Peddapally MP: కాంగ్రెస్ పార్టీలో చేరిన పెద్దపల్లి బిఆర్‌ఎస్ ఎంపీ వెంకటేష్ నేత
06 February 2024, 11:20 IST
- Peddapally MP: పార్లమెంటు ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కేసీ వేణుగోపాల్ సమక్షంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత
Peddapally MP: సార్వత్రిక ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలోకి బిఆర్‌ఎస్ నేతల్ని ఆకర్షించడంలో సిఎం రేవంత్ రెడ్డి విజయం సాధిస్తున్నారు.
పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. పార్లమెంటు ఎన్నికల వేళ బిఆర్‌ఎస్‌కు మింగుడుపడకపోవచ్చు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత పార్టీని బలోపేతం చేయడంపై రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ నుంచి గణనీయమైన స్థాయిలో ఎంపీ సీట్లను గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో తెలంగాణ రాజకీయాల్లో వేగంగా మార్పులు జరుగుతున్నాయి. ప్రతిపక్ష పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి ముఖ్యమైన నాయకుల్ని చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో గతంలో కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉన్నవారిని తిరిగి పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నాలు జరుగతున్నాయి.
ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం పెద్దపల్లి బిఆర్‌ఎస్ ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. 2019లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజక వర్గం నుంచి గెలుపొందారు.
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ప్రస్తుత బీఆర్‌ఎస్ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత కొన్నాళ్లుగా బిఆర్‌ఎస్‌కు దూరంగా ఉంటున్నారు. మంగళవారం ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కేసీ వేణుగోపాల్ ఇంటికి ఎంపీ వెంకటేష్ వెళ్లారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్.. వెంకటేష్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ కండువా కప్పి స్వాగతం పలికారు.
2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి స్థానం నుంచి బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. తాజాగా బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పి మళ్లీ హస్తం గూటికి చేరారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పెద్దపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్టు సమాచారం.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల వేళ సిట్టింగ్ ఎంపీ పార్టీ మారడం బీఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బ అని పలువురు అభిప్రాయపడుతున్నారు. సిఎం రేవంత్ రెడ్డి రెండు నెలల్లోనే సంక్షేమ పథకాలతో పెనుమార్పు తెచ్చారని అన్నారు.
రాబోయే ఐదేళ్లలో బంగారు తెలంగాణ నెరవేరుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. రాజకీయంలో సిద్ధాంతపరమైన విమర్శలు చేయాల్సి ఉంటుందని, ప్రొఫెషనల్ లిబర్టీ ఎవరికైనా ఉంటుందని పార్టీలు మారడం తప్పేమి కాదన్నారు.