తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Dasaradhi Award 2024 : జూకంటి జగన్నాథంకు దాశరథి కృష్ణమాచార్య అవార్డు, సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

Dasaradhi Award 2024 : జూకంటి జగన్నాథంకు దాశరథి కృష్ణమాచార్య అవార్డు, సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

21 July 2024, 14:45 IST

google News
    • Dasaradhi Award 2024 : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే దాశరథి కృష్ణమాచార్య అవార్డుకు ఈ ఏడాది ప్రముఖ రచయిత జూకంటి జగన్నాథం పేరును ఎంపిక చేసింది.
జూకంటి జగన్నాథంకు దాశరథి కృష్ణమాచార్య అవార్డు, సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
జూకంటి జగన్నాథంకు దాశరథి కృష్ణమాచార్య అవార్డు, సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

జూకంటి జగన్నాథంకు దాశరథి కృష్ణమాచార్య అవార్డు, సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

Dasaradhi Award 2024 : దాశరథి కృష్ణమాచార్య జయంతి పురస్కరించుకుని ప్రతి ఏటా ప్రకటించే ప్రతిష్టాత్మక "శ్రీ దాశరథి కృష్ణమాచార్య అవార్డు" 2024 సంవత్సరానికి ప్రముఖ రచయిత జూకంటి జగన్నాథం ఎంపికయ్యారు. రచయిత జూకంటి జగన్నాథంకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. కవి, రచయిత, కథకుడు జూకంటి జగన్నాథం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగేళ్లపల్లి మండలానికి చెందిన వారు. మూడు దశాబ్దాలుగా జూకంటి కవితా ప్రస్థానం కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన 11 పురస్కారాలు పొందారు. జూకంటికి దాశరథి అవార్డుతో పాటు రూ.1,01,116 నగదు పురస్కారం అందించనున్నారు.

జూకంటి జగన్నాథం 1955 జూన్ 20న దుర్గయ్య-సుశీల దంపతులకు తెలంగాణలోని రాజన్న సిరిసిల్లా జిల్లా తంగళ్లపల్లి గ్రామంలో జన్మించారు. 1993లో ఆయన సాహితీ ప్రస్థానం ప్రారంభించారు. 2007- 2013 మధ్య తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షునిగా జూకంటి వ్యవహరించారు. 2014 నుంచి ఆయన అఖిల భారత తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. శ్రమ దోపిడీ, రాచరిక వ్యవస్థ, ప్రభుత్వ వైఫల్యాలను తన కవితలు, రచనల ద్వారా జూకంటి ఎండగట్టారు. ప్రపంచీకరణపై నిరసన గళం విప్పిన కవి ఆయన. స్థానిక మాండలికంతో సాగే జూకంటి కవితలు కన్నడ, తమిళ, హిందీ, ఆంగ్ల భాషల్లోకి అనువాదమయ్యాయి.

జగన్నాథం ముఖ్యంగా వచన కవిత్వం రాస్తారు. జూకంటి కవిత్వంపై ఎం.నారాయణ శర్మ విశ్లేషణ చేసి ఊరి దుఃఖం పేరుతో ఒక వ్యాసాల పుస్తకాన్ని రాశారు. అభ్యుదయ, విప్లవ, దళిత, బహుజన, మైనార్టీ వాదాలపై జూకంటి జగన్నాథం కవిత్వం రాశారు. ప్రధానంగా ప్రపంచీకరణ పరిణామాలను మొదటగా తెలుగు సాహిత్యంలో కవిత్వం రాసిన కవిగా గుర్తింపు పొందారు. ఆయన పాతాళ గరిగె (1993), ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (1996), గంగడోలు (1998), వాస్కోడిగామా డాట్ కామ్ (2000), బొడ్డుతాడు (2002), ఒకరోజు పదిగాయాలు(2004), తల్లికొంగు (2006), పిడికెడు కలలు! దోసెడు కన్నీళ్లు! (2008), తారంగం (2009)

రాజపత్రం (2011), చిలుక రహస్యం (2012), చెట్టును దాటుకుంటూ(2015), వస (2017), ఊరు ఒక నారుమడి (2018), సద్దిముల్లె (2020) రచనలు చేశారు

2015 నుంచి దాశరథి అవార్డు ప్రదానం

సాహిత్య రంగంలో విశేషంగా కృషి చేసిన వారిని తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా దాశ‌ర‌థి జ‌యంతి(జులై 22) రోజున ఆ అవార్డును ప్రదానం చేస్తుంది. 2015 నుంచి రాష్ట్ర ప్రభుత్వం దాశరథి అవార్డు ప్రదానం చేస్తుంది. తెలుగు సాహిత్యంలో విశిష్ఠ స్థానం పొందిన దాశరథి కృష్ణమాచార్య 1925 జులై 22న వరంగల్ జిల్లా గూడూరులో జన్మించారు. ఆయన పేరుపై తెలంగాణ ప్రభుత్వం అవార్డు ప్రదానం చేస్తుంది. సాహిత్య రంగంలో విశేష సేవ చేసిన రచయితలు, కవులకు ఈ పురష్కారం అందిస్తోంది. 2015లో మొదటిగా దాశరథి సాహితీ పురస్కారాన్ని కవి ఆచార్య తిరుమల శ్రీనివాసాచార్యకు అందించారు. 2016లో జే.బాపురెడ్డికి, 2017లో ఆచార్య ఎన్.గోపికి, 2018లో వ‌ఝ‌ల శివ‌కుమార్‌కి, 2019లో డాక్టర్ కూరెళ్ల విఠ‌లాచార్యకు, 2020లో తిరున‌గ‌రి రామానుజ‌య్యకు, 2021లో తెలుగు యూనివ‌ర్సిటీ పూర్వ వీసీ ఎల్లూరి శివారెడ్డి, 2022 లో ప్రముఖ కవి వేణు సంకోజుకు, 2023లో నటేశ్వర శర్మకు దాశ‌ర‌థి కృష్ణమాచార్య అవార్డు ప్రదానం చేశారు. ఈ ఏడాది జూకంటి జగన్నాథంకు పురస్కారం ప్రకటించారు.

తదుపరి వ్యాసం