తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kcr Coverts In Bjp : బీజేపీలో కేసీఆర్ కోవర్టులు, త్వరలో వారి పేర్లను వెల్లడిస్తా - నందీశ్వర్ గౌడ్

KCR Coverts In BJP : బీజేపీలో కేసీఆర్ కోవర్టులు, త్వరలో వారి పేర్లను వెల్లడిస్తా - నందీశ్వర్ గౌడ్

06 June 2023, 14:53 IST

google News
    • KCR Coverts In BJP : బీజేపీలో కోవర్టుల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ బీజేపీలో కేసీఆర్ కోవర్టులున్నారని సంచలన ఆరోపణలు చేశారు. మరో 15 రోజుల్లో సంచలన ప్రకటన చేస్తానన్నారు.
బీజేపీ నేత నందీశ్వర్ గౌడ్
బీజేపీ నేత నందీశ్వర్ గౌడ్ (twitter )

బీజేపీ నేత నందీశ్వర్ గౌడ్

KCR Coverts In BJP : బీజేపీలో కేసీఆర్ కోవర్టులున్నారని బీజేపీ నేత, పటాన్ చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. ఆ కోవర్టుల పేర్లను బీజేపీ పెద్దలకు తెలియజేశానన్నారు. కోవర్టులెవరో త్వరలో వెల్లడిస్తానన్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కాంగ్రెస్ లో చేరనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. 15 రోజుల్లో కీలక నిర్ణయం ప్రకటిస్తానన్నారు. కోవర్టులు వారి తీరును మార్చుకోకపోతే వారి పేర్లను మీడియాకు ఇస్తానన్నారు.

గతంలో ఈటల రాజేందర్ కూడా

అన్ని పార్టీల్లో సీఎం కేసీఆర్ కోవర్టులున్నారంటూ గతంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. బీజేపీలోనూ కేసీఆర్ కోవర్టులున్నారని ఈటల అన్నారు. అయితే ఈటల వ్యాఖ్యలపై స్పందిస్తూ... బీజేపీలో కేసీఆర్ కోవర్టులు లేరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొట్టిపడేశారు. కోవర్టులున్నారని ఎవరైనా నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. తాజాగా బీజేపీ కోవర్టులున్నారని ఆ పార్టీ నేత నందీశ్వర్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో కేసీఆర్ కోవర్టులు ఉన్న మాట నిజమేనని నందీశ్వర్ గౌడ్ అన్నారు. కోవర్టుల పేర్లను అధిష్ఠానానికి అందించానన్నారు. వారి తీరు మారకపోతే మీడియా సాక్షిగా అందరి పేర్లు బయట పెడతానని నందీశ్వర్ గౌడ్ హెచ్చరించారు. మరో 15 రోజుల్లో తన సంచలన ప్రకటన చేస్తానన్నారు. తాను బండి సంజయ్, ఈటెల రాజేందర్ వర్గం కాదన్న నందీశ్వర్ గౌడ్.. వచ్చే ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని సీఎంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

మళ్లీ తెరపైకి కోవర్టుల టాపిక్

అన్ని పార్టీల్లోనూ కేసీఆర్ కోవర్టులున్నారని ఇటీవల ఈటల రాజేందర్ అన్నారు. వారి వల్లే కేసీఆర్ పార్టీలను దెబ్బతీస్తున్నారన్నారు. ఇన్ ఫార్మర్లు తమ వ్యూహాలను కేసీఆర్‌కు చేరవేరుస్తున్నారన్నారు. లీకుల కారణంగా నేతలు బీజేపీలో చేరేందుకు వెనకడుగు వేస్తున్నారన్నారు. ఈటల ఆరోపణలను బండి సంజయ్ అప్పట్లో తప్పుబట్టారు. తమ పార్టీలో కోవర్టులెవరూ లేరన్నారు. బీజేపీలో కోవర్టులుండే ఛాన్సే లేదన్నారు. అయితే తెలంగాణ బీజేపీ నేతల మధ్య విభేదాలున్నాయని జోరుగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో మళ్లీ కోవర్టుల అంశం తెరపైకి వచ్చింది. నందీశ్వర్ గౌడ్ కూడా కోవర్టుల కామెంట్స్ చేయటం హాట్ టాఫిక్‌గా మారింది. నందీశ్వర్ గౌడ్ వ్యాఖ్యలతో తెలంగాణ బీజేపీలో అంతర్గత కలహాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. అయితే నందీశ్వర్ గౌడ్ కాంగ్రెస్ లోకి చేరుతున్నారని, అందుకే బీజేపీ అలజడి సృష్టించేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారని బీజేపీ నేతలు అంటున్నారు.

తదుపరి వ్యాసం