31 IST
- పవిత్ర రంజాన్ మాసం ముగింపు సందర్భంగా హైదరాబాద్ లో పండగ వాతావరణం నెలకోంది. రంజాన్ పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు.
హైదరాబాద్ మీర్ ఆలం దర్గా వద్ద ప్రార్థనలు
ఉపవాసాలు, ప్రార్థనాలతో నెలరోజులపాటు నియమనిష్టలతో గడిపిన ముస్లింలు.. రంజాన్ పర్వదినం రోజున.. ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. దీంతో హైదరాబాద్ లో పండగ వాతావరణం కనిపించింది. నగరం, శివార్లలోని మసీదులు వద్ద ప్రార్థనలు జరిగాయి. ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకొన్నారు.
సంప్రదాయ దుస్తులు ధరించి మసీదులు, ఈద్గాలను సందర్శించి ప్రార్థనల్లో పాల్గొన్నారు ముస్లింలు. నగరంలోని మసీదులతో పాటు కొన్ని చోట్ల మహిళలు ఈద్ ప్రార్థనలకు హాజరయ్యేలా ఏర్పాట్లు కూడా చేశారు. కొవిడ్ కారణంగా సామూహిక సమావేశాలపై విధించిన ఆంక్షల దృష్ట్యా.. రెండేళ్ల తర్వాత సామూహిక ప్రార్థనలు జరిగాయి.
మీర్ ఆలం ఈద్గా వద్ద, మక్కా మసీదు ఖతీబ్ మౌలానా హఫీజ్ రిజ్వాన్ ఖురేషీ నేతృత్వంలో జరిగిన ప్రార్థనలకు వేలాది మంది హాజరయ్యారు. టీఎస్ వక్ఫ్ బోర్డు, ఇతర ప్రభుత్వ శాఖలు వేదిక వద్ద విస్తృత ఏర్పాట్లు చేశాయి. మాదన్నపేటలోని పాత ఈద్గా, కుతుబ్ షాహీ టూంబ్స్ ఈద్గా, మాసబ్ ట్యాంక్ హాకీ గ్రౌండ్, సికింద్రాబాద్‌లోని ఈద్గా బాలామ్రాయ్, ఇతర ప్రదేశాలలో కూడా కన్నుల పండువగా ప్రార్థనలు జరిగాయి.
మీర్ ఆలం ఈద్గా వద్ద సీనియర్ పోలీసు అధికారులు ప్రార్థనల అనంతరం ప్రజలను కలుసుకుని ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్ ప్రార్థనల తర్వాత ప్రజలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.
మక్కా మసీదు, చార్మినార్, మీరాలం ఈద్గాతో పాటు తెలంగాణలోని అన్ని మసీదులు, ఈద్గాల్లో ముస్లింలు సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్ పవిత్ర ప్రార్థనలు కొనసాగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.