తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Pm To Hyderabad : జనవరి 19న రాష్ట్రానికి ప్రధాని.. వందే భారత్ రైలుని ప్రారంభించనున్న మోదీ

PM to Hyderabad : జనవరి 19న రాష్ట్రానికి ప్రధాని.. వందే భారత్ రైలుని ప్రారంభించనున్న మోదీ

HT Telugu Desk HT Telugu

07 January 2023, 21:16 IST

google News
    • PM to Hyderabad : జనవరి 19న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనకు రానున్నారు. దక్షిణ మధ్య రైల్వేకు మంజూరైన తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుని సికింద్రాబాద్ లో పచ్చ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ మేరకు మోదీ పర్యటన ఖరారైంది. 
వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించనున్న మోదీ
వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించనున్న మోదీ

వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించనున్న మోదీ

PM to Hyderabad : ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. జనవరి 19న రాష్ట్రానికి రానున్న మోదీ.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మంజూరైన తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ని ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి పచ్చ జెండా ఊపి ఈ రైలుని మోదీ ప్రారంభిస్తారు. సికింద్రాబాద్ స్టేషన్ ఆధునికీకరణలో భాగంగా చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలనూ మోదీ ప్రారంభిస్తారు. పర్యటనలో భాగంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది. రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ మధ్య తీవ్రపోరు సాగుతోన్న పరిస్థితిలో... ప్రధాని రాష్ట్రానికి రానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

గత నవంబర్ లో పీఎం మోదీ తెలంగాణలో పర్యటించారు. రామగుండం ఎరువు ఫ్యాక్టరీని జాతికి అంకితం చేశారు. రైల్వే లైన్, జాతీయ రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని బేగంపేట్ వద్ద స్వాగత సభలో... రామగుండం బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. ఈ నేపథ్యంలో... జనవరి 19న జరగనున్న కార్యక్రమంలోనూ మోదీ ప్రసంగం ఉండేలా పార్టీ ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది. తద్వారా బీజేపీ విధానాలను, పరిపాలనా ఫలితాలను ప్రజల్లోకి తీసుకెళ్లినట్లు అవుతుందని భావిస్తోంది. మరి.. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వస్తోన్న మోదీ.. కేవలం అధికారిక కార్యక్రమాలకే పరిమితం అవుతారా లేక రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపైనా నేతలతో చర్చిస్తారా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

కాగా.... దేశీయ రైలు ప్రయాణాలకు ఆధునిక హంగులు తెచ్చిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను దశలవారీగా అన్ని జోన్లలో ప్రవేశపెడుతున్నారు. అత్యాధునిక హంగులతో నిర్మించిన ఈ రైళ్లు తెలుగు రాష్ట్రాలకు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయోనని ఎదురు చూస్తున్న ప్రజల నిరీక్షణకు.. జనవరి 19తో తెరపడనుంది. లగ్జరీ ప్రయాణ అనుభూతిని కల్పించే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ సికింద్రాబాద్ - విజయవాడ మధ్య అందుబాటులోకి రానుంది. దేశ వ్యాప్తంగా ఇప్పటికే ఐదు వందే భారత్ రైలు సేవలు ప్రారంభమయ్యాయి. దక్షిణ మధ‌్య రైల్వే పరిధిలో ప్రారంభమయ్యే సర్వీసుతో ఆరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలెక్కనుంది. గరిష్టంగా గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యమున్న వందే భారత్ రైలు రెండు నిమిషాల కంటే తక్కువ వ్యవధిలోనే 160 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో వందే భారత్ రైళ్లను ప్రారంభించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గత కొద్ది రోజులుగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కి విజ్ఞప్తి చేస్తున్నారు. పలు దఫాలుగా రైల్వే మంత్రి తో నేరుగా చర్చలు జరిపారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రైల్వే ప్రాజెక్టుల్లో వేగం పెంచాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. దక్షిణ మధ్య రైల్వేకు తొలి వందేభారత్ రైలు మంజూరైంది. ప్రస్తుతం ఈ రైలులో సీట్లు మాత్రమే ఉన్నందున.. విజయవాడ వరకు నడిపిస్తామని.. బెర్తులతో రైలుని అప్ గ్రేడ్ చేసిన తర్వాత విశాఖపట్నం వరకు పొడిగిస్తామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి హామీ ఇచ్చారు.

తదుపరి వ్యాసం