Munugodu : రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు….
13 August 2022, 17:44 IST
- మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరేందుకు రాజగోపాల్ రెడ్డి సిద్ధమవడంతో ఆయనకు వ్యతిరేకంగా ఆయనకు వ్యతిరేకంగా ప్రత్యర్ధులు పోస్టర్ల పోరాటం ప్రారంభించారు.
కోమటిరెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు
మునుగోడు నియోజవకర్గంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి ఉపఎన్నికకు సిద్ధమంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా నియోజక వర్గంలో పోస్టర్లు వెలిశాయి. ‘మునుగోడు నిన్ను క్షమించదు, రూ. 22 వేల కోట్ల కాంట్రాక్ట్ కోసం, 13 ఏండ్ల నమ్మకాన్ని అమ్ముకున్న ద్రోహివి అంటూ పోస్టర్లలో పేర్కొన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వేధిస్తున్న రోజే అమిత్ షాతో బేరమాడిన నీచుడివి’ అని పోస్టర్లలో పేర్కొన్నారు. ఈ పోస్టర్లు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వెలిశాయి.
మునుగోడు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవి రాజీనామా చేశారు. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో విభేదాల నేపథ్యంలో రాజగోపాల్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామాను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించారు. ఈ నేపథ్యంలో మునుగోడుకు ఉప ఎన్నిక అనివార్యం కానుంది. అన్ని పార్టీలు మునుగోడు ఉపఎన్నికపై దృష్టి కేంద్రీ కరించాయి. కోమటిరెడ్డి ఈ నెల 21న అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు.
మరోవైపు తెలంగాణలో అధికార టిఆర్‌ఎస్‌తో పాటు బీజేపీ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అటు కాంగ్రెస్ పార్టీ మాత్రం గ్రూపు తగాదాలతో సతమతమవుతోంది. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అస్వస్థతకు గురవడంతో ఆ ప్రభావం ఎన్నికపై పడుతుందని భావిస్తున్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌లు ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని ప్రయత్నాలు చేయనున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఏ పార్టీ గుర్తులు లేకుండా కోమటిరెడ్డికి వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్ల వెనుక ఎవరున్నారనేది చర్చగా మారింది. కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు ప్రత్యర్థులు వేశారా, కాంగ్రెస్ పార్టీ నేతలే కోమటిరెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు వేశారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.