తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Revanth Reddy Met Jupally : జూపల్లితో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి భేటీ- కాంగ్రెస్ లో చేరాలని ఆహ్వానం!

Revanth Reddy Met Jupally : జూపల్లితో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి భేటీ- కాంగ్రెస్ లో చేరాలని ఆహ్వానం!

21 June 2023, 15:48 IST

google News
    • Revanth Reddy Met Jupally : మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటికి వెళ్లిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆయన కాంగ్రెస్ లోకి రావాలని కోరారు. పాలమూరు జిల్లా అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం అని రేవంత్ అన్నారు.
జూపల్లితో రేవంత్, కోమటిరెడ్డి భేటీ
జూపల్లితో రేవంత్, కోమటిరెడ్డి భేటీ

జూపల్లితో రేవంత్, కోమటిరెడ్డి భేటీ

Revanth Reddy Met Jupally :మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. జూపల్లి ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి బృందం...లంచ్ మీటింగ్ పాల్గొన్నారు. జూపల్లిని కాంగ్రెస్ లో చేరాలని కోరారు. అనంతరం జూపల్లి కృష్ణారావు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పాలమూరు జిల్లా అభివృద్ధి కోసం జూపల్లి, గుర్నాథ్ రెడ్డి, దామోదర్ రెడ్డి గతంలో బీఆరెస్ లో చేరారని గుర్తుచేశారు. తొమ్మిదేళ్లు గడిచినా సీఎం కేసీఆర్ పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. అందుకే వారంతా కేసీఆర్ పై తిరుగుబావుటా ఎగరేశారని తెలిపారు. పాలమూరు జిల్లా అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం అని రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే వారిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించడానికి వచ్చామన్నారు.

ఇంకా చాలా మంది కాంగ్రెస్ లోకి

"తెలంగాణలో కేసీఆర్ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణ కోసమే ఈ చేరికలు. ఈ చేరికలు తెలంగాణ ప్రజలకు మేలు చేసేందుకే. వీళ్లే కాదు.. ఇంకా చాలా మంది కాంగ్రెస్ లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. మంచి ముహూర్తంలో వీరంతా కాంగ్రెస్ లో చేరతారు. తెలంగాణలో 15 పార్లమెంటు స్థానాలు గెలిపించి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని క్రియాశీలకం చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయి. 2024లో రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే మా లక్ష్యం. మహబూబ్ నగర్ జిల్లాను కేసీఆర్ మోసం చేశారు. కాంగ్రెస్ లో చేరేందుకు జూపల్లి సానుకూలంగా స్పందించారు."- రేవంత్ రెడ్డి

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ... మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధి కోసం జూపల్లి ఎంతో కృషి చేశారన్నారు. జూపల్లి కృష్ణారావు, గురునాథ రెడ్డిని కాంగ్రెస్ లో చేరాలని కోరామన్నారు. కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన పాలమూరు ప్రాజెక్టు పనులు ఇంకా 40 శాతం కూడా కాలేదన్నారు. అవసరంలేదని కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రెండు లక్షల కోట్ల ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం కోసం జూపల్లి కృష్ణారావు కృషి చేశారన్నారు.

కాంగ్రెస్ లో చేరికలు

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కొందరు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు నేతలు. నిర్మల్, కొడంగల్, గజ్వేల్, మానకొండూరు నియోజకవర్గాల నేతలు కాంగ్రెస్ లో చేరారు. కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండల బీఆరెస్ కార్యకర్తలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. నిర్మల్ పట్టణానికి చెందిన కొందరు నేతలు బీజేపీ నుంచి తిరిగి కాంగ్రెస్ లో చేరారు. గజ్వేల్ నియోజవర్గానికి చెందిన పలువురు బీఆరెస్ కార్యకర్తలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మానకొండూరు నియోజకవర్గానికి చెందిన గన్నేరువరం మండలం మైలారం, చొక్కారావుపల్లి, సాంబయ్యపల్లి సర్పంచులు, గన్నేరువరం ఎంపీటీసీ, ఖాసీంపేట ఉపసర్పంచ్, పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు హస్తం పార్టీలో చేరారు.

తదుపరి వ్యాసం