Washing powder posters in Hyd : అమిత్ షా హైదరాబాద్ టూర్.. 'వాషింగ్ పౌడర్ నిర్మా' ఫ్లెక్సీల కలకలం
12 March 2023, 11:53 IST
- Union Minister Amit Shah Hyd Tour: కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన వేళ పోస్టర్లు దర్శనమిచ్చాయి. వాషింగ్ పౌడర్ నిర్మా అనే పేరుతో వీటిని ఏర్పాటు చేశారు.
అమిత్ షాకు వ్యతిరేకంగా పోస్టర్లు
Flexies Against union Minister Amit Shah: తెలంగాణలో రాజకీయ వేడి జోరందుకుంది. ఎమ్మెల్సీ కవిత విచారణ నేపథ్యంలో... బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. శనివారం కవిత విచారణ సందర్భంగా... హైదరాబాద్ లో బైబై మోదీ పోస్టర్లు దర్శనమివ్వగా... తాజాగా కేంద్రమంత్రి అమిత్ షా నగరానికి వచ్చారు. ఈ నేపథ్యంలో... మరోసారి వాషింగ్ పౌడర్ నిర్మా అంటూ పోస్టర్లు, ఫ్లెక్సీలు కనిపించాయి. అయితే వీటిని గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
ఈ ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, నారాయణ్ రానే, బెంగాల్ నేత సువెందు అధికారి, ఏపీకి చెందిన సుజనా చౌదరి, ఈశ్వరప్ప, జ్యోతిరాదిత్య సింద్య, అర్జున్ కోట్ కర్ సహా పలువురు నేతల ఫోటోలను వాషింగ్ పౌడర్ నిర్మా ఫోటో స్థానంలో కేవలం తలను ఉంచేలా ఎడిట్ చేశారు. Welcome Amith Sha అని ఫ్లెక్సీ కింద రాశారు.
శనివారం కూడా నగరంలో ఇదే తరహాలో మోదీ వ్యతిరేక పోస్టర్లు ఏర్పాటు చేశారు. బైబై మోదీ అంటూ పలువురి నేతల ఫొటోలను కూడా ప్రచురించారు. బీజేపీలో చేరకముందు.. చేరిన తర్వాత అంటూ సెటైరికల్ గా పోస్టర్లు రూపొందించారు. ఇందులో అస్సోం, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్ లోని నేతల ఫొటోలు ఉంచారు. వాషింగ్ పౌడర్ నిర్మా అంటూ వచ్చే యాడ్ మాదిరిగా... 'రైడ్' అనే పేరును ప్రస్తావించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు దర్యాప్తు సంస్థల రైడ్స్ అనంతరం.. కాషాయ రంగు అద్దుకుని బీజేపీలో చేరానని సెటైరికల్‌గా సెట్ చేశారు.
కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింధియా, అస్సొం సీఎం హిమంత బిశ్వశర్మ, ఏపీకి చెందిన సుజనా చౌదరి, బెంగాల్ కు చెందిన నేత సువేంధు అధికారి ఫొటోలు ఇందులో ఉన్నాయి. ఎమ్మెల్సీ కవితకు మాత్రం రైడ్‌కు ముందు తర్వాత ఎలాంటి మరక అంటకుండా ఉన్నారంటూ అర్థం వచ్చేలా ఫ్లెక్సీలు, పోస్టర్లు, హోర్డింగ్ లు రూపొందించారు. ఈ పోస్టర్లకు బై బై మోదీ.. అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టారు. ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే వీటిని ఎవరూ ఏర్పాటు చేశారనేది మాత్రం ఇందులో పేర్కొనలేదు. వీటిని బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలే ఏర్పాటు చేశారంటూ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.