Nallu Indrasena Reddy: త్రిపుర గవర్నర్‌గా నల్లు ఇంద్రసేనా రెడ్డి నియామకం
19 October 2023, 9:43 IST
- Nallu Indrasena Reddy: బీజేపీ సీనియర్ నాయకుడు నల్లు ఇంద్ర సేనా రెడ్డిని త్రిపుర రాష్ట్ర గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ఎన్నికల వేళ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
త్రిపుర గవర్నర్‌గా నల్లు ఇంద్రసేనా రెడ్డి
Nallu Indrasena Reddy: తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు నల్లు ఇంద్రసేనా రెడ్డిని త్రిపుర రాష్ట్ర గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్రానికి చెందిన సీనియర్ నాయకుడికి కీలక బాధ్యతలు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. ఈమేరకు రాష్ట్రపతి కార్యాలయం బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
1953 జనవరి 1న జన్మించిన ఇంద్రసేనా రెడ్డి 1983, 1985, 1999లలో జరిగిన ఎన్నికల్లో హైదరాబాద్ మలక్‌పేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1989, 1994లలో మలక్‌పేటలోనే ఓడిపోయారు. గెలుపొటములతో సంబంధం లేకుండా తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్రపోషించారు. 1999లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేతగా పనిచేశారు.
ఇంద్రసేనా రెడ్డి 2003-07 మధ్యకాలంలో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 2014లో పార్టీ జాతీయ కార్యదర్శిగా, 2020లో పార్టీ జాతీయ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమితులయ్యారు.
2004లో నల్గొండ, 2014లో భువనగిరి లోక్‌సభ స్థానాలకు పోటీ చేసి ఓడిపోయారు. తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకుల్లో ఇప్పటికే పలువురిని గవర్నర్ పదవులు వరించాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని బలోపేతం చేయడంలో కీలకంగా వ్యవహరించిన మాజీ అధ్యక్షులు వి.రామారావు, చెన్నమనేని విద్యాసాగర్‌రావు, బండారు దత్తాత్రేయలకు ఇప్పటికే గవర్నర్ పదవులు వరించాయి. తాజాగా ఇంద్రసేనారెడ్డి గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నారు.
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు ప్రస్తుతం మిజోరం గవర్నర్‌గా ఉన్నారు. బండారు దత్తాత్రేయ హర్యానా గవర్నర్‌గా ఉన్నారు. ఇంద్రసేనారెడ్డి నియామకంతో తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గవర్నర్ల సంఖ్య మూడుకు చేరింది. తెలంగాణకు చెందిన ఇద్దరు నాయకులు ఒకేసారి గవర్నర్లుగా పనిచేస్తున్నారు.
త్రిపుర గవర్నర్‌గా ఇప్పటివరకు బిహార్‌కు చెందిన సత్యదేవ్ నారాయణ్ ఆర్య పని చేశారు. ఆయన స్థానంలో ఇంద్రసేనారెడ్డిని నియమించారు. ఇంద్రసేనా రెడ్డితో పాటు ఒడిశా గవర్నర్‌గా ఝార్ఖండ్ మాజీ సీఎం రఘుబర్‌దాస్‌ను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని గానుగబండ గ్రామానికి చెందిన ఇంద్రసేనారెడ్డి తొలితరం బీజేపీ నేతల్లో కీలకంగా వ్యవహరించారు. మొదట ఏబీవీపీలో చేరిన ఆన ఉమ్మడి ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. భారతీయ జనతా యువమోర్చా జాతీయ కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్లారు.
1983లో మలక్‌పేట నియోజకవర్గం నుంచి తొలిసారి బీజేపీ అభ్యర్థిగా గెలుపొందారు. నాటి ఎన్నికల్లో అప్పటి హోం మంత్రి ప్రభాకర్ రెడ్డిని ఓడించారు. తర్వాత 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 17,791 ఓట్ల మెజారిటీతో మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు ఓడించారు. 1999లో జరిగిన ఎన్నికల్లో మూడోసారి గెలిచిన ఇంద్రసేనా రెడ్డి పార్టీ శాసనసభ పక్ష నేతగా వ్యవహరించారు.
2003 ఆగస్టులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులై 2006 వరకు ఆ పదవిలో కొనసాగారు. 2007లో బీజేపీ జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఆయన పార్టీ జాతీయ కార్యవర్గంలో కొనసాగుతున్నారు.
తెలంగాణకు మద్దతులో కీలక పాత్ర…
తెలంగాణకు అనుకూలంగా బీజేపీ నిర్ణయం తీసుకోవడంలో ఇంద్రసేనా రెడ్డి ప్రధాన పాత్ర పోషించారు. 2005లో అప్పటి పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ పార్టీ కట్టుబడి ఉందని తొలిసారిగా ప్రకటన చేశారు. బీజేపీ ప్రకటన వెనుక నాటి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఇంద్రసేనా రెడ్డి కీలక పాత్ర పోషించినట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి.
ఇంద్రసేనా రెడ్డికి గతం లోనూ గవర్నర్ పదవి వరించే ప్రతిపాదన వచ్చి నా ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. పార్టీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న కీలక తరుణంలో ఆయన త్రిపుర గవర్నర్‌గా నియమించడంపై పార్టీలో హర్షం వ్యక్తం అవుతోంది.