Rakesh Reddy: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో రాకేశ్ రెడ్డి! ఉప ఎన్నిక కోసం మళ్లీ తెరపైకి..
07 February 2024, 6:04 IST
- Rakesh Reddy: వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ graduate mlc ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి బరిలో నిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో రాకేష్ రెడ్డి
Rakesh Reddy: అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు బీజేపీలో కొనసాగిన ఆయన ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసేందుకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ టికెట్ ఆశించగా.. ఆ పార్టీ అధిష్ఠానం నుంచి రాకేశ్ రెడ్డికి నిరాశే ఎదురైంది. ఆ తరువాత పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ brs పార్టీలో చేరిన ఆయన.. ఎమ్మెల్సీ పదవి హామీతోనే గులాబీ కండువా కప్పుకున్నారనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే పట్టభద్రుల ఎమ్మెల్సీ graduate mlc స్థానాన్ని ఆయనకే కేటాయిస్తారనే ప్రచారం జోరందుకుంది.
బీఆర్ఎస్లో చేరి తెరమరుగు
ప్రతిష్టాత్మక బిట్స్ పిలానీ యూనివర్సిటీలో చదివిన పేరు, అక్కడ స్టూడెంట్ లీడర్ గా ఎదిగిన తీరు, టీవీ డిబేట్లు, పదునైనా మాటలతో ఏనుగుల రాకేశ్ రెడ్డి రాజకీయంగా తనపేరు ప్రజలకు తెలిసేలా చేశారు.
మొదట్నుంచీ బీజేపీలోనే పని చేసిన ఆయన ఆ పార్టీ భావజాలంతోనే జనాలకు సుపరిచితులయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ టికెట్ పై ఆశలు పెట్టుకున్న రాకేశ్ రెడ్డి.. చివరకు ఆ టికెట్ మహిళా కోటాలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలిగా ఉన్న రావు పద్మారెడ్డికి దక్కడంతో ఆయన నిరాశకు గురయ్యారు.
ఆ తరువాత పార్టీ కోసం కష్టపడుతున్నా అధిష్టానం నుంచి సరైన గుర్తించి లభించని కారణంగా ఎన్నికలకు కొద్దిరోజుల ముందు బీజేపీ నుంచి తన క్యాడర్ తో కలిసి వైదొలిగేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పార్టీ పెద్దలకు కూడా సంకేతాలు ఇచ్చినా.. పట్టించుకోకపోవడంతో రాకేశ్ రెడ్డి తీవ్ర వేదనకు గురై బీజేపీ నుంచి తప్పుకున్నారు.
ఆ తరువాత అప్పటి ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి ప్రోద్బలంతో అప్పటి మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమిని మూటగట్టుకోగా.. అప్పటి నుంచి రాకేశ్ రెడ్డి కూడా ఎక్కడా యాక్టివ్ గా కనిపించిన దాఖలాలు లేవు.
గ్రాడ్యుయేట్ ఎన్నికలతో రీ ఎంట్రీ
వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా 2021లో ఎన్నికైన పల్లా రాజేశ్వర్‌రెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
వాస్తవానికి 2027 మార్చి 29వరకు పదవీ కాలం ఉండటంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ మేరకు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్‌కు ఎన్నికల నిర్వహణపై ఆదేశాలిచ్చింది. తొలి దశలో ఓటర్ల నమోదు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇదిలాఉంటే రాకేశ్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరే క్రమంలోనే ఎమ్మెల్సీ పదవి హామీతోనే గులాబీ కండువా కప్పుకుంటున్నారనే ప్రచారం జరిగింది.
పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి ఇద్దరూ స్పష్టంగా అదే హామీ ఇచ్చి రాకేశ్ రెడ్డిని పార్టీకి తీసుకెళ్లారనే ఆరోపణలున్నాయి. కాగా ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎన్నికలకు కసరత్తు జరుగుతుండటంతో ఇన్నిరోజులు తెరమరుగునే ఉన్న రాకేశ్ రెడ్డి పేరు.. మళ్లీ తెరమీదకు వచ్చింది. ఉన్నతంగా చదివిన వ్యక్తి కావడంతోపాటు స్థానిక సమస్యలు తెలిసి ఉన్న నేత కావడం, విద్యారంగంపై పట్టున్న నేపథ్యంలో ఆయనను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
పట్టుబడుతున్న ఇద్దరు లీడర్లు!
రాకేశ్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకునే సమయంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి హామీ ఇచ్చిన నేపథ్యంలో వారిద్దరూ కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాన్ని రాకేశ్ రెడ్డికే కేటాయించాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. దీంతోనే ఇటీవల మళ్లీ తెరమీదకు వచ్చిన రాకేశ్ రెడ్డి చదువుకున్న యువతతో ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నాల్లో పడ్డారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక కోసం పట్టభద్రులు దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా సోషల్ మీడియా వేదికన విజ్ఞప్తి కూడా చేస్తున్నారు. తన క్యాడర్ తో పట్టభద్రులకు దగ్గరయ్యే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఫిబ్రవరి 6 వరకు ఓటర్ల నమోదుకు అవకాశం ఉండగా.. ఏప్రిల్ 4 నాటికి తుది ఓటర్ల జాబితా ప్రకటించడంతోపాటు జూన్ 8 నాటికి ఉప ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుని, ఎమ్మెల్సీ స్థానాలపైనా కన్నేయగా.. బీఆర్ఎస్ పార్టీ కూడా టికెట్ల కేటాయింపులో తీవ్ర కసరత్తు చేస్తోంది. మరి వరంగల్–ఖమ్మం–నల్గొండ స్థానాన్ని ఆ ఇద్దరు నేతలు పట్టుబడుతున్నట్టుగా రాకేశ్ రెడ్డికే కేటాయిస్తుందో.. లేదా మరెవరికైనా అవకాశం ఇస్తుందో చూడాలి.
(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)