Osmania university | దేశంలోనే ఫస్ట్ టైమ్.. ఒక కాలేజీలో చేరి మరో దాంట్లో చదువుకోవచ్చు
24 May 2022, 15:02 IST
- ఒక కాలేజీలో చేరాక.. అక్కడ బోధన నచ్చకపోవచ్చు. ఇక చేసేదేమి లేక అక్కడే మెుత్తం చదవాల్సి వచ్చేది. కానీ తాజాగా ఉస్మానియా యూనివర్సిటీ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది.
ఉస్మానియా విశ్వవిద్యాలయం
కాలేజీలో చేరిపోయాక.. మళ్లీ వేరే కళశాలకు వెళ్లాలంటే.. టీసీ, ఇతర సర్టిఫికేట్లు నానా ఇబ్బందులు ఉంటాయి. బోధన సరిగా లేదు అనిపించినా.. అక్కడే ఉండిపోవాలి. కానీ.. ఉస్మానియా యూనివర్సిటీ ఓ కొత్త విధానానికి తెరలేపింది. దేశంలోనే తొలిసారిగా క్లస్టర్ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధానం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి వస్తుంది. క్లస్టర్ విధానం కిందకు వచ్చిన కళాశాలల్లోని చేరిన విద్యార్థులు.. వేరే కళాశాలలో చేరే అవకాశం ఉంటుంది.
ఇలా తొలిసారిగా.. ఉస్మానియా విశ్వవిద్యాలయం పది అటానమస్ కళాశాలలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చింది. ఇలా క్లస్టర్ విధానానికి అమలుచేయాలని ప్రణాళికలు వేసింది. సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్‌మిత్తల్, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొ.ఆర్.లింబాద్రి, వైస్‌ఛైర్మన్ వి.వెంకటరమణ, ఓయూ ఉపకులపతి ప్రొ.డి.రవీందర్ సమక్షంలో ఓయూలో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు.
2022-23 విద్యా సంవత్సరం నుంచి ఈ విధానం అమలులోకి వస్తుంది. ఇందులో భాగంగా కాలేజీలో చేరిన విద్యార్థులు.. మరో కాలేజీలో చేరే అవకాశం ఉంటుంది. ఈ క్లస్టర్ విధానం ప్రకారం.. మెుదట చేరిన కళాశాలలో ఏదైనా సబ్జెక్టు, పేపర్‌కు బోధకులు సరిగా లేరని భావించినా.. సరైనా సదుపాయాలు లేవనుకున్నా.. వేరే కళాశాలలో ఉన్నాయనుకుంటే మారిపోవచ్చు. ఈ అవకాశం సెమిస్టర్ లేదా పూర్తి మూడేళ్లకు సద్వినియోగం చేసుకునే వెసులుబాటు ఉంది. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా.. ఉమ్మడి పాఠ్య ప్రణాళిక ఉంటుంది.
మెహిదీపట్నం సెయింటాన్స్ కళాశాల, సికింద్రాబాద్ లయోలా అకాడమీ, సెయింట్‌జోసెఫ్ డిగ్రీ, పీజీ కళాశాల, సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాల, నారాయణగూడ ఆర్‌బీవీవీఆర్‌ఆర్ కళాశాల, సైనిక్‌పురి భవన్స్ వివేకానంద కళాశాల, నిజాం కళాశాల, కోఠి మహిళా కళాశాల, ప్రభుత్వ సిటీ కళాశాల, బేగంపేట మహిళా కళాశాలలు క్లస్టర్ కిందకు వస్తాయి.
టాపిక్