Karimnagar Tapping: కరీంనగర్‌లో ఫోన్ ట్యాపింగ్ కలకలం, ట్యాపింగ్ వల్లే కోరుట్లలో ఓడిపోయానంటున్న నర్సింగరావు
28 May 2024, 10:55 IST
- Karimnagar Tapping: ఫోన్ ట్యాపింగ్ మరోసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కలకలం సృష్టిస్తుంది. కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తు గత ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు.
ఫోన్ ట్యాపింగ్ వల్ల ఓడిపోయానంటున్న జువ్వాడి నర్సింగరావు
Karimnagar Tapping: ఇంటలిజెన్స్ మాజీ ఐజీ రాధాకిషన్ రావు వాగ్మూలంతో మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు కుమారుడు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి నర్సింగరావు బిఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిపై ఫైర్ అయ్యారు.
కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి పురుమల్ల శ్రీనివాస్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తో కలిసి నర్సింగరావు మీడియాతో మాట్లాడుతు బిఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కెసిఆర్ కుటుంబానికి ఒకనాడు కారులో డీజిల్ పోసుకునే పరిస్థితి లేదని అలాంటి వ్యక్తులు నేడు లక్షల కోట్లకు అధిపతులు అయ్యారని తెలిపారు.
కేసీఆర్ నిజస్వరూపం అనువణువు తెలిసిన వాళ్ళం కాబట్టి ఎక్కడ వాస్తవాలు బయట పెడుతామోననే భయంతో కేసీఆర్ కుటుంబం నా ఫోన్ ట్యాపింగ్ చేయించారని ఆరోపించారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో మేము మా పార్టీ కార్యకర్తలకు ఇచ్చిన సమాచారాన్ని తెలుసుకొని ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాధాకిషన్ రావు ఇచ్చిన వాంగ్మూలంలో నర్సింగరావు పేరు బయటకు వచ్చిందని, ఉమ్మడి ఆంధ్ర ప్రదేష్ లో మచ్చలేని నాయకుడిగా జువ్వాడి రత్నాకర్ రావు నాలుగు దశాబ్దాలు రాజకీయనేతగా ప్రజలకు సేవలు అందించారన్నారు.
ఫోన్ ట్యాఫింగ్ తోనే రాజకీయంగా తన ఎదుగుదలకు అసెంబ్లీ ఎన్నికల్లో గెలువకుండా చేశారని ఆరోపించారు. ఒక్కొక్కటిగా ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయని ఒకనాడు 20ఎకరాల ఆసామి అయిన కేసిఆర్ నేడు 100ల ఎకరాల ఫామ్ హౌస్ కు ఏలా ఎదిగాడో ఇప్పుడు అర్థమవుతుందని విమర్శించారు.
కోరుట్ల ఎమ్మెల్యే రాజీనామా చేయాలి
ఫోన్ ట్యాఫింగ్ తో తన వ్యూహాలను పసిగట్టి ఎక్కడికక్కడ అడ్డుకట్టలు వేసి కోరుట్లలో అసెంబ్లీ ఎన్నికల్లో అడ్డుకున్నారని నర్సింగరావు ఆరోపించారు. ఫోన్ ట్యాఫింగ్ సహకారంతో అక్రమపద్దతిలో దొడ్డిదారిన తనపై కోరుట్లలో గెలిచిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ కుటుంబానికి డాక్టర్ సంజయ్ అత్యంత సన్నిహితుడని తెలిపారు. ఆయన కోసం హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ నా ఫోన్ ట్యాపింగ్ కు బాధ్యులని ఆరోపించారు. నా ఓటమికి కారణం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులేనని ఆరోపించారు. వారిపై రాష్ట్ర ప్రభుత్వానికి డి ఐ జి కి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఎన్నికల సమయంలో విపరీతంగా డబ్బులు పంచి ఓటర్లను ప్రభావితం చేశారని, కెసిఆర్ కుటుంబాన్ని తెలంగాణ నుండి బహిష్కరించాలని డిమాండ్ చేశారు.
తన ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్లే తాను ఓడిపోయానని, ప్రజలు నన్ను ఆదరించారని నైతికంగా విజయం నాదేనని తెలిపారు. ప్రజలు తిరగబడతారనే కేసీఆర్ ఫామ్ హౌస్ లో దాక్కున్నాడని విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో గతంలో ప్రభుత్వాలు కూలిపోయిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు.
బినామీలు భూములు బదిలీ చేయవద్దు
అధికారంలో ఉండి ఫోన్ ట్యాపింగ్ అడ్డు పెట్టుకుని బ్లాక్మెయిల్ చేసి అక్రమ మార్గంలో భూములు సంపాధించారని ఆ భూములన్ని బినామీల పేరుతో ఉన్నాయని జువ్వాడి నర్సింగరావు ఆరోపించారు.
కేసిఆర్ కేటీఆర్ హరీష్ రావు బినామీలు తమపై ఉన్న భూములను బదిలీ చేయవద్దని కోరారు. మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద నమ్మకం లేని విధంగా ఫోన్ ట్యాపింగ్ చేయడం సిగ్గు చేటన్నారు. మీడియా ప్రతినిధుల యాజమాన్యం ఫోన్ లను కూడా టాపింగ్ చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
సీబీఐ విచారణ జరుగుతున్న భూములను సైతం కబ్జా చేశారని, సినీ దంపతుల ఫోన్‌లను ట్యాపింగ్ చేసి వారి కాపురాలు కూల్చివేశారని తెలిపారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తామని, ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన వారిపై ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుందనే సంపూర్ణ విశ్వాసం తమకు ఉందన్నారు.
(రిపోర్టింగ్ కేవీరెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా)