TS Prajavani: Prajavani: ప్రజావాణికి పోటెత్తిన ప్రజలు, పంజాగుట్ట వరకు క్యూలైన్లు
15 December 2023, 12:02 IST
- TS Prajavani: తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోన్న ప్రజావాణి కార్యక్రమంలో వినతులు సమర్పించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి జనం పోటెత్తారు.
ప్రజావాణికి పోటెత్తిన జనం
TS Prajavani: ప్రజావాణికి భారీగా జనం తరలి వచ్చారు. ప్రతి మంగళ, శుక్రవారం ప్రజావాణి నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించడంతో, తమ సమస్యలను చెప్పుకునేందుకు జనం బేగంపేటకు తరలి వచ్చారు. ప్రజా వాణిలో ప్రజల నుంచి వినతుల్ని మంత్రులు స్వీకరించినున్నారు. ఫిర్యాదులు స్వీకరించి, సమస్య తీవ్రత బట్టి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల్లో ఎక్కువగా భూ సమస్యలు, పెన్షన్ల సమస్యలపై వినతులు సమర్పిస్తున్నారు.
శుక్రవారం ప్రజావాణిలో వినతులు సమర్పించేందుకు ప్రజలు బారులు తీరారు. శుక్రవారం ఉదయం నుంచి అన్ని జిల్లాల నుంచి ప్రజలు హైదరాబాద్ తరలి వచ్చారు. దీంతో బేగం పేట నుంచి పంజాగుట్ట సిగ్నల్ వరకు క్యూలైన్ ఏర్పడింది. ఉదయం ఆరు గంటలకే పెద్ద సంఖ్యలో ప్రజలు క్యూలైన్లలో నిలబడ్డారు. వారంలో రెండు రోజులు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని సిఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
సిఎం రేవంత్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రజాదర్భార్ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. ఆ తర్వాత ప్రజావాణిగా మార్చారు. ప్రజావాణిలో వినతులు సమర్పించేందుకు వచ్చిన ప్రజలతో బేగంపేట రద్దీగా మారింది. మరోవైపు సిఎం క్యాంపు కార్యాలయాన్ని డిప్యూటీ సిఎం అధికారిక నివాసంగా మార్చిన నేపథ్యంలో ప్రజావాణిలో ఆయన ప్రజల ఫిర్యాదులు స్వీకరించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బేగంపేట నుంచి భట్టి విక్రమార్క
డిప్యూటీ సిఎం కొంత సేపు ప్రజల నుంచి వినతులు స్వీకరించిన తర్వాత అధికారులు కార్యక్రమాన్ని కొనసాగించనున్నారు. ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులను శాఖల వారీగా వాటిని పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సిఎం స్థాయిలో తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే ఉద్దేశంతో రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు తరలి వస్తున్నారు.
వేలల్లో ప్రజలు ప్రజాభవన్‌కు తరలివస్తున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి రావడంతో బేగంపేట ప్రాంతాలు కిక్కిరిసి పోయాయి. ప్రజలకు ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. గతంలో ఉన్న ఇనుప కంచెలను తొలగించారు. క్యూలైన్లలో ప్రజలు క్యాంపు కార్యాలయానికి చేరుకుంటున్నారు. ఉదయం పది గంటల్లోపు వచ్చిన వారి నుంచి వినతులు స్వీకరిస్తామని అధికారులు ప్రకటించారు.