తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Karimnagar Politics: మహాశక్తి ఆలయంలో అమ్మవారి సన్నిధిలో కలిసిన రాజకీయ ప్రత్యర్థులు..

Karimnagar Politics: మహాశక్తి ఆలయంలో అమ్మవారి సన్నిధిలో కలిసిన రాజకీయ ప్రత్యర్థులు..

HT Telugu Desk HT Telugu

08 October 2024, 8:25 IST

google News
    • Karimnagar Politics: కరీంనగర్ లోని మహాశక్తి ఆలయంలో అద్భుతం చోటు చేసుకుంది. ముగ్గురు అమ్మలు కొలువైన మహాశక్తి ఆలయంలో మూడు ప్రధాన పార్టీల ప్రజాప్రతినిధులు రాజకీయ ప్రత్యర్థులు కలిశారు. అమ్మవారు సమక్షంలో కరచాలం చేసుకుని ముచ్చటించారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు... శాశ్వత శత్రువులు ఉండరని నిరూపించారు.
కరీంనగర్‌ మహాశక్తి ఆలయంలో గంగుల కమలాకర్, బండి సంజయ్ కుమార్
కరీంనగర్‌ మహాశక్తి ఆలయంలో గంగుల కమలాకర్, బండి సంజయ్ కుమార్

కరీంనగర్‌ మహాశక్తి ఆలయంలో గంగుల కమలాకర్, బండి సంజయ్ కుమార్

Karimnagar Politics: ముగ్గురు అమ్మలు కొలువైన కరీంనగర్ లోని మహాశక్తి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. సాయంత్రం పూట పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. రాత్రి పొద్దు పోయే వరకు జరిగే దాండియాలో పాల్గొనేందుకు చిన్న పెద్ద స్త్రీ పురుష వయోభేదం లేకుండా భారీగా భక్తులు తరలివచ్చి ఆడి పాడుతున్నారు.

భక్తుల రద్దీతో పాటు ప్రధాన రాజకీయ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధుల తాకిడి మహాశక్తి ఆలయానికి పెరిగింది. సోమవారం రాత్రి బిఆర్ఎస్ కు చెందిన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కాంగ్రెస్ కు చెందిన మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి పురమల్ల శ్రీనివాస్ అమ్మవార్ల దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం భవాని దీక్ష తీసుకుని ఆలయ ప్రాంగణంలో ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. కేంద్ర మంత్రితో కరచాలనం చేసి కులాసాగా ముచ్చటించారు. కేంద్రమంత్రి తో కలిసి అమ్మవారి సన్నిధిలో దాండియా కార్యక్రమాలను ఎమ్మెల్యేలు వీక్షించారు. ఉప్పు నిప్పులా ఉండే రాజకీయ ప్రత్యర్థులు అమ్మవారి సన్నిధిలో కలిసి ముచ్చటించడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి బండి సంజయ్ బిజేపి నుంచి, గంగుల కమలాకర్ బిఆర్ఎస్ నుంచి పురమల్ల శ్రీనివాస్ కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. రాజకీయ ప్రత్యర్థులు అమ్మవారి సన్నిధిలో కలువడం అరుదైన సన్నివేశం అంటూ సెల్ ఫోన్ లలో చిత్రీకరించారు. రాష్ట్రంలో దేశంలో అధికార విపక్షాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విమర్శలు ఆరోపణలు కొనసాగుతున్న నేపథ్యంలో మూడు ప్రధాన పార్టీల ఎంపీ, ఎమ్మెల్యేలు కలిసి ముచ్చటించడం ఆలయానికి వచ్చిన భక్తులు ఆసక్తిగా చూస్తూ చర్చించుకోవడం జరిగింది.

జనసంద్రమైన ఆలయ ప్రాంగణం

ఓవైపు ఎడతెరపి లేకుండా వస్తున్న భక్తులు, మరోవైపు రాజకీయ నాయకుల సందర్శనతో మహాశక్తి ఆలయం ప్రాంగణం జన సంద్రంగా మారింది. వేలాది మంది రాకతో ఆలయ పరిసరాలు జాతరను తలపిస్తుంది. వేలాదిమంది భవాని దీక్ష స్వాములు తరలి వస్తుండడంతో కాషాయ వర్ణ శోభితంగా ఆలయ ప్రాంగణం మారింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పూజలు సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు దాండియా చూపరులను కనువిందు చేస్తుంది.

ప్రత్యేకంగా పండ్లతో అమ్మవారి అలంకరణ

దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు అమ్మవారు మహా చండీ దేవిగా (స్కందమాత ) దర్శనమిచ్చారు. అమ్మవారిని ప్రత్యేకంగా పండ్లతో అలంకరించారు. దేవి దర్శనం కోసం కరీంనగర్ పార్లమెంటు పరిధితో పాటు ఇతర జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తుల తాకిడితో ఆలయం పరిసర ప్రాంతాలు రద్దీగా మారాయి.

అమ్మవార్ల ఆలయం భవానీ మాల వేసుకున్న భక్తులతో సందడిగా మారింది. అమ్మవారి నినాదాలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. మరోవైపు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ భవానీ భక్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రజల సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను స్వీకరించి పరిష్కార మార్గం చూపారు.

(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

తదుపరి వ్యాసం