Peddapalli News : పెద్దపల్లి జిల్లాలో దారుణం, భూవివాదంతో నెలల చిన్నారిని బావిలో పడేసిన తండ్రి
27 August 2023, 14:19 IST
- Peddapalli News : పెద్దపల్లి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. భూవివాదం కారణంగా 17 నెలల కొడుకుని బావిలో పడేసి, తండ్రి ఆత్మహత్యకు యత్నించాడు.
చిన్నారిని బావిలో పడేసిన తండ్రి
Peddapalli News : పెద్దపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 17 నెలల చిన్నారిని బావిలో పడేశాడో తండ్రి. అనంతరం అతడు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ తగాదాలు ఈ దారుణానికి కారణంగా తెలుస్తోంది.
అసలేం జరిగింది?
పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం రాములపల్లి కల్వల తిరుపతిరెడ్డి-మానస భార్యాభర్తలు. వీరికి 17 నెలల కుమారుడు దేవాన్ష్ ఉన్నాడు. తిరుపతిరెడ్డి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తిరుపతిరెడ్డికి, అతడి సోదరుడు రత్నాకర్ రెడ్డికి మధ్య భూవివాదం ఉంది. ఈ భూవివాదంలో తిరుపతిరెడ్డిని చంపేస్తామని సోదరుడు రత్నాకర్ రెడ్డి బంధువులు బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ బెదిరింపుల కారణంగా తిరుపతిరెడ్డి తన కుటుంబంతో సుల్తానాబాద్‌లోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. శుక్రవారం వరలక్ష్మీ పూజ కోసం భార్య, కొడుకుతో స్వగ్రామం రాములపల్లికి వెళ్లాడు. అక్కడ పూజ అయిపోయాక తిరిగి సుల్తానాబాద్ వచ్చేశాడు. శనివారం మరోసారి కొడుకు దేవాన్ష్‌ను తీసుకుని రాములపల్లికి బయలుదేరాడు తిరుపతిరెడ్డి. గ్రామంలో ఏం జరిగిందో కానీ తిరుపతి రెడ్డి, తన కొడుకు దేవాన్ష్‌ను బావిలో పడేశాడు. ఆ తర్వాత పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. రాములపల్లికి వెళ్లిన భర్త, కొడుకు తిరిగి రాకపోయేసరికి తిరుపతిరెడ్డి భార్య... మామ సంజీవరెడ్డికి ఫోన్ చేసింది. అయితే తిరుపతిరెడ్డి ఇంటికి రాలేదని సంజీవ రెడ్డి ఆమెకు తెలిపాడు.
సోదరుల మధ్య భూవివాదం
భర్త, కొడుకు రాములపల్లికి వచ్చాయని కోడలు చెప్పడంతో... మామ సంజీవరెడ్డికి అనుమానం వచ్చి పొలానికి వెళ్లి చూడగా...బావి వద్ద తిరుపతిరెడ్డి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. ఆందోళన చెందిన సంజీవరెడ్డి చిన్నారి కోసం వెతకగా బావిలో చెప్పులు తేలియాడుతూ కనిపించాయి. దీంతో గ్రామస్తులు, పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు అక్కడికి చేరుకుని తిరుపతిరెడ్డిని సుల్తానాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం అతడిని కరీంనగర్‌కు తరలించారు. తిరుపతి రెడ్డి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బావిలో గాలించిన పోలీసులకు చిన్నారి దేవాన్ష్ మృతదేహం దొరికింది. తిరుపతిరెడ్డి భార్య మానస ఫిర్యాదుతో రత్నాకర్ రెడ్డి, అతని మామ సత్తిరెడ్డి, బావ లక్ష్మణ్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. భూవివాదంలో చిన్నారి మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.