Rahul Gandhi Campaign: టీ కాంగ్రెస్ బస్సు యాత్రలో పాల్గొనున్న రాహుల్ గాంధీ
16 October 2023, 7:41 IST
- Rahul Gandhi Campaign: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీలన్నీ ప్రచారాలను ముమ్మరం చేస్తున్నాయి.ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ ఈ నెల 18 నుండి బస్సు యాత్రను చేపడుతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అక్టోబర్ 18 నుంచి మూడు రోజుల పాటు తెలంగాణలో జరిగే బస్సు యాత్రలో పాల్గొననున్నారు.
తెలంగాణలో రాహుల్ గాంధీ బస్సు యాత్ర
Rahul Gandhi Campaign: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం నింపేందుకు బస్సు యాత్రలకు శ్రీకారం చుట్టారు. ఇందులో రాహుల్ గాంధీ కూడా పాల్గొననున్నారు. ములుగు, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో మొత్తం 8 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో దాదాపు 190 కిలోమీటర్ల మేర రాహుల్ బస్సు యాత్రలో పర్యటించనున్నట్లు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు.
అయిదు జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలలో రాహుల్ ప్రసంగిస్తారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. అలాగే పాదయాత్ర చేస్తారని, వివిధ వర్గాల ప్రజలతో కూడా రాహుల్ గాంధీ మమేకమవుతారని పేర్కొన్నారు.
రాహుల్ షెడ్యూల్ ఇదే
షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 18న సాయంత్రం నాలుగు గంటలకు ములుగు నియోజకవర్గంలో రామప్ప ఆలయాన్ని రాహుల్ సందర్శించనున్నారు.అనంతరం బస్సు యాత్రను లాంఛనంగా ప్రారంభించి ములుగు పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ ప్రసంగిస్తారు.
ములుగు పట్టణం నుంచి భూపాలపల్లి వరకు 35 కిలోమీటర్ల మేర సాగే బస్సు యాత్రలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. అనంతరం రాత్రి ఏడు గంటలకు భూపాలపల్లి జిల్లాలో నిరుద్యోగ యువత తో కలిసి పాదయాత్రలో రాహుల్ పాల్గొంటారు.
మరుసటి రోజు అక్టోబర్ 19న రాహుల్ గాంధీ ఉదయం 10 గంటలకు రామగుండం నియోజకవర్గంలో పర్యటిస్తారు.అక్కడ సింగరేణి, NTPC మరియు RFCL కార్మిక సంఘాల నాయకులతో పాటు కాంట్రాక్టు కార్మికులతో రాహుల్ సమావేశమ వననున్నారు.
అనంతరం రామగుండం నుంచి పెద్దపల్లి వరకు 30 కిలోమీటర్ల మేర సాగే బస్సు యాత్రలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. అనంతరం పెద్దపల్లి జిల్లాలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మరియు రైతులతో ఆయన సమావేశమై బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు రాహుల్ గాంధీ పెద్దపల్లి నుంచి కరీంనగర్ వరకు 35 కిలోమీటర్ల బస్సు యాత్రలో పాల్గొని కరీంనగర్‌లో సాయంత్రం పాదయాత్రలో పాల్గొంటారు.
అక్టోబర్ 20న బోధన్, ఆర్మూర్ మరియు నిజామాబాద్ జిల్లాలో రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. బోధన్ నియోజకవర్గంలో బీడీ రోలర్లు, గల్ఫ్ వలస కార్మికుల కుటుంబాలతో ఆయన సంభాషించనున్నారు.నిజాం షుగర్ ఫ్యాక్టరీని కూడా రాహుల్ గాంధీ సందర్శించనున్నారు. అనంతరం బోధన్ నుంచి ఆర్మూరు వరకు 50 కిలోమీటర్ల మేర బస్సు యాత్రలో పాల్గొంటారు.
ఆర్మూర్ లో ఆయన బహిరంగ సభలో ప్రసంగించడం తో పాటు పసుపు, చెరకు రైతులతో కూడా సమావేశమవుతారు.అనంతరం ఆర్మూర్ నుంచి నిజామాబాద్ వరకు 25 కిలోమీటర్ల మేర సాగే బస్సు యాత్ర లో రాహుల్ పాల్గొంటారు. అదే సాయంత్రం నిజామాబాద్ జిల్లాలో పాదయాత్ర చేసి తన మూడు రోజుల పర్యటనను ముగించుకుని తిరిగి ఢిల్లీకి తిరుగు ప్రయాణం చేస్తారు.
ఏ రోజు ఏ నియోజకవర్గంలో…
• 18-10-2023 - ములుగు, భూపాలపల్లి
• 19-10-2023 - రామగుండం,పెద్దపల్లి,కరీంనగర్
• 20-10-2023 - బోధన్,ఆర్మూర్,నిజామాబాద్
(కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్)