Online Bettings: ఆన్లైన్ బెట్టింగులకు రైల్వే ఉద్యోగి బలి, ఆర్థిక ఇబ్బందులతో మరొకరు ఆత్మహత్యాయత్నం
16 July 2024, 11:29 IST
- Online Bettings: ఆన్ లైన్ బెట్టింగులు మరో యువకుడి ప్రాణాలు తీశాయి. రైల్వే ఉద్యోగిగా పని చేస్తున్న ఓ యువకుడు బెట్టింగులకు అలవాటు పడగా, తీవ్రంగా నష్టపోయి చివరకు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆన్‌లైన్ బెట్టింగులకు యువకుడి ఆత్మహత్య
Online Bettings: ఆన్ లైన్ బెట్టింగులు మరో యువకుడి ప్రాణాలు తీశాయి. రైల్వే ఉద్యోగిగా పని చేస్తున్న ఓ యువకుడు బెట్టింగులకు అలవాటు పడగా, తీవ్రంగా నష్టపోయి చివరకు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రానికి చెందిన దేవర రాజు(38) రైల్వే ఉద్యోగిగా పని చేస్తున్నాడు. నెలవారీగా వేతనం బాగానే వస్తున్నా.. కొద్ది రోజులుగా రాజు ఆన్ లైన్ గేమ్స్ ఆడటం మొదలు పెట్టాడు.
ఆన్ లైన్ బెట్టింగులు కాస్తూ వాటికే అలవాటు పడ్డాడు. దీంతో మొదట్లో బాగానే ఉన్నప్పటికీ ఆ తరువాత రాజు తీవ్రంగా నష్టపోయాడు. ఆ తరువాత కొంతమంది వద్ద రూ.లక్షల్లో అప్పులు చేసి బెట్టింగులకు ధార పోశాడు. అయినా కలిసి రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అయ్యాయి. ఇదే క్రమంలో అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిళ్లు మొదలవడంతో రాజు మానసికంగా కుంగిపోయాడు.
ఈ క్రమంలోనే తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించుకున్నాడు. సోమవారం రఘునాథపల్లి మండల కేంద్రంలోని స్టేషన్ కు కొద్దిదూరంలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెట్టింగులకు పాల్పడి రైల్వే ఉద్యోగి రాజు సూసైడ్ చేసుకోగా స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఆన్ లైన్ బెట్టింగులకు అలవాటు పడొద్దని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. జనాల్లో మార్పు రావడం లేదని, ఇకనైనా జనాలు అవగాహనతో మెలగాలని పోలీసులు సూచిస్తున్నారు.
పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం
ఆర్థిక ఇబ్బందులతో ఓ ఆటో డ్రైవర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఖిలా వరంగల్ మండలం వసంతాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం.. వసంతాపూర్ గ్రామానికి చెందిన రాళ్లపల్లి అయిలయ్య(55) కొంతకాలంగా ఆటో డ్రైవర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల అనారోగ్యానికి గురి కావడంతో కొద్ది రోజులుగా ఇంటి వద్దే ఉంటున్నాడు.
దీంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తగా కుటుంబంలో కలహాలు కూడా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన అయిలయ్య తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ సమయం చూసి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటకు తట్టుకోలేక కేకలు వేయడంతో గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని మంటలను ఆర్పి వేశారు. అప్పటికే 50 శాతం కాలిన గాయాలతో అయిలయ్య కుప్ప కూలగా, వెంటనే 108 అంబులెన్స్ లో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
అక్కడ బర్న్స్ వార్డులో అడ్మిట్ చేసిన డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. కాగా విషయం తెలుసుకున్న గీసుగొండ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించే పనిలో పడ్డారు. కాగా ఆటో డ్రైవర్ గా పని చేస్తున్న అయిలయ్య పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)