తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hmwssb Ots : హైదరాబాద్ నగర ​వాసులకు గుడ్ న్యూస్ - మళ్లీ Ots స్కీమ్ అమలు, ఈ ఛాన్స్ అస్సలు మిస్ కాకండి..!

HMWSSB OTS : హైదరాబాద్ నగర ​వాసులకు గుడ్ న్యూస్ - మళ్లీ OTS స్కీమ్ అమలు, ఈ ఛాన్స్ అస్సలు మిస్ కాకండి..!

06 October 2024, 6:40 IST

google News
    • హైదరాబాద్ జలమండలిలో మళ్లీ ఓటీఎస్ స్కీమ్ వచ్చేసింది. ఈ మేరకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అక్టోబర్ 31 వరకు అమలు చేయనున్నారు.  ఆలస్య రుసుముతో పాటు వడ్డీమాఫీ కానుంది. నల్లా కనెక్షన్ యాక్టివ్ లో ఉన్న వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. 
జలమండలిలో మళ్లీ ఓటీఎస్
జలమండలిలో మళ్లీ ఓటీఎస్ (image source HMWSSB X)

జలమండలిలో మళ్లీ ఓటీఎస్

జలమండలి వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న బకాయిలు చెల్లించేందుకు చక్కటి అవకాశం కల్పించింది. ఇందుకోసం వన్ టైమ్ సెటిల్ మెంట్ (ఓటీఎస్-2024) పథకాన్ని మళ్లీ తీసుకొచ్చింది.

విజయ దశమి పండగను పురస్కరించుకుని ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకురాగా.. ఈ నెల మొదటి నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుంది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీర్ఘకాలికంగా బిల్లులు చెల్లించకుండా ఉన్న వారికి.. ఎలాంటి ఆలస్య రుసుము, వడ్డీ లేకుండా బకాయిలు చెల్లించే సువర్ణ అవకాశాన్ని కల్పించింది.

అక్టోబర్ 31 వరకు అవకాశం…!

జలమండలిలో నీటి బకాయిలు పెరిగిపోతుండటంతో.. వాటిని తగ్గించేందుకు ఓటీఎస్ అమలు చేయాలని వాటర్ బోర్డు ప్రభుత్వానికి గత నెల 19న లేఖ రాసింది. దీనికి స్పందించిన ప్రభుత్వం.. అందుకు అనుమతులిస్తూ తాజాగా ఉత్తర్వులు వెలువరించింది. ఈ ఓటీఎస్ కింద.. వినియోగదారులు తమ బకాయిలను ఎలాంటి ఆలస్య రుసుం, వడ్డీ లేకుండా చెల్లించవచ్చు. ఈ పథకం అక్టోబర్ నెలాఖరు వరకు అమల్లో ఉంటుంది. జలమండలిలో గతంలో రెండు సార్లు ఈ వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ను అమలు చేశారు. 2016, 2020 లో అమలు చేశారు.

నిబంధనలు…

  • ఓటీఎస్ ఈ నెల 31 వరకు మాత్రమే అమల్లో ఉంటుంది.
  • నల్లా కనెక్షన్ యాక్టివ్ లో ఉన్న వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
  • గతంలో ఓటీఎస్ పథకాన్ని వినియోగించుకోని వారు.. ఒకేసారి బిల్లు చెల్లిస్తే.. ఆలస్య రుసుం, వడ్డీ మాఫీ అవుతాయి.
  • గతంలో ఓటీఎస్ పథకం ద్వారా ప్రయోజనం పొందిన వినియోగదారులకు 50 శాతం వరకు బిల్లు మాఫీ అవుతుంది.
  • ఈ పథకం కింద ప్రయోజనం పొందాలనుకునే వినియోగదారులు.. భవిష్యత్తులో 24 నెలల పాటు తప్పనిసరిగా క్రమంగా బిల్లులు చెల్లిస్తామని అఫిడవిట్ రాసి ఇవ్వాలి. అంతేకాకుండా.. బిల్లు చెల్లింపుల విషయంలో వారు విఫలమైతే, ఈ పథకం కింద వారు పొందిన ప్రయోజనాన్ని రద్దు చేస్తారు.
  • తమ నల్లా కనెక్షన్.. డిస్ కనెక్షన్ స్థితిలో ఉన్న వినియోగదారులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాలనుకుంటే.. ఇప్పటి దాకా పెండింగ్ లో ఉన్న బిల్లు చెల్లించాల్సి ఉంటుంది.

వడ్డీ మాఫీ పరిధి ఇలా..

నల్లా బిల్లుల బకాయిలపై వడ్డీ మాఫీ కోసం అధికారులకు స్థాయిని బట్టి అమౌంట్ పరిధిని నిర్ణయించారు. ఈ విషయాన్ని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. దీని ప్రకారం.. మేనేజర్ స్థాయిలో రూ.2000 వరకు, డిప్యూటీ జనరల్ మేనేజర్ స్థాయిలో రూ.2001 నుంచి రూ.10,000 వరకు, జనరల్ మేనేజర్ స్థాయిలో రూ.10,001 నుంచి రూ.1,00,000 వరకు, చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయిలో రూ.1,00,001 నుంచి అంతకంటే ఎక్కువ మాఫీ చేసే అధికారం ఉంది.

దీర్ఘకాలికంగా బిల్లులు చెల్లించని వినియోగదారుల కోసం ఈ ఓటీఎస్ పథకాన్ని తీసుకొచ్చామని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. ఈ చివరి అవకాశాన్ని వియోగదారులు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. ఈ నెలాఖరులోగా పెండింగ్ బకాయిలు చెల్లించి.. ఆలస్య రుసుం, వడ్డీ నుంచి మినహాయింపు పొందాలని వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు.

తదుపరి వ్యాసం