Agnipath Protest : అగ్నిపథ్ ఆందోళన కారులకు బెయిల్ మంజూరు
01 August 2022, 15:03 IST
- అగ్నిపథ్ ఆందోళన కారులకు బెయిల్ మంజూరైంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చొరవతో, న్యాయ సహాయంతో బెయిల్ మంజూరైనట్టుగా తెలుస్తోంది.
సికింద్రాబాద్ అగ్నిపథ్ ఆందోళన(ఫైల్ ఫొటో)
సికింద్రాబాద్ అగ్నిపథ్ ఆందోళన కేసులో 16 మందికి బెయిల్ మంజూరు చేసింది రైల్వే కోర్టు. వారికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సాయం చేసినట్టుగా తెలుస్తోంది. గతంలో అగ్నిపత్ ఆందోళనలో పాల్గొన్న వారిని చంచల్ గూడ జైల్ కు వెళ్లి రేవంత్ రెడ్డి ములాఖత్ అయ్యారు. అగ్నిపత్ బాధితులకు న్యాయ సహాయం చేస్తామని గాంధీభవన్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. వారికి ఇచ్చిన హామీ మేరకు న్యాయ సహాయం చేయడంతో పలువురు ఆందోళన కారులకు బెయిల్ మంజూరైంది.
అయితే మరోవైపు నిందితులుగా ఉన్న అభ్యర్థులకు పరీక్షలు ఉన్నట్టుగా తెలుస్తోంది. A1 నుంచి A10 వరకు రైల్వే కోర్టు బెయిల్ మంజూరు చేయలేదు. ఈ కేసులో మొత్తం 63 మందిని అరెస్టు చేసి.. రిమాండ్‌కు పంపించారు రైల్వే పోలీసులు. కోచింగ్ సెంటర్ నిర్వాహకుడి బెయిల్ గతంలో రిజక్ట్ అయింది. దీంతో అతడు హైకోర్టును ఆశ్రయించాడు. ప్రస్తుతం హైకోర్టులో ఆవుల సుబ్బారావు బెయిల్ పిటిషన్ పెండింగ్‌లో ఉంది.
ఏమైందంటే
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జూన్ 17వ తేదీన అల్లర్లు జరిగాయి. ఈ ఘటనలో ఆస్తి నష్టం జరిగింది. పోలీసులు చేసిన కాల్పుల్లో రాకేశ్ అనే ఆందోళన కారుడు మృతి చెందాడు. ఈ అల్లర్లకు సంబంధించి.. మొత్తం 63 మందిని నిందితులుగా చేర్చారు. వారిని అరెస్టు చేశారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన కేసుతోపాటు ఇతర కేసులు నమోదు చేశారు.
సికింద్రాబాద్ విధ్వంసంలో సాయి డిఫెన్స్ అకాడమీకి చెందిన ఆవుల సుబ్బారావు మద్దతు ఇస్తున్నాడని విచారణలో తేలింది. అతడితోపాటు సాయి డిఫెన్స్ అకాడమీకి చెందిన శివ ఆందోళనకారులకు సహకరించినట్టు తెలిసింది. ఆందోళనకారులకు సుబ్బారావు, శివ పలు విధ్వంసక వస్తువులు అందించినట్టు పోలీసులు తెలిపారు. వాట్సాప్ గ్రూపుల ద్వారానే ఆందోళన కార్యక్రమానికి ప్రణాళిక జరిగిందని గుర్తించారు.