తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Acb Trap In Warangal : ఫైల్ క్లియరెన్స్ కు లంచం డిమాండ్ - ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈ

ACB Trap in Warangal : ఫైల్ క్లియరెన్స్ కు లంచం డిమాండ్ - ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈ

HT Telugu Desk HT Telugu

28 November 2024, 21:56 IST

google News
    • వరంగల్ జిల్లాలో లంచం తీసుకుంటూ పంచాయతీరాజ్ ఏఈ ఏసీబీకి చిక్కాడు. ఫైల్ క్లియర్ చేసేందుకు రూ.5 వేలు లంచం డిమాండ్ చేశాడు. ఈ మొత్తాన్ని తీసుకునే క్రమంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏఈ కార్తీక్ ను వరంగల్ ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టారు.
ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈ
ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈ

ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈ

ఉమ్మడి వరంగల్ జిల్లాలో అవినీతి అధికారుల తీరు మారటం లేదు. ప్రజలకు నిస్వార్థంగా సేవలందించాల్సిందిపోయి.. లంచాలకు మరుగుతున్నారు. ఇప్పటికే వివిధ ఘటనల్లో పలువురు అధికారులు అవినీతి నిరోధక శాఖకు చిక్కగా.. తాజాగా మరో అధికారి కూడా ఏసీబీకి పట్టుబడ్డాడు.

గత ప్రభుత్వ హయాంలో గ్రామంలో నిర్మించిన సీసీ రోడ్లకు సంబంధించిన బిల్స్ క్లియర్ చేయాల్సిందిగా అప్పటి గ్రామ సర్పంచ్ ఆఫీసర్లకు విన్నవించుకోగా.. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కు చెందిన ఓ అసిస్టెంట్ ఇంజినీరు ఫైల్ క్లియరెన్స్ కోసం రూ.5 వేలు డిమాండ్ చేశారు. దీంతో లంచం ఇవ్వడం ఇష్టం లేక బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. 

పక్కా పథకం రచించిన అవినీతి నిరోధక శాఖ అధికారులు లంచం డిమాండ్ చేసిన ఆఫీసర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బాధితుడు, ఏసీబీ అధికారులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కడారిగూడెం గ్రామానికి మంద సతీష్ సర్పంచ్ గా పని చేశారు. ఆయన సర్పంచ్ పదవిలో ఉన్న సమయంలో గ్రామంలో మూడు చోట్ల సీసీ రోడ్లు నిర్మించారు. ఆ రోడ్లకు ఉపాధిహామీ నిధులు దాదాపు రూ.9 లక్షలు కేటాయించగా, గతేడాది జనవరి నెలలోనే పనులు పూర్తయ్యాయి. అప్పటి నుంచి తనకు రావాల్సిన బిల్లుల కోసం మంద సతీష్ ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నాడు.

ఫైల్ క్లియరెన్స్ కు రూ.5 వేలు డిమాండ్

మాజీ సర్పంచ్ సతీష్ తనకు రావాల్సిన బిల్లుల కోసం వరంగల్ జిల్లా పరిషత్తు కార్యాయలంలోని పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లను సంప్రదించాడు. కానీ బిల్లులు మంజూరు చేయడానికి వారు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతోనే ఏడాదిన్నర కాలంగా సతీష్ ఆఫీసర్ల చుట్టు తిరుగుతూనే ఉన్నాడు. ఈ క్రమంలో సతీష్ పంచాయతీరాజ్ డ్రాయింగ్ విభాగానికి సంబంధించిన ఏఈ గాదె కార్తీక్ ను సంప్రదించాడు. ఆయన బిల్స్ ఫైల్ క్లియరెన్స్ చేసేందుకు రూ.5 వేలు లంచం డిమాండ్ చేశాడు.

దీంతో లంచం ఇవ్వడానికి మనసొప్పని మాజీ సర్పంచ్ సతీష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు గురువారం రూ.5 వేలు తీసుకుని పీఆర్ ఆఫీస్ కు వెళ్లాడు. కానీ అక్కడ కార్తీక్ లేకపోవడంతో అతడికి కాల్ చేశాడు. దీంతో ఆయన హనుమకొండ నక్కలగుట్టలోని హరిత హోటల్ కు రమ్మని చెప్పడంతో అక్కడికి వెళ్లాడు. అక్కడ సతీష్ నుంచి కార్తీక్ లంచం తీసుకుంటుండగా, ఏసీబీ అధికారులు ఎంట్రీ ఇచ్చి కార్తీక్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 

అనంతరం వరంగల్ జిల్లా పరిషత్తు ఆవరణలో ఉన్న పంచాయతీరాజ్ ఆఫీస్ లోనూ సోదాలు జరిపారు. ఆ తరువాత ఏఈ కార్తీక్ ను వరంగల్ ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టేందుకు తీసుకెళ్లారు. కాగా ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాల్సిందిగా ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. హనుమకొండ బాలసముద్రంలోని ఏసీబీ కార్యాలయంలో లేదా 1064 ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి సమాచారం ఇవ్వొచ్చని చెబుతున్నారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)

తదుపరి వ్యాసం