Mulugu Encounter: ఎన్ కౌంటర్ మృత దేహాలకు పోస్టుమార్టం, మత్తుమందు ఇచ్చి చంపారంటున్న మృతుల కుటుంబ సభ్యులు
02 December 2024, 18:06 IST
- Mulugu Encounter: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చల్పాక అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఏడుగురు మావోయిస్టులు హతమైన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం ఈ ఎన్ కౌంటర్ జరగగా.. మృత దేహాలు చల్పాక అటవీ ప్రాంతంలో చెల్లాచెదురుగా పడిపోయాయి. మృతదేహాలను ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు.
మావోయిస్టుల మృతదేహాలకు పోస్టు మార్టం పూర్తి
Mulugu Encounter: ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన వారి డెడ్ బాడీలను ముందుగా ఏటూరు నాగారం పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి.. రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు ఏటూరు నాగారం పీఎస్ నుంచి ట్రాక్టర్ లో మృతదేహాలను ఎక్కించి చిన్నబోయిన పల్లి వరకు తీసుకెళ్లారు. అప్పటికే ఆలస్యం కావడం, మావోయిస్టుల నుంచి ఎదురుదాడులు జరిగే అవకాశం ఉందన్న ఉద్దేశంతో పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డెడ్ బాడీలను మళ్లీ వెనక్కి తీసుకొచ్చారు.
ములుగు జిల్లా ఆసుపత్రి నుంచి తెప్పించిన ఫ్రీజర్ బాక్సులను ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసి మృతదేహాలను వాటిలో భద్ర పరిచారు. కాగా ఎన్ కౌంటర్ లో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కుర్సం మంగు అలియాస్ భద్రు అలియాస్ పాపన్న, జిల్లా కమిటీ సభ్యుడు ఏగోలపు మల్లయ్య అలియాస్ మధు అలియాస్ కోటి, ఏరియా కమిటీ సభ్యులు ముస్సాకి కరుణాకర్ అలియాస్ దేవల్, జమున, జైసింగ్, కిషోర్, కామేష్ చనిపోగా.. వారి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం చేరవేశారు.
ఏటూరు నాగారం ఏరియా ఆసుపత్రి మార్చురీ వద్ద ములుగు మెడికల్ కాలేజీ ప్రొఫెసర్లు, ఫోరెన్సిక్ నిపుణులు పోలీసులు, రెవెన్యూ అధికారుల సమక్షంలో సోమవారం మధ్యాహ్నం మూడు దాటిన తరువాత మృత దేహాలకు పోస్టుమార్టం ప్రక్రియ ప్రారంభించారు.
పోలీసుల అదుపులో ఏటూరునాగారం
మావోయిస్టుల మృత దేహాలకు పోస్టు మార్టం నేపథ్యంలో పోలీసులు ఏటూరు నాగారంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు జిల్లా పోలీసు అధికారులు ఏటూరు నాగారంలోని ఆకులవారిఘనపురం ఏరియా నుంచి కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆ చుట్టుపక్కల ప్రాంతమంతా ఖాకీలతో నిండిపోవడంతో స్థానికుల్లో భయాందోళన వ్యక్తమైంది. కాగా మృత దేహాలకు పోస్టు మార్టం నేపథ్యంలో ఏగోలపు మల్లయ్య అలియాస్ మధు కుటుంబ సభ్యులు, భద్రు తల్లి మాత్రమే ఏటూరు నాగారం ఆసుపత్రికి వచ్చారు.
బూటకపు ఎన్ కౌంటర్: ఏగోలపు మల్లయ్య కుటుంబ సభ్యులు
ములుగు జిల్లా చల్పాక అడవుల్లో జరిగింది బూటకపు ఎన్ కౌంటర్ అని మావోయిస్టు నేత ఏగోలపు మల్లయ్య అలియాస్ మధు అలియాస్ కోటి భార్య మీనా, ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. మావోయిస్టులు తినే అన్నంలో మత్తు మద్దు పెట్టారని, అనంతరం వారిని చిత్ర హింసలకు గురి చేసి చంపేశారన్నారు. మృత దేహాలను దగ్గరుంచి చూశానని, ఒక్కొక్కరి ఒంటిపై తీవ్రమైన గాయాలున్నాయన్నారు. అనంతరం దానిని ఎన్ కౌంటర్ గా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు.
చిత్ర హింసలు పెట్టి చంపారు: అమరుల బంధుమిత్రుల సంఘం సభ్యురాలు
కాంగ్రెస్ ప్రభుత్వం బూటకపు ఎన్ కౌంటర్లను ప్రోత్సహిస్తోందని అమరుల బంధు మిత్రుల సంఘం సభ్యురాలు బొప్పాడి అంజమ్మ ఆరోపించారు. చల్పాకది ముమ్మాటికీ బూటకపు ఎన్ కౌంటరేనన్నారు. మత్తు మందు ఇచ్చి వారిని చిత్ర హింసలకు గురి చేసి చంపేశారన్నారు. అమిత్ షా తో కలసి సీఎం రేవంత్ రెడ్డి బూటకపు ఎన్ కౌంటర్లు చేయిస్తున్నారని విమర్శించారు. ఆదివాసీలను స్వేచ్ఛగా బతకనివ్వాలని, అటవీ ప్రాంతంలో సైనిక క్యాంపులను ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. బూటకపు ఎన్ కౌంటర్లను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)