తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Govt Schools : ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా ఎంతమంది విద్యార్థులు చేరారంటే

Govt Schools : ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా ఎంతమంది విద్యార్థులు చేరారంటే

HT Telugu Desk HT Telugu

20 June 2022, 14:44 IST

google News
    • ఈ విద్యాసంవత్సరం తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు చూస్తున్నారు. ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలతో ఆసక్తి కనబరుస్తున్నట్టుగా తెలుస్తోంది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో తల్లిదండ్రులు.. ప్రభుత్వ పాఠశాలలవైపు చూస్తున్నట్టుగా కనిపిస్తోంది. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు తల్లిదండ్రులు. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు నిర్వహిస్తున్న బడి-బాట (అడ్మిషన్ డ్రైవ్)లో భాగంగా జూన్ 18 నాటికి 1,22,956 మంది విద్యార్థులు 1 నుండి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. ఈ డ్రైవ్ ఈ నెలాఖరు వరకు కొనసాగుతుంది.

ప్రైవేటు పాఠశాలల్లో చదివే వార్డుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. జూన్ 18వ తేదీనే 3,000 మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో సీట్లు మిగిలి ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుండి అన్ని ప్రభుత్వ మరియు స్థానిక సంస్థల పాఠశాలల్లో 1 నుంచి 8 తరగతులకు ఆంగ్ల మాధ్యమ బోధనను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంతో అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ సహకారంతో మొత్తం 1.04 లక్షల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వం ద్విభాషా పాఠ్యపుస్తకాలను కూడా అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు-మన బడి/ మన బస్తీ-మన బడి కార్యక్రమంలో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తోంది. విద్యార్థుల కోసం పాఠశాలల రూపురేఖలు, సౌకర్యాలను మెరుగుపరుస్తోంది.

ఈ కార్యక్రమంలో భాగంగా 18,240 ప్రాథమిక, 3,164 ప్రాథమికోన్నత, 4,661 ఉన్నత పాఠశాలలు సహా మొత్తం 26,065 పాఠశాలలు దశలవారీగా రూ.7,289.54 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి చేస్తున్నారు. మూడేళ్ల వ్యవధిలో ఇవి రూపుదిద్దుకోనున్నాయి. మొదటి దశలో పునరుద్ధరిస్తున్న 9,123 పాఠశాలల్లో 5,399 ప్రాథమిక పాఠశాలలు, 1,009 ప్రాథమికోన్నత పాఠశాలలు, 2,715 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి.

విద్యుదీకరణ, తాగునీటి సరఫరా, విద్యార్థులు మరియు సిబ్బందికి ఫర్నిచర్, పాఠశాల మొత్తం పెయింటింగ్, మరమ్మతులు వంటి 12 మౌలిక సదుపాయాల కోసం లెక్కలు వేసుకుని అభివృద్ధి చేస్తున్నారు.

ప్రత్యేక బ్రిడ్జి కోర్సు

ప్రభుత్వ పాఠశాలల్లో నాలుగు వారాలాపాటుగా.. బ్రిడ్జి కోర్సు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర విద్య, శిక్షణ, పరిశోధన మండలి (SCERT) జిల్లా విద్యాశాఖ అధికారులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కరోనా కారణంగా విద్యార్థులు చాలా నష్టపోయారు. చదువులో వెనకబడిపోయారు. దీంతో విద్యార్థులను తిరిగి గాడిలో పెట్టేందుకు బ్రిడ్జి కోర్సు ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన.. పాఠ్య ప్రణాళికను కూడా రూపొందించారు.

రెండో తరగతి నుంచి పదో తరగతి వరకూ ఉన్న విద్యార్థులకు 4 వారాలపాటు బ్రిడ్జి కోర్సు నిర్వహించనున్నారు. అయితే దీనికి సంబంధించి... ప్రధానోపాధ్యాయులే బాధ్యత తీసుకోవాలని ఆదేశాలు అందాయి. చదవడం, రాయడం, ప్రమాణాలు పెంచేలా పాఠ్య ప్రణాళిక రూపొందించారు. బ్రిడ్జి కోర్సు మాడ్యూళ్లు తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో ఉంటాయని విద్యాశాఖ చెప్పింది. మరోవైపు.. మొదటి తరగతిలో చేరే విద్యార్థులకు 12 వారాలపాటు విద్యాప్రవేశ్‌ పేరుతో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.

తదుపరి వ్యాసం