తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Khammam Murders: అదో దండుపాళ్యం తరహా ముఠా.. ఖమ్మంలో వృద్ధ దంపతుల హత్య మిస్టరీని చేధించిన పోలీసులు

Khammam Murders: అదో దండుపాళ్యం తరహా ముఠా.. ఖమ్మంలో వృద్ధ దంపతుల హత్య మిస్టరీని చేధించిన పోలీసులు

HT Telugu Desk HT Telugu

12 December 2024, 13:12 IST

google News
    • Khammam Murders: తొలుత ఫోన్‌ నంబర్‌ సేకరిస్తారు.. ఆపై ఇంట్లో అద్దెకు దిగుతామంటూ మాటలు కలుపుతారు.. వృద్ధుల ఇళ్ల పరిసరాలను ఒకట్రెండుసార్లు పరిశీలిస్తారు.. అనువైన సమయంలో వృద్ధులను మట్టుబెట్టి బంగారం, సొమ్ము కాజేస్తారు. సరిగ్గా ఇదే మాదిరిగా నవంబర్‌ 27న నేలకొండపల్లిలో హత్యలు జరిగాయి.  
ఖమ్మం జిల్లాలో వీడిన వృద్ధ దంపతుల హత్య కేసు మిస్టరీ
ఖమ్మం జిల్లాలో వీడిన వృద్ధ దంపతుల హత్య కేసు మిస్టరీ

ఖమ్మం జిల్లాలో వీడిన వృద్ధ దంపతుల హత్య కేసు మిస్టరీ

Khammam Murders: ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో జరిగిన వృద్ధ జంట హత్య మిస్టరీని పోలీసులు చేధించారు. ఓ నిందితుడి ఫోన్‌కాల్‌ ఆధారంగా పక్షం రోజుల వ్యవధిలోనే పోలీసులు ఈకేసులో పురోగతి సాధించారు. వృద్ధ దంపతులను బంగారం, డబ్బు కోసమే హత్య చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. జగ్గయ్యపేటకు చెందిన నేర ప్రవృత్తి కలిగిన ఓ నిందితుడితో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

నమ్మించి.. చంపేసి...

కొత్త కొత్తూరులో 15 రోజుల కిందట వృద్ధ దంపతులు యర్ర వెంకటరమణ, కృష్ణకుమారి తమ సొంతింట్లో దారుణహత్యకు గురయ్యారు. హత్యకు సంబంధించి ఆనవాళ్లు లభించకుండా నిందితులు పక్కా పథకం ప్రకారం వ్యవహరించటంతో పోలీసులకు ఈ కేసు సవాల్‌గా మారింది.

మూడు నెలల క్రితం వృద్ధ దంపతులు అనారోగ్యం బారిన పడి ఖమ్మంలోని ఓ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆ సమయంలో వారిని దొంగల ముఠా సభ్యులు పరిచయం చేసుకున్నారు. ఫోన్‌ నంబర్‌ తీసుకున్నారు. కొత్త కొత్తూరులోని ఆ దంపతుల భవన సముదాయంలో అద్దెకు ఇళ్లు ఉన్నాయని తెలుసుకుని ఇద్దరు మహిళలు తరచూ అక్కడికి వెళ్లేవారు.

మహిళలకు దంపతులు పలుమార్లు తమ ఇంట్లోనే భోజనం పెట్టడంతో వీరంతా కలిసిపోయారు. అతి త్వరలోనే ఇంట్లో అద్దెకు దిగుతామని వృద్ధులను నమ్మించారు. ఇందులో భాగంగానే నవంబర్‌ 27న రాత్రి నలుగురు వచ్చి దంపతులను మట్టుబెట్టారు.

సవాల్‌గా మారిన కేసు దర్యాప్తు..

ఈ కేసును ఛేదించేందుకు సీపీ సునీల్‌దత్‌ ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. కాల్‌ డేటా, సీసీ కెమెరాల పరిశీలనకు ప్రత్యేక బృందాలను నియమించారు. సుమారు పది రోజుల పాటు ఎలాంటి ఆధారాలు లభించలేదు. నలుగురిలో ఓ నిందితుడు చివరగా వెంకట రమణకు ఫోన్‌ చేసిన నంబర్‌ ఆధారంగా కేసు దర్యాప్తును పోలీసులు ప్రారంభించారు.

నిందితుడు తన ఫోన్‌తో పాటు మిగిలిన ముగ్గురి ఫోన్లను ఒక్కొక్కటి ఒక్కోచోట పడేయటంతో కాల్‌ డేటా, జీపీఆర్‌ఎస్‌తో మరికొన్ని ఆధారాలు సేకరించారు. మూడు ఫోన్లలో ఓ ఫోన్‌ నంబర్‌ జగ్గయ్యపేట వాసి పేరిట నమోదవటంతో పూర్తి వివరాలు రాబట్టారు. పోలీసు శాఖలో అతడిపై కేసుల వివరాలు సేకరించారు. సదరు వ్యక్తిపై 2012లో హత్య కేసు నమోదైందని తెలుసుకోవటంతో తమదైన శైలిలో దర్యాప్తు సాగించారు. ఈ కేసులో మొత్తం నలుగురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. నిందితులను గురువారం మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశముంది.

(రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి)

తదుపరి వ్యాసం