OU One Time Chance : పీజీ, డిగ్రీ బ్యాక్ లాగ్స్ .. క్లియర్ చేసేందుకు మరో ఛాన్స్
08 January 2023, 21:57 IST
- OU One Time Chance : పీజీ, డిగ్రీ బ్యాగ్ లాక్స్ ఉన్న వారికి వన్ టైం ఛాన్స్ కల్పించంది ఉస్మానియా యూనివర్సిటీ. గడువులోగా ఎగ్జామ్ ఫీజు చెల్లించాలని.. త్వరలోనే పరీక్షల తేదీలు ప్రకటిస్తామని వెల్లడించింది.
ఉస్మానియా విశ్వవిద్యాలయం
OU One Time Chance : మీరు... 2000 నుంచి 2017 మధ్య ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో పీజీ చదివారా ? 2004 నుంచి 2014 మధ్య కాలంలో ఓయూ పరిధిలో డిగ్రీ అభ్యసించారా ? ఏదైనా కారణంతో డిగ్రీ, పీజీ పూర్తి చేయలేకపోయారా ? నిర్ణీత కాలంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయలేకపోయామని బాధపడుతూ మరో అవకాశం కోసం ఎదురుచూస్తున్నారా ? అయితే... మీలాంటి వారి కోసమే ఉస్మానియా యూనివర్సిటీ మరో అవకాశాన్ని కల్పించింది. 2000 - 2017 మధ్య పీజీ... 2004 - 2014 మధ్య డిగ్రీ చదివి ఉండి... ఇంకా బ్యాక్ లాగ్స్ ఉన్న వారు .. తమ సబ్జెక్టులని క్లియర్ చేసుకొని పట్టా పొందేందుకు ఛాన్స్ ఇచ్చింది. ఈ మేరకు పీజీ, డిగ్రీ కి వన్ టైం ఛాన్స్ ఇస్తూ.. ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జామ్ నోటిఫికేషన్ జారీ చేసింది.
2000 - 2017 మధ్య పీజీ కోర్సుల్లో రిజిస్టరై... ఇప్పటికీ బ్యాక్ ల్యాగ్స్ ఉన్న వాళ్లకు వన్ టైం ఛాన్స్ పేరిట ఓయూ మరోసారి అవకాశాన్ని కల్పించింది. ఈ పరీక్షలకు హాజరవ్వాలని అనుకునే వారు ఒక్కో పేపర్ కి రూ. 10 వేల పెనాల్టీ ఛార్జెస్ చెల్లించాలని పేర్కొంది. దీనితో పాటుగా రెండు పేపర్లు అయితే రూ. 1160... రెండు పేపర్ల కన్నా ఎక్కువ ఉంటే రూ. 2050 పరీక్ష ఫీజు కింద చెల్లించాలని వెల్లడించింది. జనవరి 27 లోపు పరీక్ష ఫీజు చెల్లించాలని... ఆలస్య రుసుము రూ. 300 తో ఫిబ్రవరి 4 వరకు గడువు ఉంటుందని పేర్కొంది. దరఖాస్తులను ఓయూ క్యాంపస్ ఎగ్జామ్ బ్రాంచి పీజీ సెక్షన్ లో సమర్పించాలని సూచించింది.
2000 - 2014 మధ్య ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కళాశాలల్లో డిగ్రీ చదివిన వాళ్లకు బ్యాక్ లాగ్స్ క్లియర్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది ఓయూ పాలక వర్గం. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీఎస్ డబ్ల్యూ కోర్సుల్లో ఇంకా సబ్జెక్టులు క్లియర్ కాకుండా మిగిలి ఉన్న వారు.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంది. ఈ పరీక్షలకు హాజరవ్వాలని అనుకునే వారు ఒక్కో పేపర్ కి రూ. 10 వేల పెనాల్టీ ఛార్జెస్ చెల్లించాలని పేర్కొంది. దీనితో పాటుగా పరీక్ష ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుందని వివరించింది. జనవరి 20 వరకు దరఖాస్తులు సమర్పించాలని... లేట్ ఫీజు రూ. 500 తో కలిపి జనవరి 25వ వరకు అవకాశం ఉందని పేర్కొంది. డిగ్రీ విద్యార్థులు తమ కళాశాలల్లో ఫీజు చెల్లించవచ్చని సూచించింది. డిగ్రీ, పీజీ బ్యాక్ లాగ్స్ దరఖాస్తు, ఫీజుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఓయూ వెబ్ సైట్ ను సందర్శించగలరు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం.. గత కొన్నేళ్లుగా బ్యాక్ ల్యాగ్స్ క్లియర్ చేసుకునేందుకు వన్ టైం ఛాన్స్ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. గతంలో నామమాత్రపు ఫీజుతో ఈ పరీక్షలు నిర్వహించిన ఓయూ... గతేడాది నుంచి పెనాల్టీ ఛార్జెస్ కింద భారీ మొత్తంలో వసూలు చేస్తోంది. దీనిపై విద్యార్థి సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఒక్కో పేపర్ కి రూ. 10 వేల పెనల్ ఛార్జెస్ చెల్లించాలనడం.. పేదలను విద్యకు దూరం చేయడమే అనే విమర్శలు వస్తున్నాయి. అభ్యర్థుల అవకాశాన్ని ఆసరాగా చేసుకొని... యూనివర్సిటీ సొమ్ము చేసుకుంటోందని ఆరోపిస్తున్నారు. పెనల్ ఛార్జెస్ తగ్గించాలని విద్యార్థులు, అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.