తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Sangareddy Police: సంగారెడ్డిలో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కేంద్రంపై పోలీసుల దాడులు, వ్యాపారి అరెస్ట్

Sangareddy Police: సంగారెడ్డిలో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కేంద్రంపై పోలీసుల దాడులు, వ్యాపారి అరెస్ట్

HT Telugu Desk HT Telugu

16 July 2024, 7:36 IST

google News
    • Sangareddy Police: సంగారెడ్డి జిల్లాలో నాసిరకం అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రంపై పోలీసులు దాడులు నిర్వహించారు. నకిలీ పేస్ట్ తయారు చేస్తున్న వ్యాపారిని అరెస్ట్ చేసి,పరిశ్రమను సీజ్ చేశారు.
సంగారెడ్డిలో నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న వ్యాపారి అరెస్ట్
సంగారెడ్డిలో నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న వ్యాపారి అరెస్ట్

సంగారెడ్డిలో నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న వ్యాపారి అరెస్ట్

Sangareddy Police: సంగారెడ్డి జిల్లాలో నాసిరకం అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రంపై పోలీసులు దాడులు నిర్వహించారు. నకిలీ పేస్ట్ తయారు చేస్తున్న వ్యాపారిని అరెస్ట్ చేసి,పరిశ్రమను సీజ్ చేశారు.

సంగారెడ్డి : సమాజంలో నకిలీ ఉత్పత్తులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కల్తీ ఆహార పదార్ధాలను విక్రయిస్తున్న వారిపై పోలీసులు,ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయినా ఏదో ఒకచోట రహస్యంగా నకిలీ ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఏది నకిలీ,ఏది స్వచ్ఛమైనదో తెలుసుకోవడం కష్టంగా మారింది.

మార్కెట్ లో ఏది కొనాలన్నా వినియోగదారులు భయపడుతున్నారు. మనం నిత్యం వంటలలో ఉపయోగించే అల్లం వెల్లులి పేస్ట్ ను కూడా కల్తీ చేస్తున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో గోప్యంగా తయారు చేస్తున్న నకిలీ అల్లం వెల్లులి పేస్ట్ కేంద్రంపై పోలీసులు దాడులు నిర్వహించారు. నాసిరకం అల్లం వెల్లులి పేస్ట్ తయారు చేస్తూ జిల్లా వ్యాప్తంగా సప్లై చేస్తున్నవ్యాపారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. అతని వద్ద నుండి సుమారు 600 కేజీల అల్లం వెల్లుల్లి పేస్ట్ ను స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి రూరల్ సీఐ అశోక్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం

అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలనే దురాశతో సంగారెడ్డి జిల్లా కంది మండలం జుక్కల్ గ్రామానికి చెందిన మహ్మద్ వసీం అనే వ్యక్తి ఆరు నెలలుగా తహ ఫుడ్స్ పేరుతో నాసిరకం అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు జూన్ 4 న ఎస్ఐ విజయ్ కుమార్ గౌడ్,ఫుడ్ ఇన్స్పెక్టర్ ధర్మేందర్ తో కలిసి ఆ తయారీ కేందంలో తనిఖీలు నిర్వహించారు. దీంతో అల్లం వెల్లుల్లి తయారీకి వినియోగిస్తున్న పదార్ధాల శాంపిల్స్ ను సేకరించి హైదరాబాద్ ల్యాబ్ కు పంపించారు. కాగా పరీక్షలలో అది నాసిరకం పేస్ట్ అని రిపోర్ట్ వచ్చింది.

తక్కువ ధర కలిగిన ముడి పదార్థాలను .…

TAHA FOODS పేరుతో తక్కువ ధర కలిగిన ఇతర ముడి పదార్థాలను వినియోగించి నాసిరకం అల్లం వెల్లుల్లి పేస్ట్ ను తయారు చేసి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నాడు. కాగా పరిశ్రమలో ఎలాంటి పరిశుభ్రత పాటించకుండా అక్రమంగా నాసిరకం అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తూ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు తరలిస్తూ తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదిస్తున్నాడు.

ఈ అల్లం వెల్లులి పేస్ట్ ప్రజల ఆరోగ్యానికి హానికరమని పై వ్యక్తిపై చట్టరిత్య కఠిన చర్య తీసుకోవాలని ఫుడ్ ఇన్స్పెక్టర్ ధర్మేందర్ తెలిపారు. దీంతో పోలీసులు మహ్మద్ వసీంను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు సీఐ పేర్కొన్నారు. అతని వద్ద నుండి తహ ఫుడ్స్ పేరుతో డబ్బాల్లో నింపిన 6 క్వింటాళ్ల అల్లం వెల్లుల్లి పేస్టును స్వాధీనం చేసుకొని, కంపెనీని సీజ్ చేశామని తెలిపారు. కల్తీ ఆహార పదార్ధాలను తయారు చేసినా,విక్రయించిన తమకు సమాచారం అందజేయాలని ప్రజలను కోరారు .

తదుపరి వ్యాసం